నీటి గుంతలో పడి బాలుడు మృతి .. మహబూబ్ నగర్ జిల్లా బోయిన్ పల్లిలో ఘటన

నీటి గుంతలో పడి బాలుడు మృతి ..    మహబూబ్ నగర్ జిల్లా బోయిన్ పల్లిలో ఘటన

మిడ్జిల్, వెలుగు: నీటి గుంతలో పడి బాలుడు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది.  గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. మిడ్జిల్ మండలం బోయిన్ పల్లి గ్రామానికి చెందిన పిట్టల రామకృష్ణ, లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు. కాగా... కొత్తగా నిర్మిస్తున్న సబ్ స్టేషన్ నిర్మాణానికి రామకృష్ణ ఇంటి ముందు పోల్ ఏర్పాటుకు గుంత తీశారు.

 స్థానికులు అడ్డుచెప్పడంతో  గుంతను అసంపూర్తిగా వదిలేశారు. బుధవారం కురిసిన వర్షాలకు గుంతలోకి నీరు చేరింది. గురువారం మధ్యాహ్నం ఇంటిముందు రిత్విక్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గుంతలో పడి చనిపోయాడు. కొడుకు ఇంటి ముందే శవమై కనిపించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. గుంతను పూడ్చకుండా నిర్లక్ష్యం చేసి బాలుడి మృతికి కారణమైన సదరు కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.