
- లీడర్ల సడెన్ ఎంట్రీలతో ట్విస్టుల మీద ట్విస్టులు
- ఎప్పటినుంచో ఆశిస్తున్న ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి
- ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మావోయిస్టు అశోక్
- ఢిల్లీ బాటపట్టిన డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్
- రీసెంట్గా సీన్లోకి వచ్చిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి
- కొండా మురళికే ఇవ్వాలంటున్న పార్టీ శ్రేణులు
హనుమకొండ, వెలుగు : పరకాల కాంగ్రెస్ టికెట్ విషయంలో రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. అధిష్టానం టికెట్కేటాయింపుపై కసరత్తు చేస్తుండగానే.. అనుకోని లీడర్ల పేర్లు తెరమీదకు వస్తుండడం, వాళ్లంతా పార్టీలోకి ఎంట్రీ ఇస్తుండడం ఆసక్తి రేపుతోంది. పరకాల టికెట్‌పై ఎప్పటి నుంచో ఇనుగాల వెంకట్రామ్రెడ్డి ఆశలు పెట్టుకోగా.. ఇటీవల మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్ అలియాస్ఐతు పేరు సడెన్‌గా తెరమీదకు వచ్చింది. ఆయనకే టికెట్దక్కుతుందని అందరూ భావించగా.. ఎవరూ ఊహించని విధంగా మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఈ నెల18న ములుగులో నిర్వహించే సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో రేవూరి బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరుతుండడంతో పరకాలలో కాంగ్రెస్టికెట్ల వ్యవహారం రసవత్తరంగా మారింది.
సిట్టింగ్ఎమ్మెల్యేపై వ్యతిరేకత కలిసొస్తుందని...
పరకాల సిట్టింగ్ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లినప్పుడు చాలాచోట్ల ప్రజలు అడ్డుకున్న ఘటనలున్నాయి. దీంతో అధికార పార్టీపై వ్యతిరేకత కలిసి వస్తుందని, ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమన్న ధీమాతో చాలామంది లీడర్లు కాంగ్రెస్ టికెట్‌కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే పార్టీ సీనియర్‌నేత ఇనుగాల వెంకట్రామ్రెడ్డి ప్రయత్నాలు చేస్తుండగా..డాక్టర్కొత్తగట్టు శ్రీనివాస్కూడా టికెట్ఆశిస్తున్నారు.
పార్టీ కండువా కప్పుకోకపోయినా టికెట్‌కోసం ఢిల్లీ బాట పట్టారు. మరోవైపు కొద్ది రోజుల కిందటే మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్అలియాస్ ఐతు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరి టికెట్ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉద్యమ నేపథ్యమున్న కుటుంబం, ప్రజల్లో మంచి పేరుండడం, పార్టీ కూడా బీసీ స్ట్రాటజీ అవలంబిస్తోందనే సంకేతాలు అందడంతో అశోక్ కే టికెట్ వస్తుందని అందరూ భావించారు.
రేవూరి సడెన్ ఎంట్రీ
మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పొత్తులో భాగంగా వరంగల్ పశ్చిమం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి తర్వాత బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆయన అకస్మాత్తుగా పరకాల కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ నెల 18న ఉమ్మడి వరంగల్ జిల్లాకు రాహుల్‌గాంధీ రానుండగా..ఆయన సమక్షంలోనే రేవూరి కాంగ్రెస్‌లో చేరనున్నారు. రెండు రోజుల కింద హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డిని కలిశారు.
టీడీపీలో ఉన్నప్పుడు ఇద్దరూ సన్నిహితులు కావడం, ఇప్పుడు రేవంత్నుంచే కాల్రావడంతో పరకాలలో టికెట్రేవూరికే ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ, రేవూరి వరంగల్ పశ్చిమం టికెట్ఆశించగా పరకాల టికెట్కన్ఫామ్చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు. టికెట్ పక్కా అనే హామీ రావడంతోనే ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నారని చెబుతున్నారు. దీంతో పరకాలపై ఆశలు పెట్టుకున్న మిగతా నాయకులు తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు.
కొండాకే ఇవ్వాలంటున్న లీడర్లు
పరకాల టికెట్ రేవూరి ప్రకాశ్రెడ్డికేనని ప్రచారం జరుగుతుండగా.. మళ్లీ కొండా మురళి పేరు తెరమీదకు వచ్చింది. గత ఎన్నికల్లో కొండా సురేఖ సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. అయినా, ఇప్పటికీ అక్కడ కొండా ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది. కానీ, తాము పరకాల బరిలో ఉండబోమని, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేస్తామని కొండా దంపతులు గతంలోనే క్లారిటీ ఇచ్చారు. కాగా, అనూహ్యంగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి పేరు తెరమీదకు రావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో గందరగోళం ఏర్పడింది. దీంతోనే పరకాల టికెట్ కొండా మురళికే టికెట్ ఇవ్వాలంటూ సోమవారం వరంగల్ ప్రెస్ క్లబ్లో ఆ పార్టీ పరకాల లీడర్లు సమావేశం ఏర్పాటు చేశారు.
కొండా మురళికే ఇవ్వాలని, స్థానికేతరులకు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇతరులకు ఇవ్వాల్సి వస్తే కొండా దంపతులు సూచించిన వారికే ఇవ్వాలని కోరారు. దీనిపై కొండా దంపతులు క్లారిటీ ఇవ్వకపోవడం కూడా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే కొండా మురళి, గాజర్ల అశోక్ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారనే ప్రచారం జరుగుతుండగా..రేవూరి వర్గం ఆచుతూచి అడుగులు వేస్తోంది.