
- 4,090 ఎంబీబీఎస్ సీట్లూ కొనసాగించేందుకు ఎన్‌ఎంసీ అనుమతి
- ఫ్యాకల్టీ కొరతపై ప్రభుత్వ చర్యలకు ప్రశంస
- కాలేజీల్లో సమస్యలను 4 నెలల్లో పరిష్కరించాలని సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్క కాలేజీపై కూడా జరిమానా విధించకుండా.. 4,090 ఎంబీబీఎస్ సీట్లను యథావిధిగా కొనసాగించేందుకు అనుమతించింది. ఈ సందర్భంగా ఫ్యాకల్టీ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఎన్‌ఎంసీ ప్రశంసించింది. ఎన్‌ఎంసీ పరిశీలనలో కొన్ని టీచింగ్ హాస్పిటళ్లలో బెడ్ల సంఖ్య తక్కువగా ఉన్నట్టు తేలింది. ఈ సమస్యను 4 నెలల్లో పరిష్కరించాలని, భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎన్‌ఎంసీ సూచించింది.
దీనికి స్పందనగా, ప్రభుత్వం 21 టీచింగ్ హాస్పిటళ్లలో 6 వేలకు పైగా బెడ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రతి కాలేజీ పర్యవేక్షణ కోసం మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీలు (ఎంసీఎంసీ) నియమించి, అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తోంది. 2022 నుంచి 2024 మధ్య 25 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, భవన నిర్మాణాల పురోగతిని అధికారులు ఎన్‌ఎంసీకి వివరించారు. అన్ని కాలేజీలకు పర్మిషన్లు యథావిధిగా కొనసాగుతాయని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది.
ఫ్యాకల్టీ కొరతను అధిగమించే దిశగా..
ఫ్యాకల్టీ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 44 మంది సీనియర్ ప్రొఫెసర్లను అడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లుగా ప్రమోషన్ ఇచ్చి, వారిని మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌గా, టీచింగ్ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లుగా నియమించింది. అలాగే, 278 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా, 231 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు ఆరోగ్య శాఖ చర్యలు ప్రారంభించింది. ఈ ప్రమోషన్లతో ప్రొఫెసర్ల కొరత, డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీల సమస్య తీరనుంది. అలాగే, 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. మరో 714 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.
కౌన్సెలింగ్‌కు సన్నాహాలు
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. త్వరలో నీట్ స్టేట్ ర్యాంకులను విడుదల చేసి, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్ ప్రారంభించనున్నారు.