కేసీఆర్ ను ఫామ్​హౌస్​కే పరిమితం చెయ్యాలె : డీకే శివకుమార్

కేసీఆర్ ను ఫామ్​హౌస్​కే పరిమితం చెయ్యాలె : డీకే శివకుమార్

హనుమకొండ/ధర్మసాగర్, కాజీపేట, వెలుగు: బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఎమ్మెల్యేలకే సీఎంను కలిసే అవకాశం ఉండదని, ఎప్పుడూ ఫామ్ హౌస్ లోనే ఉండే కేసీఆర్​ను అక్కడనే ఉంచాలని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సెక్రటేరియెట్​లో ఉంటూ నిరంతరం ప్రజాసేవ చేసే ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. స్టేషన్ ఘన్ పూర్, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, పశ్చిమ కాంగ్రెస్​ అభ్యర్థులు సింగపురం ఇందిరా, కేఆర్ నాగరాజు, కొండా సురేఖ, నాయిని రాజేందర్ రెడ్డికి మద్దతుగా శుక్రవారం ఆయా నియోజకవర్గాల్లో  నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడారు.

సీఎం కేసీఆర్ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీతో పాటు దళితులను వెన్నుపోటు పొడిచిన మోసకారి అని మండిపడ్డారు. ఇచ్చిన మాటకు  కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే.. టీఆర్ఎస్​ను కాంగ్రెస్​లో విలీనం చేస్తానని, దళితుడిని సీఎంగా ప్రకటిస్తానని చెప్పి, కేసీఆర్ అధికారాన్ని చేజిక్కించుకుని మోసం చేశాడని విమర్శించారు. 

కేసీఆర్ దేశంలోనే అత్యంత అవినీతి సీఎం

దళిత సీఎం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రైతులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని సీఎం ఎందుకని డీకే ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయల కమీషన్ తిన్నాడని ఆరోపించారు. నాసిరకంగా కట్టడం వల్లే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయని విమర్శించారు. కేసీఆర్ అనేక అవినీతి, అక్రమాలు చేశాడని, దేశంలోనే అత్యంత అవినీతి సీఎం ఆయనేనని చెబుతున్న ప్రధాని మోదీ.. ఆయనపై విచారణ జరపకుండా ఏం ఒప్పందం చేసుకున్నారో చెప్పాలన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని, పార్లమెంలో మోదీ తీసుకొచ్చే ప్రతి చట్టానికి కేసీఆర్ మద్దతు తెలపడమే ఇందుకు నిదర్శనమన్నారు. టీఎస్​పీఎస్సీ లీకేజీలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం  నిద్రపోయిందా అని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా.. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్​ సర్కారును ఇంటికి పంపేందుకు తెలంగాణ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

కర్నాటక గ్యారంటీలను చూసి రండి

కర్నాటకలో కాంగ్రెస్ హామీలు అమలవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్లి చూసిరండని కేసీఆర్, కేటీఆర్​కు డీకే సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఒక్కసారి మాట ఇస్తే వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదని, కేసీఆర్ లాగా తాము అబద్ధాలు చెప్పే రకం కాదన్నారు. కర్నాటకలో 5 గ్యారంటీలు ప్రకటించి మొదటి కేబినెట్ సమావేశంలోనే సంతకం చేసి వాటన్నింటిని అమలు చేస్తున్నామని చెప్పారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిసెంబర్ 9 నుంచే 6 గ్యారంటీలు అమలవుతాయని తెలిపారు. ఆయన వెంట ఏఐసీసీ అబ్జర్వర్ చారులత, రవీంద్ర ఉత్తమ్ దళ్వి, బండ్రు శోభారాణి, గుర్రపు ప్రసాద్ తదితరులు ఉన్నారు.