- మే 1 నుంచే గిగ్ వర్కర్ల చట్టం అమలు చేస్తం: మంత్రి వివేక్
- ఉద్యోగ భద్రత కల్పిస్తాం
- కనీస వేతనాలు అమలయ్యేలా చూస్తామని హామీ
- మంత్రికి గిగ్ అండ్ ప్లాట్ ఫాం వర్కర్స్ యూనియన్ సన్మానం
హైరదాబాద్, వెలుగు: రాష్ట్రంలోని లక్షల మంది గిగ్ వర్కర్ల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో చరిత్రాత్మక గిగ్ వర్కర్ల బిల్లును ఆమోదించిందని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి అన్నారు. మే 1వ తేదీ నాటికి ఈ చట్టానికి సంబంధించిన పూర్తిస్థాయి నిబంధనలు (రూల్స్) సిద్ధం చేసి అమలులోకి తీసుకురావాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించామని తెలిపారు. అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లును ఆమోదించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ నేతలు ఆదివారం సోమాజిగూడలోని మంత్రి వివేక్ నివాసంలో ఆయనను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో గిగ్ వర్కర్ల పాత్ర అత్యంత కీలకమన్నారు.
వారి శ్రమకు తగిన గుర్తింపు, రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం ద్వారా కోటీ 15 లక్షల మందికి రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించిందని, ఇది గిగ్ వర్కర్లకు కూడా వర్తిస్తుందని వెల్లడించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో స్వయంగా డెలివరీ బాయ్స్ కష్టాలను విని, వారి సమస్యల పరిష్కారానికి ఇచ్చిన మాట మేరకే ఈ చట్టాన్ని రూపొందించామని వివరించారు. సమాజంలో చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు అందాలన్నదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, గిగ్ వర్కర్లకు అండగా ఉంటూ పంజాబ్ తరహాలోనే తెలంగాణను కూడా కార్మిక సంక్షేమంలో అగ్రగామిగా నిలుపుతామని మంత్రి హామీ ఇచ్చారు.
నాన్న బాటలోనే కార్మిక పక్షపాతిగా ఉంటా
తన తండ్రి వెంకటస్వామి గతంలో ప్రైవేట్ రంగ కార్మికుల కోసం పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారని, అదే బాటలో తాను కూడా గిగ్ వర్కర్ల హక్కుల కోసం నిరంతరం పోరాడతానని చెప్పారు. సిరాజ్, నిఖత్ జరీన్ వంటి క్రీడాకారులను ఎలాగైతే ప్రోత్సహిస్తున్నామో, కష్టపడే ప్రతి కార్మికుడికీ అదే స్థాయిలో గౌరవం కల్పిస్తామని పేర్కొన్నారు. స్విగ్గీ, జొమాటో వంటి కంపెనీల్లో పనిచేస్తున్న సుమారు 4 లక్షల మంది వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, కనీస వేతనాలు అమలయ్యేలా చూస్తామన్నారు. ఈ చట్టం ద్వారా ప్రభుత్వం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తుందని, ఇందులో ప్రభుత్వ ప్రతినిధులు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్‌తో పాటు గిగ్ వర్కర్ల యూనియన్ సభ్యులు కూడా భాగస్వాములుగా ఉంటారని స్పష్టం చేశారు.
వర్కర్లందరూ ఈ బోర్డులో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అప్పుడే ప్రభుత్వ పథకాల ప్రయోజనం నేరుగా అందుతుందని సూచించారు. అగ్రిగేటర్ల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేస్తూ, ఇన్సెంటివ్ల పేరుతో కార్మికులను వేధించకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తామన్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం అగ్రిగేటర్ల నుంచి 'సెస్' వసూలు చేసి, ఆ నిధులను కార్మికుల ఆరోగ్య సామాజిక భద్రతకు వినియోగిస్తామని మంత్రి వెల్లడించారు.
