సెప్టెంబర్ 30న సద్దుల బతుకమ్మ

సెప్టెంబర్ 30న సద్దుల బతుకమ్మ
  •     ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు
  •     రాష్ట్రంలో పలు చోట్ల సోమవారమే సంబురాలు

హైదరాబాద్/ వరంగల్‍, వెలుగు: సద్దుల బతుకమ్మ వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ నెల 30న (మంగళవారం) బతుకమ్మ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ఆదివారం సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సూచించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం మంగళవారమే పబ్లిక్  హాలిడేగా ప్రకటించింది. అయితే, బతుకమ్మ ఏ రోజున జరుపుకోవాలన్న సందిగ్ధం చాలామందిలో ఉంది. కొన్ని చోట్ల ఈ నెల 29న (సోమవారం) నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి.. సద్దుల బతుకమ్మ వేడుకలపై క్లారిటీ ఇచ్చింది.

బ్రాహ్మణ, ఆలయ పండితుల ప్రకటనలతో అయోమయం 

రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ పండుగపై అయో మయం నెలకొంది. సోమవారమే బతుకమ్మ ఆడాలని కొందరు వేద పండితులు చెబుతుంటే.. మరికొందరు మాత్రం మంగళవారమే జరుపుకోవాలని ప్రచారం చేస్తున్నారు. ఆయా ప్రాంతాలు, ఆచారాలను బట్టి  ఒక్కోఊరిలో ఒక్కోరోజు సద్దుల బతుకమ్మ ఆడనున్నారు. దీంతో ఈ ఏడాది సద్దుల బతుకమ్మ వేడుకలు  రెండ్రోజులు జరగనున్నాయి. బతుకమ్మ వేడుకలకు ప్రసిద్ది అయిన ఉమ్మడి  వరంగల్​ జిల్లాలో పద్మాక్షి ఆలయం వద్ద  సద్దుల బతుకమ్మ ఘనంగా జరుగుతుంది. వరంగల్​లోని  భద్రకాళి ఆలయ ప్రముఖ వేద పండితులు మంగళవారమే సద్దుల బతుకమ్మ నిర్వహించుకోవాలని తెలిపారు. పంచమి రెండ్రోజులు వచ్చినా ఒకేరోజు కింద లెక్కని, ఒకేరోజు రెండు తిథులొచ్చినా అది రెండ్రోజుల కింద లెక్కని.. 

కాబట్టి ఈ నెల 30నే బతుకమ్మ నిర్వహించాలని తెలంగాణ విద్వత్‍ సభ సిద్ధాంతులు, పండితులు సూచించారు. కాగా, వెయ్యిస్తంభాల గుడి, పద్మాక్షి ఆలయం, ఊకల్‍ నాగేంద్రస్వామి తదితర  ఆలయాల పండితులు సోమవారం నాడే  సద్దుల బతుకమ్మ  నిర్వహించుకోవాలని ప్రకటించారు. సద్దుల బతుకమ్మకు అమావాస్య, తిథి, వారం, నక్షత్రం, యోగం లాంటి అంశాలతో సంబంధం ఉండదన్నారు.   

ఇయ్యాల సరూర్ నగర్ స్టేడియంలో మహా బతుకమ్మ వేడుకలు

రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ కీర్తిని ప్రపంచానికి చాటేలా ఈ సారి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చోటు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు సోమవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సరూర్ నగర్ స్టేడియంలో పదివేల మంది మహిళలతో అతి భారీ స్థాయిలో బతుకమ్మ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, సీతక్క హాజరుకానున్నారు.