వడ్డీల భారం తగ్గితేనే అభివృద్ధికి నిధులు

వడ్డీల భారం తగ్గితేనే అభివృద్ధికి నిధులు
  • 7 శాతానికి తగ్గించుకుంటే ప్రతినెల 2 వేల కోట్లు మిగులు

హైదరాబాద్, వెలుగు:గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున తీస్కున్న అప్పులు.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్‌‌‌‌కు గుదిబండగా మారాయి. వడ్డీల భారంతో అటు సంక్షేమ పథకాలకు, ఇటు అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడింది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌‌సీ), ప్రైవేట్ బ్యాంకుల నుంచి 11శాతం వరకు అధిక వడ్డీ రేట్లతో గత ప్రభుత్వం అప్పులు తీసుకుంది. 

ఇప్పుడీ అప్పుల వడ్డీల కిందనే ప్రతి నెల దాదాపు రూ.3,500 కోట్లు చెల్లించాల్సి వస్తున్నది. దీంతో ఈ వడ్డీ రేట్లను 7 శాతానికి తగ్గించుకోగలిగితే నెలకు కనీసం రూ.2 వేల కోట్ల మిగులు సాధ్యమవుతుందని ప్రభుత్వానికి ఆర్థిక శాఖ నివేదిక ఇచ్చింది. తద్వారా నిధుల కొరతను అధిగమించవచ్చని, అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఉండవని పేర్కొంది. ఈ నేపథ్యంలో లోన్ల రీస్ట్రక్చర్ విషయమై కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, వడ్డీ రేట్ల తగ్గింపు విషయమై రాష్ట్ర సర్కార్ ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి విన్నవించింది. 

అభివృద్ధి పనులకు నిధుల కొరత.. 

అప్పుల భారం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది. 2014లో రెవెన్యూ సర్‌‌ప్లస్‌‌లో ఉన్న రాష్ట్రం.. ఇప్పుడు రోజువారీ ఖర్చుల కోసం ఆర్‌‌బీఐ నుంచి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులపై ఆధారపడుతున్నది. గతంలో దాదాపు 100% రోజులు పాజిటివ్ బ్యాలెన్స్ ఉండగా, ఇప్పుడు అది 10% కంటే తక్కువకు పడిపోయింది. క్యాపిటల్ ఎక్స్‌‌పెండిచర్ (మూలధన వ్యయం)కు నిధులు కొరత ఏర్పడింది. 

తద్వారా అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే క్యాపిటల్ ఎక్స్‌‌పెండిచర్ కింద ఖర్చు చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం.. అప్పులపై వడ్డీలను 7 శాతానికి తగ్గించుకోగలిగితే నెలకు రూ.2 వేల కోట్ల మిగులు ఏర్పడుతుంది. అప్పుడు ఆ నిధులను అభివృద్ధికి పనులకు ఇవ్వొచ్చని సర్కార్ భావిస్తున్నది. 

కాగా, అప్పుల భారం తగ్గకపోతే రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఆటంకాలు తప్పవని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. బకాయిలు చెల్లించకపోతే ఎన్పీఏ లిస్టులో పెడతామని గత నెలలో ఆర్‌‌‌‌ఈసీ హెచ్చరించడంతో ప్రభుత్వం రూ.1,393 కోట్లు చెల్లించి ఆ సమస్యను పరిష్కరించింది. ఇలాంటి సమస్యలు రాష్ట్ర ఆర్థిక రేటింగ్‌‌ను ప్రభావితం చేస్తున్నాయి.

ఆదాయంలో 34%.. వడ్డీలు, కిస్తీలకే

2014లో తెలంగాణ ఏర్పడే నాటికి రూ.72,658 కోట్లు అప్పు ఉండగా, అది 2023–-24 నాటికి రూ.3,89,673 కోట్లకు చేరుకుంది. ఇక బడ్జేటేతర రుణాలు, ఇతరత్రా కలుపుకుంటే మొత్తం భారం దాదాపు రూ.8 లక్షల కోట్లకు పెరిగింది. ఈ అప్పుల వడ్డీలకే ప్రస్తుతం నెలకు సగటున రూ.3,500 కోట్లు చెల్లించాల్సి వస్తున్నది. ఇంకా వీటి కిస్తీలు అదనం. రాష్ట్ర ఆదాయంలో 34 శాతం.. అప్పుల వడ్డీలు, కిస్తీల చెల్లింపులకే పోతున్నది.

 మరో 35% జీతాలు, పెన్షన్ల కోసం చెల్లిస్తున్నారు. దీంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడుతున్నది. కాగా, గత ప్రభుత్వం ఆర్‌‌‌‌ఈసీ, పీఎఫ్‌‌సీ, ప్రైవేట్ బ్యాంకుల నుంచి 10.75% – 11.25% వరకు అధిక వడ్డీ రేట్లకు రుణాలు తీసుకున్నది. ముఖ్యంగా కాళేశ్వరం, పాలమూరు–-రంగారెడ్డి వంటి ప్రాజెక్టుల కోసం స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ) ద్వారా ఆఫ్ -బడ్జెట్ బాండ్లు జారీ చేసి రూ.1,85,029 కోట్లు సమీకరించింది. అయితే ఈ ఎస్పీవీలకు సొంత ఆదాయ వనరులు లేకపోవడంతో అప్పుల వడ్డీలకు ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించాల్సి వస్తున్నది.