30 జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయని సర్కార్

30 జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయని సర్కార్

హైదరాబాద్ : రాష్ట్రంలో 20 రోజుల కిందే వరికోతలు మొదలయ్యాయి. ఈ సీజన్​లో ముందుగా నాట్లు వేసిన జిల్లాల్లోని రైతులు పంట చేతికి రావడంతో కోతలు షురూ చేశారు. ఇంకొన్ని జిల్లాల్లో పొలాలు ఎర్రబారి కోతకు వచ్చినయ్. ఈ వానాకాలం సీజన్​లో రికార్డు స్థాయిలో 65.54లక్షల ఎకరాలకు పైగా వరిపొలాలను రైతులు సాగు చేశారు. మొత్తం కోటి 35 లక్షల టన్నులకు పైగా ధాన్యం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. వచ్చే డిసెంబర్‌‌లోపు కోటి టన్నుల దాకా వడ్లు సేకరించేందుకు సిద్ధమైనట్లు సర్కారు  కూడా ప్రకటించింది. కానీ, ఇప్పటివరకు కొనుగోలు సెంటర్లు తెరవకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పొలాలు కోసి వడ్లు ఆరబెట్టే పరిస్థితులు లేకపోవడంతో సెంటర్లు తెరిస్తేనే వరి కోయాలని రైతులు ఎదురు చూస్తున్నరు. 

నామమాత్రంగా రెండు జిల్లాల్లో షురూ

ఈ నెల 22 నుంచి రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు చేపడతామని ప్రకటించిన సివిల్​సప్లయ్స్​ డిపార్ట్​మెంట్.. ఇప్పటివరకు నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో నామమాత్రంగా కొనుగోళ్లు షురూ చేసింది. మిగతా ఏ జిల్లాల్లోనూ కొనుగోళ్లు మొదలు పెట్టకపోవడంతో రైతులు.. వరికోసుడెట్ల?, కోసిన పంటను కాపాడుకునుడెట్ల? అని ఆందోళనలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని సివిల్​ సప్లయ్స్​ డిపార్ట్​మెంట్ ప్రకటించింది. కానీ, అందులో ఒక్కశాతం కూడా ఓపెన్ చేయలేదు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ, డీసీఎంఎస్‌‌, మార్కెట్‌‌ కమిటీలు ఇంకా కొనుగోళ్లు షురూ చేయలేదు. ఫలితంగా జనగామా, హన్మకొండ, వరంగల్​, యాదాద్రి, నిజామాబాద్, సూర్యపేట, మహబూబాద్​, ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్​ తదితర జిల్లాల్లో  కొనుగోలు సెంటర్లు ఎప్పుడు తెరుస్తారా అని రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. 



సన్నొడ్లకు డిమాండ్.. రైతుల వద్దకు వ్యాపారులు

సర్కారు కొనుగోలు సెంటర్లు షురూ చేయక పోవడంతో వ్యాపారులే రైతుల వద్దకు వస్తున్నారు. జాతీయస్థాయిలో వరి సాగు తగ్గినందున సన్నవడ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో కర్నాటకలోని బల్లారి, ఏపీలోని విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు మన రాష్ట్రానికి వచ్చి సన్నొడ్లు, కొన్ని ప్రాంతాల్లో దొడ్డు వడ్లూ కొంటున్నారు. రాష్ట్రంలోని సూర్యాపేట, కరీంనగర్‌‌, మిర్యాలగూడతో పాటు తదితర ప్రాంతాల వ్యాపారులు పలు జిల్లాల్లో నేరుగా రైతుల పొలాల వద్దకే వెళ్లి వడ్లకు రేటు ఫిక్స్‌‌ చేసి కొంటున్నారు. దీంతో రైతులు మద్దతు ధర రాక నష్టపోతున్నారు. నిజామాబాద్, వరంగల్​, హన్మకొండ, జనగామ జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో సన్న రకాలు సాగవడంతో రాష్ట్రంలోని ఇతర జిల్లాల వ్యాపారులు, మిల్లర్లు కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. పచ్చి వడ్లు కావడంతో తరుగు పేరుతో బస్తాకు ఐదారు కిలోలు కోతపెట్టి క్వింటాల్​ రూ.1900 నుంచి రూ.2వేల వరకు ధరలు పెడుతున్నారు. నిజామాబాద్​ జిల్లాలోని బోధన్‌‌, వర్ని, మోస్రా, చందూర్‌‌, ఎడపల్లి, నిజామాబాద్‌‌ రూరల్‌‌, కోటగిరి, రుద్రూర్‌‌, బోధన్‌‌, నవీపేట మండలాల్లో వ్యాపారులు రైతుల నుంచి కొంటున్నరు. సివిల్​ సప్లయ్స్​ అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ఆలస్యం చేస్తుండటంతో వడ్లను తరుగు తీసినా ప్రైవేటు వ్యాపారులకే అమ్ముకుంటున్నారు.

వడ్లు తొందరగా కొనాలె
ప్రభుత్వం వడ్లు తొందరగా కొనాలి. 20 రోజుల నుంచి రైతులు కోతలు షురూ చేసిన్రు. వ్యాపారులు ఇప్పటికే కొంటున్నా సర్కారు ఇంకా మొదలే పెట్టలే. రైతులు ఇబ్బంది పడుతున్నరు. కోసిన ధాన్యం ఆరబోసే పరిస్థితులు లేవు. గ్రామాల్లో కొనుగోలు సెంటర్లు  ఏర్పాటు చేస్తేనే  రైతులకు మద్దతు ధర వస్తుంది. రైతులు వెంటనే అమ్ముకుంటరు. - మూడ్​ శోభన్​,   రాష్ట్ర సహాయ కార్యదర్శి, రైతుసంఘం