- ఔషధ రంగాల్లో రాష్ట్రం నంబర్ వన్
- తెరానిమ్ బయోలాజిక్స్ యూనిట్‌ను ప్రారంభించిన మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి (హత్నూర), వెలుగు: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ అనుకూల వాతావరణం కల్పిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పారదర్శక విధానాల కారణంగా ప్రపంచ స్థాయి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోరపట్ల శివారులో తెరానిమ్ బయోలాజిక్స్ తయారీ యూనిట్‌ను మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బయోటెక్నాలజీ, ఔషధ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే దేశంలో అగ్రగామిగా నిలిచిందన్నారు.
ఔషధ రంగంలో ఆధునిక సాంకేతికతతో కూడిన తెరానిమ్ బయోలాజిక్స్ వంటి సంస్థల రాకతో రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందుతుందన్నారు. ఈ యూనిట్ ప్రారంభం వల్ల తెలంగాణ బయోఫార్మా రంగంలో మరో కీలక ముందడుగు పడిందని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ తెరానిమ్ బయోలాజిక్స్ సంస్థ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. వైద్యరంగంలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు ఇలాంటి సంస్థలు బలాన్ని చేకూరుస్తాయని చెప్పారు. సంగారెడ్డి జిల్లా ఔషధ, బయోటెక్నాలజీ రంగాలకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని, పారిశ్రామికాభివృద్ధికి సంగారెడ్డి జిల్లా మరో మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
