రెండు విధాలా మునిగిన విత్తన రైతులు 

రెండు విధాలా మునిగిన విత్తన రైతులు 
  • ఈ యాసంగిలో సీడ్ వడ్ల రైతులకూ గిట్టుబాటు కాలే 
  • కంపెనీలు క్వింటాలుకు 10 కిలోలు కోతపెట్టినయ్ 
  • రెండు విధాలా మునిగిన విత్తన రైతులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ : యాసంగిలో ప్రైవేటు సీడ్‌‌‌‌‌‌‌‌ కంపెనీలను నమ్ముకుని సీడ్ వడ్లు వేసిన రైతులకు ఎలాంటి ఫాయిదా లేకుండా పోయింది. మూడు రెట్ల వరకు పెట్టుబడి పెట్టి ఆడ, మగ వరి సాగు (హైబ్రీడ్‌‌‌‌‌‌‌‌) చేసినా దిగుబడి రాక నష్టపోయారు. దీనికి తోడు విత్తన కంపెనీలు నేరుగా క్వింటాల్ కు10 కిలోలకు పైగా కోత పెట్టడంతో ఆ రకంగానూ నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  సర్కారు వడ్లు కొనబోమని చెప్పిందని కంపెనీలను నమ్ముకుంటే చేసిన కష్టం వృథా అయిందని సీడ్‌‌‌‌‌‌‌‌ రైతులు వాపోతున్నారు.  

4 లక్షల ఎకరాల్లో సాగు
రాష్ట్రంలో యాసంగిలో 35.84 లక్షల ఎకరాల్లో వరి సాగు అయింది. ఇందులో 4 లక్షలకు పైగా ఎకరాల్లో సీడ్ వడ్లు సాగు చేశారు. సాధారణంగా సీడ్‌‌‌‌‌‌‌‌ వరి 2 సీజన్‌‌‌‌‌‌‌‌లకు కలిపి 6 లక్షల ఎకరాల్లోనే సాగవుతుంది. ఈ సారి రైతులు విత్తన సంస్థలతో ఒప్పందాలు చేసుకుని యాసంగిలో వేయాల్సిన దాని కంటే ఎక్కువే వేశారు. ఈ యాసంగిలో  కరీంనగర్‌‌‌‌‌‌‌‌, హనుమకొండ, వరంగల్‌‌‌‌‌‌‌‌, భూపాలపల్లి, ములుగు, జనగామ, సిద్దిపేట, సిరిసిల్ల, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ తదితర జిల్లాల్లో ఎక్కువగా ఈ సీడ్‌‌‌‌‌‌‌‌ వరి సాగు జరిగింది. సీడ్‌‌‌‌‌‌‌‌ వరి సాగు పెరిగినా దిగుబడి రాక పోవడంతో ఈ యాసంగిలో రైతులకు గిట్టుబాటు కాలేదు. దున్నడానికి రూ.5 వేలు, విత్తనాలకు రూ.3 వేలు, నాటు కూలీలు రూ.7,500, అడుగు మందులకు రూ.12 వేలు, పై మందులకు రూ.4 వేలు, ఈల్డ్‌‌‌‌‌‌‌‌ వచ్చినప్పడు జోపుడుకు రూ.9 వేలు కలుపు కూలీలు, బెరుకులు ఏరడం, రెండు సార్లు విత్తన వరి కోతలు.. ఇలా అన్నీ కలిపి ఎకరాకు రూ.55 వేలకు పైగా పెట్టుబడి ఖర్చు అయింది. సాధారణ వరి కంటే.. ఈ ఆడ, మగ వడ్ల సాగుకు మూడింతలు పెట్టుబడి పెరిగింది. కోతకు వచ్చే మార్చి నెలాఖరు, ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నెలల్లో వర్షాలు పడడంతో దిగుబడి తగ్గింది. యావరేజ్ గా ఎకరానికి 25 క్వింటాళ్ల చొప్పున 4 లక్షల ఎకరాలకు గాను10 లక్షల టన్నులకు పైగా దిగుబడి రావాల్సి ఉంది. కానీ ఈసారి 6 లక్షల టన్నుల వరకే దిగుబడి వచ్చినట్లు తెలుస్తోంది. 

సీడ్‌‌‌‌‌‌‌‌ కంపెనీల కోతలు 
యాసంగిలో సర్కారు వడ్లు వేయొద్దన్నందుకు జేకే సీడ్స్‌‌‌‌‌‌‌‌, కావేరి, అంకుర్‌‌‌‌‌‌‌‌, బేయర్‌‌‌‌‌‌‌‌, ఐటీసీ, నూజివీడు, వీఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌, మహింద్రా అండ్‌‌‌‌‌‌‌‌ మహింద్రా వంటి 15కు పైగా విత్తన కంపెనీలతో రైతులు ఒప్పందం చేసుకుని సీడ్ వడ్లు పండించారు. కానీ ఓ వైపు దిగుబడి తగ్గి లాస్ అవుతుండగా.. మరోవైపు కంపెనీలు వడ్లు కాంటా పెట్టేటప్పుడు కోతలు పెడుతున్నాయి. క్వింటాల్ కు10 నుంచి 12కిలోలు కట్ చేస్తున్నారని రైతులు చెప్తున్నారు. దీంతో క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు రూ.7 వేలు రావాల్సి ఉండగా.. రూ. వెయ్యి నష్టపోవాల్సి వస్తోందని అంటున్నారు. విత్తన కంపెనీలను నమ్ముకుని ఈ యేడు యాసంగిలో ఆడ, మగ వరి వేసి ఆగమైనం. పెట్టుబడి ఎక్కువైంది. దిగుబడి రాక నష్టపోయినం. సర్కారు కొనదని ప్రైవేటు కంపెనీల దగ్గర విత్తనాలు కొని వేసినం. పంట కొంటరనే నమ్మకంతో సీడ్‌‌‌‌‌‌‌‌ వరి వేస్తే కంపెనీలు క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు 10 కిలోలు కోత పెడుతున్నయి. ఇలా క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు రూ. వెయ్యి వరకు నష్టపోతున్నట్లు సిద్ధిపేట జిల్లాకు చెందిన రైతు నర్సింహులు వాపోయాడు.

మరిన్ని వార్తల కోసం : -

నిర్లక్ష్యానికి కఠిన చర్యలు.. పని చేస్తే ప్రమోషన్స్..!


మల్లారెడ్డికి నిరసన సెగ