
మొగుళ్లపల్లి(టేకుమట్ల), వెలుగు: అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో చోటుచేసుకుంది. బోర్నపల్లి గ్రామానికి చెందిన ముంజాల రాములు గౌడ్ (55)కు మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. రూ.2 లక్షల వరకు అప్పులు చేసి అందులో వరి, పత్తి పంటలను సాగు చేశాడు. ఈ ఏడాది ఆగస్టులో కురిసిన అకాల వర్షాలతో వాగులు ఉప్పొంగి వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి.
అప్పు ఎలా తీర్చాలో తెలియక రాములు మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో పురుగుల మందు తాగాడు. స్థానికులు ఆయనను చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి వరంగల్ ఎన్ఎస్ఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ మంగళవారం తెల్లవారుజామున రాములు చనిపోయాడు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.