తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్, హనుమకొండలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్‌లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ములుగులో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క, జనగామ, మహబూబాబాద్, జయశంకర్భూపాలపల్లి జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ విప్‌లు బీర్ల అయిలయ్య, రామచంద్రునాయక్, యెన్నం శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై జెండా ఎగురవేసి, అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా అభివృద్ధిపై ప్రసంగించారు.
అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. అక్కడే ఏర్పాటు చేసి స్టాళ్లను సందర్శించారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు అందజేశారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలుచోట్ల రక్తదానాలు నిర్వహించారు. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. కాగా, ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ పార్టీ ఆఫీసుల వద్ద నాయకులు, కార్యకర్తలు జెండావిష్కరణలు చేశారు.
- వెలుగు, నెట్వర్క్
