పాత డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు.. త్వరలో కొత్తది

పాత డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు.. త్వరలో కొత్తది

 హైదరాబాద్: పాత డీఎస్సీ నోటిఫికేషన్ను  రద్దు చేసింది తెలంగాణ సర్కార్. టీచర్ పోస్టుల భర్తీ కోసం గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023 సెప్టెంబర్ లో  5,089 టీచర్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేసింది రాష్ట్ర సర్కార్.  త్వరలో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామన్న స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ప్రకటించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తిరిగి అప్లయ్ చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ తెలిపింది. 

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్లు విడుదల చేసిన రేవంత్ రెడ్డి సర్కార్.. తాజా మరో భారీ నోటిఫికేషన్ విడుదలకు కసర్తత్తు చేస్తోంది.మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా పాత డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 వేల టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 

అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 పోస్టుల భర్తీకి గత సెప్టెంబర్ లో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అక్టోబర్ నెలాఖరు దాకా అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్​లో ఎగ్జామ్ పెడ్తామని ప్రకటించింది. తక్కువ పోస్టులు ఉండటంతో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. 

ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పరీక్ష వాయిదా వేశారు. ఈ క్రమంలో తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో పాత పోస్టులతో పాటు మరో 4,957 జనరల్ టీచర్ పోస్టులు, 1,016 స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీకి తాజాగా ఫైనాన్స్ శాఖ అనుమతులు ఇచ్చింది. మొత్తంగా 11,062 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. వీటిలో ఎస్జీటీ పోస్టులు 7,304, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,849, పండిట్ పోస్టులు 727, పీఈటీ పోస్టులు 182 ఉన్నాయి.