హెచ్‌‌‌‌ఐవీ వ్యాప్తిలో రెండో స్థానంలో తెలంగాణ

హెచ్‌‌‌‌ఐవీ వ్యాప్తిలో రెండో స్థానంలో తెలంగాణ

ఏడాదిలో 10 వేల మందికి ఎయిడ్స్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌లో అత్యధికం

వరసగా మూడో ఏడాది భారీగా కేసులు గుర్తింపు

మరణాల్లో నాలుగో స్థానం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ర్టంలో వరుసగా మూడో ఏడాది కూడా పది వేల మందికిపైగా ఎయిడ్స్‌‌‌‌ బారినపడ్డారు. గతేడాది సుమారు 13 వేల కేసులు వెలుగుచూడగా, ఈ ఏడాది 10,651 కేసులను గుర్తించారు. వీరితో కలిపి రాష్ర్టంలో మొత్తం ఎయిడ్స్ పేషెంట్ల సంఖ్య 80,645కు పెరిగింది. ఇంకా గుర్తించని కేసులు 50 వేల వరకూ ఉండొచ్చని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది అత్యధికంగా ఉమ్మడి హైదరబాద్‌‌‌‌ జిల్లాలో 1,944 కేసులు నమోదవగా, ఉమ్మడి మహబూబ్‌‌‌‌నగర్ జిల్లాల్లో హెచ్‌‌‌‌ఐవీ ఎక్కువగా ఉన్నట్టు ఆఫీసర్లు వెల్లడించారు. కేసుల సంఖ్యలోనూ మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌(1,407) రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రంగారెడ్డి, నల్గొండ, మెదక్ జిల్లాల్లో ఎక్కువ రోగులు ఉన్నారు. అత్యల్పంగా ఆదిలాబాద్‌‌‌‌లో 440 కేసులను మాత్రమే రికార్డు అయ్యాయి. నేషనల్ ఎయిడ్స్‌‌‌‌ కంట్రోల్ సొసైటీ  గతేడాది లెక్కల ప్రకారం మిజోరంలో ఎయిడ్స్‌‌‌‌ వ్యాప్తి ఎక్కువగా ఉండగా, రెండోస్థానంలో తెలంగాణ ఉంది.  ఈ ఏడాది కేసుల వివరాలను మరో పది రోజుల్లో నాకో వెల్లడించనుంది.

మరణాల్లో నాలుగో స్థానం

అత్యధిక ఎయిడ్స్ మరణాలు నమోదవుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. రాష్ర్టంలో ఎయిడ్స్ కారణంగా 2018-–19 సంవత్సరంలో 2,925 మంది మరణించగా, 2019–-20లో 4,278 మంది మరణించారు. మరణాలు ఎక్కువగా నమోదవడానికి పేషెంట్లను త్వరగా గుర్తించకపోవడం ఒక కారణమైతే, పేషెంట్లు మందులు సరిగా వాడకపోవడం మరో కారణమని డాక్టర్లు చెబుతున్నారు.  ఎవరేమనుకుంటారోనన్న భయంతో చాలా మంది ఎయిడ్స్ ఉన్నా మందులు వాడటం లేదు. ప్రస్తుతం రాష్ర్ట వ్యాప్తంగా ఏఆర్టీ సెంటర్లు పెట్టి పేషెంట్లకు మందులు అందిస్తున్నారు. ఎయిడ్స్‌‌‌‌ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలకూ నిధులు ఇస్తోంది. మన దగ్గర ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఎయిడ్స్‌‌‌‌ రోగులను గుర్తించేందుకు రాష్ర్టమంతటా క్యాంపులు పెట్టి అనుమానితులకు టెస్టులు చేశారు.  కరోనా కారణంగా అవి వాయిదా వేయాల్సి వచ్చింది. కరోనా వ్యాప్తి మరింత తగ్గితే, జనవరి నుంచి టెస్టింగ్ క్యాంపులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ఆఫీసర్లు తెలిపారు.

For More News..

గ్రేటర్ వార్: ఒక్కో బూత్​లో మినిమం ఓట్లు పడేలా ప్లాన్​

ఫండ్స్​ ఇయ్యకున్నా పనుల్జేయాలె.. సర్పంచులపై ఆఫీసర్ల ఒత్తిడి

భూమి లాక్కోవద్దంటూ దంపతుల ఆత్మహత్యాయత్నం