
న్యూఢిల్లీ: సొంతగడ్డపై వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఇండియాకు అద్భుత ఆరంభం లభించింది. హైజంపర్ శైలేష్ కుమార్ స్వర్ణాల ఖాతా తెరవగా.. తెలంగాణ అమ్మాయి జీవాంజి దీప్తి రజతంతో మెరిసింది. శనివారం జరిగిన విమెన్స్ 400 మీటర్ల టి20 కేటగిరీ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ దీప్తి 55.16 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఈ క్రమంలో ఈ సీజన్‌లో పర్సనల్ బెస్ట్ టైమింగ్ నమోదు చేసింది. ఉదయం క్వాలిఫయింగ్ రౌండ్‌లో 58.35 సెకన్ల టైమింగ్‌తో నెలకొల్పిన పర్సనల్ బెస్ట్‌ను అధిగమించింది.
టర్కీ అథ్లెట్ ఐసెల్ ఓండర్ 54.51 సెకన్లతో తన సొంత వరల్డ్ రికార్డును బ్రేక్ చేస్తూ స్వర్ణం గెలుచుకుంది. ఇక, మెన్స్ హైజంప్ టి63 విభాగంలో శైలేష్ చాంపియన్‌షిప్ రికార్డు సృష్టించి విజేతగా నిలిచాడు. 2023 ఆసియా పారా గేమ్స్ ఛాంపియన్ అయిన 25 ఏళ్ల శైలేష్, 1.91 మీటర్ల ఎత్తు నుంచి దూకి స్వర్ణం నెగ్గగా.. ఇదే ఈవెంట్‌లో వరుణ్ సింగ్ భాటి 1.85 మీటర్ల ఎత్తును క్లియర్ చేసి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. మొత్తంగా తొలి రోజే ఇండియా ఓ గోల్డ్ సహా మూడు మెడల్స్ సాధించింది.