త్రిసభ్య కమిటీ ముందుకు ఉద్యోగుల సమస్యలు .. 57 డిమాండ్లపై చర్చించిన జేఏసీ

త్రిసభ్య కమిటీ ముందుకు ఉద్యోగుల సమస్యలు .. 57 డిమాండ్లపై చర్చించిన జేఏసీ

హైదరాబాద్ ,వెలుగు: ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై చర్చించేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీతో ఉద్యోగుల జేఏసీ బుధవారం భేటీ అయింది. కమిటీలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సీనియర్​ ఐఏఎస్​ ఆఫీసర్లు లోకేశ్​ కుమార్ , కృష్ణభాస్కర్ తో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు సహా  జేఏసీ లో ఉన్న 56 సంఘాల నుంచి 46 మంది నాయకులు సమావేశమయ్యారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న 57 సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కమిటీకి అందజేశారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరగా.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కమిటీ హామీ ఇచ్చిందని జేఏసీ నేతలు వెల్లడించారు. 

ప్రధానంగా పీఆర్సీ, పెండింగ్ లో ఉన్న 5 డీఏలు, ఎంప్లాయీస్​ హెల్త్​ స్కీమ్​(ఈహెచ్ ఎస్),  సీపీఎస్ రద్దు, సాధారణ బదిలీలు వంటి డిమాండ్లు ఉన్నాయన్నారు. కాగా, ఇతర అంశాలు ఏమీ ఉన్నా మరో రెండు రోజుల తర్వాత తమ దృష్టికి తేవాలని జేఏసీ నేతలను కమిటీ కోరినట్లు తెలిసింది. కాగా, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీమ్)  అమలు చేస్తే ప్రభుత్వంపై  ఎలాంటి ఆర్థికభారం పడదని టీఎస్ సీపీఎస్ఈయూ అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ తెలిపారు. సీపీఎస్ రద్దు చేస్తే  ప్రభుత్వానికి ప్రతి నెలా రూ. 300 కోట్లకుపైగా  మిగులుతుందని అన్నారు.