ఎన్నికల ముంగిట పోరుబాట.. ఇదే మోకా అని గళమెత్తుతున్న వివిధ శాఖల ఉద్యోగులు

ఎన్నికల ముంగిట పోరుబాట.. ఇదే మోకా అని గళమెత్తుతున్న వివిధ శాఖల ఉద్యోగులు
  • స్పౌజ్ ​బదిలీల కోసం టీచర్ల ఆందోళనలు
  • మరోసారి ప్రగతిభవన్​ను ముట్టడించేందుకు రెడీ
  • రెగ్యులరైజేషన్​ కోసం సమగ్ర శిక్ష 
  • ప్రాజెక్ట్​ కాంట్రాక్టు ఉద్యోగుల ఉద్యమం
  • ప్రాజెక్ట్​ డైరెక్టరేట్ ముందు నిరసన.. ఈడ్చుకెళ్లిన పోలీసులు
  • సీపీఎస్​ రద్దు కోసం ప్రభుత్వానికి ఎంప్లాయీస్​ అల్టిమేటం
  • సెప్టెంబర్​లో మౌనదీక్షలు చేస్తామని హెచ్చరిక
  • మళ్లీ నిరసనలకు సిద్ధమవుతున్న పంచాయతీ కార్మికులు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఇచ్చిన హామీలు, పెండింగ్​లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు  గళమెత్తుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఏండ్లకేండ్లుగా ప్రభుత్వం తమ డిమాండ్లను పెండింగ్​లో పెట్టడంపై మండిపడుతున్నారు. సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు ఇదే రైట్​టైంగా నిర్ధారించుకొని ఐక్య పోరాటాలు చేస్తున్నారు. కొన్నాళ్లుగా వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్న వాళ్లంతా ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్​ వేదికగా ఉద్యమిస్తున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ ​స్కీం రద్దు చేయాలని కోరుతూ శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్​ గ్రౌండ్​లో ఉద్యోగులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. పాత పెన్షన్​ స్కీం పునరుద్ధరించాలని, లేకపోతే సెప్టెంబర్​లో రాష్ట్రవ్యాప్తంగా మౌనదీక్షలు చేపడ్తామని రాష్ట్ర సర్కారుకు అల్టిమేటం ఇచ్చారు. స్పౌజ్​బదిలీల కోసం టీచర్లు ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. 

సెకండ్​ఏఎన్ఎంలు ఇప్పటికే సమ్మెలో ఉన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ఔట్​ సోర్సింగ్​ఉద్యోగులు గురువారం జీహెచ్ఎంసీ ఆఫీసును ముట్టడించనున్నారు. హైదరాబాద్​లోని ధర్నా చౌక్​తో పాటు  వివిధ ప్రభుత్వ శాఖల హెడ్​క్వార్టర్స్, టీఎస్​పీఎస్సీ దగ్గర రోజూ ఏదో ఒక ఆందోళన కొనసాగుతూనే ఉంది. గ్రూప్​–2 వాయిదా వేయాలనే డిమాండ్​తో నిరుద్యోగులు చేసిన ఆందోళనకు ప్రభుత్వం దిగి వచ్చి.. వాయిదా వేసింది. ఏఈఈ ​పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని కోరుతూ బుధవారం నిరుద్యోగులు టీఎస్​పీఎస్సీని ముట్టడించారు.కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల విభజన చేసిన నాటి నుంచి స్పౌజ్​బదిలీల కోసం టీచర్లు ఆందోళన చేస్తూనే ఉన్నారు. స్కూల్​ఎడ్యుకేషన్​ కమిషనరేట్, ప్రగతి భవన్​ను  ముట్టడించారు. 13 జిల్లాల్లో నిలిచిపోయిన ట్రాన్స్​ఫర్లు వెంటనే చేపట్టాలని కోరుతూ ఇటీవల ధర్నా చౌక్​లో కూడా ఆందోళనకు దిగారు. సీఎం స్పందించకపోతే మరోసారి ప్రగతి భవన్​ముట్టడించేందుకు టీచర్లు రెడీ అవుతున్నారు.

‘సమగ్ర శిక్ష ప్రాజెక్ట్’ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ ​చేయడంతో పాటు మినిమం టైం స్కేల్​వర్తింపజేయాలని కోరుతూ బుధవారం ఆ సంఘం నాయకులు, ఉద్యోగులు డైరెక్టరేట్​ఎదుట భారీ ఎత్తున నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉద్యోగులు కోరారు.  సీపీఎస్​ విధానం రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగులు చాలా కాలం నుంచి ఆందోళన చేస్తున్నారు. సీపీఎస్​రద్దు కోసం అన్నిశాఖల్లోని ఉద్యోగులు సంఘటితమై జులై 16న జోగులాంబ ఆలయం నుంచి సంకల్ప యాత్ర చేపట్టారు. ఈ యాత్ర జులై 31న యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వద్ద ముగిసింది. ఈ నెల 12న హైదరాబాద్​లోని నాంపల్లి ఎగ్జిబిషన్​గ్రౌండ్​లో ‘పాత పింఛన్​సాధన సాకార సభ’ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్​లో రాష్ట్రవ్యాప్తంగా మౌన దీక్షలు చేస్తామని హెచ్చరించారు. అదే రోజు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు చేపట్టారు.  కేజీబీవీలు, అర్బన్​రెసి డెన్షియల్ ​స్కూళ్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు బేసిక్​పే ఇవ్వాలని కోరుతూ యూటీఎఫ్​ ఆధ్వర్యంలో జులై 20న జోరువానలో స్కూల్​ఎడ్యుకేషన్​కమిషనరేట్​ను ముట్టడించారు. తాము ఏండ్లకేండ్లుగా పని చేస్తున్నామని, బేసిక్​పే ఇచ్చి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఔట్​సోర్సింగ్​పద్ధతిన పని చేస్తున్న 1.50 లక్షల మందిని రెగ్యులర్​చేయాలని కోరుతూ ఆదివారం హైదరాబాద్​లోని ఒక ఫంక్షన్​హాల్​లో 33 జిల్లాలకు చెందిన 10 వేల మందితో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రభుత్వంలో ఔట్​సోర్సింగ్​విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్​చేశారు. ప్రభుత్వం వేతనాలు రిలీజ్​చేస్తున్న ఏజెన్సీలు నెలలు తరబడి జీతాలు ఇవ్వకుండా తమను వేధింపులకు గురి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే నేరుగా వేతనాలు ఇవ్వాలని కోరారు. మూడేండ్ల  కాలపరిమితి ముగిసిన ఔట్​సోర్సింగ్​ఉద్యోగులను రెగ్యులర్​చేయాలని, హెల్త్​కార్డులు ఇవ్వాలని కోరారు. ‘బల్దియా దక్కా – పర్మినెంట్​పక్కా’ నినా దంతో పోరాటానికి జీహెచ్​ఎంసీ ఔట్​సోర్సింగ్ ఎంప్లాయీస్​యూనియన్​సన్నద్ధమవుతున్నది. 

గురువారం జీహెచ్​ఎంసీని ముట్టడించనున్నట్టు సంఘం నాయకులు తెలిపారు. గురువారంలోగా ప్రభుత్వం స్పందించకుంటే శుక్రవారం నుంచి సమ్మె బాట పడుతామని హెచ్చరించారు. 18న జీహెచ్​ఎంసీ హెడ్​ఆఫీస్​ఎదుట నిరసన తెలిపి, ఆ తర్వాత సెక్రటేరియెట్​ముట్టడించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాల రెగ్యులరైజేషన్​తో పాటు ఇతర డిమాండ్ల సాధన కోసం సెకండ్​ ఏఎన్ఎంలు సమ్మె కొనసాగిస్తున్నారు. మంత్రి హరీశ్​రావు ఆదేశాలతో డీహెచ్​శ్రీనివాస్​రావు వారితో బుధవారం చర్చలు జరిపారు. ఉద్యోగాలు  రెగ్యులర్​చేయాలని, పే స్కేల్​వర్తింపజేయాలని సెకండ్​ ఏఎన్​ఎంలు డిమాండ్​చేశారు. ఈ డిమాండ్లు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని డీహెచ్​చెప్పారు. ఉద్యోగాల రెగ్యులరైజేషన్​సాధ్యం కాదని, దీనికి బదులుగా వెయిటేజ్​మార్కులతో పాటు ఉద్యోగ నియామకాల్లో ఏజ్​రిలాక్సేషన్​ ఇస్తామన్నారు. ఈ అంశం పక్కన పెట్టి ఇతర సూచనలు ఏమైనా ఉంటే చెప్పాలని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని, విధుల్లో చేరాలని కోరారు. 

సమ్మె విరమణపై గురువారం మరోసారి ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని సెకండ్​ఏఎన్ఎంల సంఘం ప్రతినిధులు  తెలిపారు. 45 వేల మంది పంచాయతీ కార్మికులు తమను రెగ్యులర్ చేయాలని , కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇచ్చిన విధంగా కనీస వేతనాలు ఇవ్వాలని ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నారు.  ఇటీవల 32 రోజులు సమ్మె చేశారు. కేవలం రూ.9000 జీతంతో ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న కార్మికుల్లో 90 శాతం మంది బడుగు బలహీన వర్గాలే ఉన్నారు. సమస్యలను పరిష్కరిస్తామని మంత్రులు హరీశ్​ రావు, ఎర్రబెల్లి దయాకర్ ​రావు హామీ ఇవ్వడంతో ఇటీవల సమ్మె విరమించారు. ప్రభుత్వం ఒకవేళ సమస్యలు పరిష్కరించకపోతే  మళ్లీ ఉద్యమించేందుకు పంచాయతీ కార్మికులు సిద్ధమవుతున్నారు. గురుకుల స్కూళ్లలో ఉపాధ్యాయులకు శ్రమకు తగిన వేతనాలు ఇవ్వాలని, అన్ని గురుకులాల్లో ఏకరూప పాలన అమలు చేయాలని కోరుతూ ఈ నెల 5న ఇందిరాపార్కు వద్ద ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. అన్ని గురుకులాలకు కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని, జీవో 317 అమలు వివాదాలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. 

నేడు జీహెచ్ఎంసీ  ఆఫీసు ముట్టడి

‘బల్దియా దక్కా - పర్మినెంట్​ పక్కా’ నినాదంతో పోరాటానికి జీహెచ్​ఎంసీ ఔట్​సోర్సింగ్ ఎంప్లాయీస్​ యూనియన్​ సన్నద్ధమవుతున్నది. గురువారం జీహెచ్​ఎంసీ ఆఫీసును ముట్టడించనున్నట్టు సంఘం నాయకులు ప్రకటించారు.  ప్రభుత్వం స్పందించకుంటే శుక్రవారం నుంచి సమ్మె బాట పడుతామని హెచ్చరించారు. సెక్రటేరియెట్​ను కూడా ముట్టడిస్తామని తెలిపారు.