హిజ్రాలపై చిన్నచూపు

హిజ్రాలపై చిన్నచూపు
  • హిజ్రాలపై చిన్నచూపు
  • ఎన్నికల్లో ట్రాన్స్​జెండర్లకు దక్కని ప్రాధాన్యం  
  • వాళ్ల ఊసే ఎత్తని ప్రధాన పార్టీలు
  • బీఎస్పీ నుంచి మాత్రం ఒక సీటు ఇచ్చే అవకాశం 
  • గత ఎన్నికల్లో బీఎల్ఎఫ్ పనచి ట్రాన్స్​జెండర్ చంద్రముఖి పోటీ  
  • రాష్ట్రంలో 50 వేలకు పైగానే హిజ్రాల జనాభా  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ట్రాన్స్​జెండర్లను ప్రధాన రాజకీయ పార్టీలు పట్టించుకోవడంలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా వాళ్ల ఊసే ఎత్తడం లేదు. రాజకీయంగా అవకాశాలు కూడా కల్పించడంలేదు. అయితే, ఢిల్లీ, కర్నాటక వంటి పలు రాష్ట్రాల్లో ట్రాన్స్ జెండర్లు ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బరిలోకి దిగేందుకు ట్రాన్స్ జెండర్లు సిద్ధంగా ఉన్నా, ప్రధాన పార్టీలు మాత్రం వారిని పట్టించుకోవడంలేదు. ఎన్నికల్లో అన్ని వర్గాలకూ హామీల వర్షం కురిపిస్తున్నా.. పార్టీలు తమను మాత్రం విస్మరిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాజకీయంగానే కాకుండా, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం విషయంలో కూడా ప్రభుత్వాలు తమను పట్టించుకోవడంలేదని అంటున్నారు. 

రాష్ట్రంలో ట్రాన్స్​జెండర్ ఓట్లు 2,557 

ఎన్నికల సంఘం తాజా గణంకాల ప్రకారం తెలంగాణలో 2,557 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారు. అయితే రాష్ట్రంలో హిజ్రాల జనాభా 50 వేలకుపైనే ఉంటుందని, వీరిలో అతి తక్కువ మంది మాత్రమే ఓటు హక్కు నమోదు చేసుకున్నారని యూనియన్ లీడర్లు చెప్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా చూస్తే ట్రాన్స్ జెండర్ల జనాభా 10 లక్షలకుపైగా ఉంటుందని అంచనా. రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ నుంచి మూడు స్థానాలను ట్రాన్స్ జెండర్లు ఆశిస్తున్నారు. కానీ ఆ పార్టీ ఒక స్థానాన్ని కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తే ట్రాన్స్ జెండర్లకూ అవకాశం ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే కూడా ప్రకటించాయి.  

గతంలో గోషామహల్ నుంచి చంద్రముఖి 

2018 ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ తరఫున గోషామహల్ నుంచి ట్రాన్స్​జెండర్ చంద్రముఖి పోటీ చేశారు. తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ట్రాన్స్ జెండర్ గా రికార్డ్ సృష్టించారు. గత కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓ పార్టీ తరఫున రామక్క అనే హిజ్రా బరిలోకి దిగారు. అయితే, భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా చట్టసభలకు ఎన్నికైన ట్రాన్స్ జెండర్ గా షబ్నం మౌసీ రికార్డుకెక్కారు. 2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్​లోని సోహగ్ పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి17,800 మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 2015లో చత్తీస్ గఢ్​లోని రాయిగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ట్రాన్స్ జెండర్ మధు కిన్నార్ ఎన్నికయ్యారు. దేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ మేయర్​గా చరిత్రకెక్కారు. గతేడాది ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన బాబీ కిన్నార్ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేసి గెలుపొందారు.  

1994 నుంచి ఓటు హక్కు 

ఎన్నికల సంఘం ట్రాన్స్​జెండర్లకు1994 నుంచి ఓటు హక్కు కల్పించింది. కానీ వారిని మహిళలుగానే పరిగణించేవారు. అయితే, 2009లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ట్రాన్స్ జెండర్ల కోసం థర్డ్ జెండర్ కాలమ్​ను ఓటర్ లిస్ట్​లో ప్రవేశపెట్టింది.