నిజం ఏంటీ : కేరళ నుంచి తెలంగాణకు లారీలో రూ.750 కోట్ల డబ్బు..గద్వాల్ దగ్గర పట్టివేత..

నిజం ఏంటీ : కేరళ నుంచి తెలంగాణకు లారీలో రూ.750 కోట్ల డబ్బు..గద్వాల్ దగ్గర పట్టివేత..

తెలంగాణలో ఎన్నికలు.. గల్లీ గల్లీలో తనిఖీలు.. ఇప్పటికే వందల కోట్లు పట్టివేత.. 50 వేల రూపాయలకు ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా పట్టుకెళుతున్నారు పోలీసులు.. సామాన్యులు సైతం ఆందోళన పడుతున్నారు. ఇలాంటి టైంలో కేరళ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి 750 కోట్ల రూపాయల డబ్బు.. నోట్ల కట్టలు.. ఓ లారీలో రావటం సంచలనంగా మారింది. గద్వాల్ దగ్గర తనిఖీలు చేస్తున్న పోలీసులకు.. ఓ లారీలో 750 కోట్ల రూపాయల నోట్ల కట్టలు.. అన్నీ 500 రూపాయల నోట్ల కట్టలు కనిపించటంతో.. పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే లారీని పక్కకు తీసుకెళ్లారు. పోలీస్ రక్షణ కల్పించారు.

లారీలో 750 కోట్ల రూపాయలు ఉండటంతో.. గద్వాల్ పోలీసులు అలర్ట్ అయ్యారు.. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత.. ఇది బ్యాంక్ డబ్బు అని తేలింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన డబ్బు అని.. కేరళ నుంచి తెలంగాణలోని బ్యాంకులకు.. ఈ నగదు తరలిస్తున్నట్లు నిర్థారించారు. డాక్యుమెంట్లు అన్నీ సరిగానే ఉండటంతో.. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశాలతో .. ఈ డబ్బును యూనియన్ బ్యాంకుకు తరలించారు.

అక్టోబర్ 17వ తేదీ రాత్రి 10 గంటల 30 నిమిషాల సమయంలో ఈ 750 కోట్ల రూపాయల డబ్బు లారీ పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది. గద్వాల్ లో తనిఖీల తర్వాత.. ఈ డబ్బు లారీని హైదరాబాద్ తరలించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆర్బీఐ నిబంధనల ప్రకారమే ఈ డబ్బును తరలిస్తున్నట్లు నిర్థారణ కావటంతో.. జాతీయ రహదారిపై హైడ్రామాకు తెర పడింది.