- బడ్జెట్లో కేటాయించిన ప్రభుత్వం
- గత బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయింపు
- రూ.255 కోట్ల అంచనాలతో కొనసాగుతున్న పనులు
- కరకట్ట పూర్తికి మరో రూ.40 కోట్లు అవసరం
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు కరకట్ట నిర్మాణానికి రాష్ర్ట ప్రభుత్వం తాజా బడ్జెట్లో మరో రూ.115.84 కోట్లను కేటాయించింది. గత బడ్జెట్లో రూ.100 కోట్లు ఇవ్వగా ఈసారి మరిన్ని నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం భారీగా ఫండ్స్ కేటాయించడంతో కరకట్ట నిర్మాణ పనులు మరింత స్పీడప్ కానున్నాయని భావిస్తున్నారు.
మంచిర్యాల ముంపు నివారణ చర్యల్లో భాగంగా రూ.255 కోట్లతో కరకట్ట పనులు కొనసాగుతున్నాయి. నిరుడు జూన్‌లో పనులు ప్రారంభించినప్పటికీ వర్షాలతో అంతరాయం కలిగింది. వానలు తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి అక్టోబర్ నుంచి పనులు కొనసాగిస్తున్నారు.
ముంపుతో అతలాకుతలం..
ఏటా వర్షాకాలంలో రాళ్లవాగు బ్యాక్ వాటర్‌తో జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు నీటమునుగుతున్నాయి. 2022 జూలైలో గోదావరికి భారీగా వరదలు రావడంతో రాళ్లవాగు ఎగదన్నింది. దీంతో ఎన్టీఆర్ నగర్, రాంనగర్, ఎల్ఐసీ కాలనీ, ఆదిత్య ఎన్క్లేవ్, సంజీవయ్య కాలనీ, రెడ్డి కాలనీ, రాళ్లపేట, తెలంగాణ తల్లి చౌరస్తా ఏరియాలు నీటమునిగాయి. ఎన్టీఆర్ నగర్, రాంనగర్, ఎల్ఐసీ కాలనీలు రెండు రోజులపాటు నీళ్లలోనే ఉన్నాయి.
ఇంచుమించుగా ఏటా ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో మంచిర్యాల ముంపు నివారణకు రాళ్లవాగుకు కరకట్ట నిర్మించాలని ప్రతిపాదించారు. ఇరిగేషన్ అధికారులు రూ.255 కోట్లతో ప్రపోజల్స్ పంపగా ప్రభుత్వం ఆమోదించింది. నిరుడు బడ్జెట్లో రూ.100 కోట్లను కేటాయించడంతో పనులు ప్రారంభించారు.
6.7 కిలోమీటర్లు నిర్మాణం..
వానాకాలంలో రాళ్లవాగుకు పెద్ద ఎత్తున వస్తున్న వరదలను అంచనా వేసిన అధికారులు అందుకు అనుగుణంగా కరకట్ట నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. జిల్లా కేంద్రంలోని కార్మెల్ స్కూల్ దగ్గర నుంచి రాళ్లవాగు గోదావరిలో కలిసేంత వరకు 6.7 కిలోమీటర్ల పొడవునా కరకట్ట నిర్మిస్తున్నారు. కార్మెల్ స్కూల్ వద్ద వద్ద మూడు మీటర్ల హైట్‌తో నిర్మిస్తుండగా, ఆ తర్వాత హైట్ పెంచుతూ పోతున్నారు.
ఇలా రాళ్లవాగు గోదావరిలో కలిసే దగ్గర దాదాపు రెండు కిలోమీటర్ల పొడవునా 13 మీటర్ల హైట్‌తో కరకట్ట నిర్మించనున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు రూ.215.84 కోట్లు కేటాయించగా, మరో రూ.40 కోట్లు అవసరమవుతాయి. ఈ పనులు పూర్తయితే మంచిర్యాలలోని పలు కాలనీలకు ముంపు ముప్పు తప్పుతుంది.
