విమానం ఎక్కాలన్న కల నెరవేర్చుకున్న యూట్యూబర్‌ గంగవ్వ

విమానం ఎక్కాలన్న కల నెరవేర్చుకున్న యూట్యూబర్‌ గంగవ్వ

విజయం అనేది ఎప్పుడు, ఎవరికి, ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. దానికి సమయం, సందర్భం, వయసు ఏదీ అడ్డు కాదని నిరూపించారు మిల్కూరి గంగవ్వ. వయసనేది కేవలం మనిషికే కానీ, చేసే పనులకు, పొందే విజయాలకు, టాలెంట్ కు కాదని ఈమె ప్రూ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈమె పేరు వినని వాళ్లు చాలా తక్కువే. తెలంగాణలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈమె.. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి.. యూట్యూబ్ లో తన వీడియోల ద్వారా కామెడీని అందిస్తూ ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రారంభమైన ఆమె ప్రయాణం.. ఈ రోజు సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ నే పెట్టుకునే స్థితికి చేరుకుంది. అంతే కాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లోనూ గంగవ్వ పార్టిసిపేట్ చేశారు. ఆమె హౌస్ లో ఉన్నది కొన్ని రోజులే అయినా.. తన కామెడీతో హౌస్ మేట్స్ ను నవ్విస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత అక్కడి వాతావరణానికి ఇమడలేక కొన్ని రోజులే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. దీంతో సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు. కొన్ని సినిమాల్లోనూ నటించి, మంచి పేరు తెచ్చుకున్నారు. అలా ఓ చిన్న యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆడియెన్స్ కు పరిచయమైన గంగవ్వ.. తాజాగా మరో గ్రేట్ ఎక్స్ పీరియన్స్ ను చూశారు. అది ఎలా అనిపించిందో ఓ వీడియో ద్వారా తెలియజేశారు.

విమానం అంటే కేవలం నేలపై ఉండి చూసి తరించడమే గొప్పగా భావించే ఆమె.. తాజాగా మొదటిసారి ఫ్లైట్ ఎక్కి తన కలను నెరవేర్చుకున్నారు. ఈ ఏడాది జరిగిన శివరాత్రి ఉత్సవాల కోసం ఆమె కోయంబత్తూరుకు వెళ్లారు. అప్పటి వీడియోనే తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. గంగవ్వ ఫస్ట్ టైం విమానం ఎక్కిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమె ఎలా ఫీలయ్యింది.. విమానం ఎక్కడం ఎలా అనిపించిందన్న విషయాలను కూడా ఈ వీడియో ద్వారా షేర్ చేశారు. తెలంగాణ భాష, యాసలో మాట్లాడుతూ.. ఫ్లైట్ ఎక్కింది మొదలు.. సీటు బెల్టు పెట్టుకోవడం.. ఫ్లైట్ టేకాఫ్ అయ్యేటపుడు.. ఆమె ఎలా రియాక్టయ్యారో ఈ వీడియోలో చక్కగా చూపించారు. టేకాఫ్ సమయంలో తాను భయపడ్డానని, సీటు బెల్ట్ తీయడానికి ప్రయత్నించానని వీడియోలో చెప్పడం అందర్నీ ఆకట్టుకుంటుంది. విమానం ఎత్తు తనను ఎంత దిగ్భ్రాంతికి గురి చేసిందో, విమాన ప్రయాణం తన చెవులకు ఎంత అసౌకర్యంగా అనిపించిందో కూడా ఆమె వివరించారు.

ఈ వీడియోకు ఇప్పటివరకు ఆరు మిలియన్లకు పైగా వ్యూస్, ఐదు లక్షలకు పైగా లైక్ లు రాగా.. దీనిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. మంచి మనిషి....ప్రతిఒక్కరికీ ఒక కల ఉంటుంది... దాన్ని నెరవేర్చుకునే అవకాశం పొందిన మీరు చాలా అదృష్టవంతులు...అభినందనలు అని ఒకరు కామెంట్ చేయగా.. ఇది అద్భుతమైన పని అని, తనకు ఆమె మాట్లాడే భాష అర్థం కాలేదు కానీ మీరు చాలా గొప్ప పని చేశారని, తాను కూడా తన అమ్మను ఫ్లైట్‌లో తీసుకెళ్లే రోజు కోసం ఎదురు చూస్తున్నానని మరొకరు రాసుకొచ్చారు. మరొకరేమో గంగవ్వ స్ఫూర్తి అని, విజయం ఏ వయసులోనైనా రావచ్చు.. మీ కలలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉండడని తెలిపారు.