నిరుద్యోగుల గోస వినిపిస్తలేదా?

నిరుద్యోగుల గోస వినిపిస్తలేదా?

‘‘మా ఉద్యోగాలు మాకు కావాలి’’ తెలంగాణ ఉద్యమం సమయంలో రాష్ట్ర యువత, నిరుద్యోగులు, స్టూడెంట్ల ప్రధాన డిమాండ్​ ఇదే. సొంత రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని వారంతా ఎన్నో త్యాగాలు చేశారు. ప్రాణాలు సైతం అర్పించారు. ఉద్యమం ఉధృతంగా ఉన్న టైంలో జ‌‌స్టిస్ శ్రీ‌‌కృష్ణ క‌‌మిటీ యువ‌‌త నుంచి వివ‌‌రాలు తీసుకున్నప్పుడు వారంతా చెప్పిన మాట కూడా ఇదే. తెలంగాణ వచ్చిన ఏడేండ్ల తర్వాత కూడా నిరుద్యుగులు ఇదే డిమాండ్​ చేస్తుండటం రాష్ట్రంలోని దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.
రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు తీరుతో రైతులకు తోడు నిరుద్యోగులు కూడా బలవన్మరణాలకు పాల్పడే పరిస్థితి వచ్చింది. ఏడేండ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో యువత మానసిన ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యోగం లేదన్న మనస్తాపంతోనే కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్​ సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ‘‘నేను చేతకాక చావడం లేదు. నా చావుతో నైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి’’ అంటూ వీడియోలో చెప్పి, పురుగు మందు తాగాడు. సునీల్ ఆత్మబలిదానంపై సీఎం కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడ‌‌లేదు. సునీల్​మరణంతోపాటు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్న వారందరి చావులకూ టీఆర్ఎస్ స‌‌ర్కారే బాధ్యత తీసుకోవాలి.

సొంత రాష్ట్రంలో పరిస్థితి మారలే
ఉద్యమం సమయంలో తెలంగాణ యువత, నిరుద్యోగులు, స్టూడెంట్లు మా ఉద్యోగాలు మాకు కావాలి అన్నారంటే అర్థం ఉంది. కానీ సొంత రాష్ట్రంలో మన పాలకులు వచ్చిన తర్వాత కూడా ప‌‌రిస్థితి ఏమైనా మారిందా? అంటే లేదనే సమాధానమే వస్తోంది. తెలంగాణ వస్తే లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని సునీల్‌‌లాగే ఎంతో మంది నిరుద్యోగులు ఆశించారు. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కంటే దయనీయంగా నేటి పరిస్థితి తయారైంది. రాష్ట్ర సాధన కోసం అన్నీ వదులుకుని పోరాడిన యువకులు ఇప్పుడు ఉద్యోగాలకు అప్లై చేసుకునే వయసును దాటిపోయారు. ఇంకొందరు దాటిపోతున్నారు. వీరిలో చాలా మంది కుటుంబాలను పోషించుకోలేని దుర్భర స్థితిలో జీవితాలు గ‌‌డుపుతున్నారు. ఉద్యోగ‌‌ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసీ చూసీ ఆగమైపోతున్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, పది మందిలో తలెత్తుకుని తిరగలేక మనో వేదనకు గురవుతున్నారు. 

హామీ ఇచ్చి మరిచిపోయిన్రు
రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరుల గోస.. వారి కుటుంబాల ఆవేదన.. నిరుద్యోగుల ఎదురుచూపులు.. మళ్లీ యువత ఆత్మబలిదానాలు చేసుకునే పరిస్థితి రావడం నిజంగా దుర‌‌దృష్టక‌‌రం. అమ‌‌రుల‌‌ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇంటికో ఉద్యోగం వస్తదని చెప్పిన విష‌‌యం అంద‌‌రికీ తెలిసిందే. కానీ, ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన త‌‌ర్వాత కేసీఆర్ ఆ మాట‌‌ని నీటి మూట‌‌గా మార్చారు. 2014 ఎన్నికలయ్యాక జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనూ సీఎం కేసీఆర్ ఉద్యోగాలపై ప్రకటన చేశారు. రాష్ట్రంలో లక్షా 7 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన విష‌‌యం తెలంగాణ స‌‌మాజం యాదికి తెచ్చుకుంటోంది.

ఉన్నవెన్ని.. భ‌‌ర్తీ చేసినవెన్ని
రాష్ట్రం ఆవిర్భావించే నాటికి(అంటే 2014 జూన్ 2 వ‌‌ర‌‌కు) తెలంగాణ‌‌లో ఖాళీగా ఉన్న పోస్టులు, ఆ తర్వాత ఏటా రిటైర్ అవుతున్న వారితో కలిపి దాదాపు మూడు లక్షలు ఉన్నాయని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ 110 నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేసింది 35,724 ఉద్యోగాలు మాత్రమే. అయితే రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ పోర్టల్‌‌‌‌లో రిజిస్టర్ చేసుకున్నారు. ప్రభుత్వంలోని అన్ని డిపార్ట్‌‌‌‌మెంట్లలో మొత్తం 1,91,126 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ఇటీవలే ఇచ్చిన పీఆర్సీ నివేదిక బ‌‌హిర్గతం చేసింది. టీఎస్పీఎస్సీలో రిజిస్టర్ చేసుకోని వారితో కలిపితే తెలంగాణలో మొత్తం 35 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారని అంచనా. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతే ఎక్కువ. టీఎస్పీఎస్సీ వద్ద ఉద్యోగాల కోసం పేరు రిజిస్టర్ చేసిన వారిలో 85% శాతం ఆయా వర్గాలకు చెందిన వారే. టీఎస్పీఎస్సీలో నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య ఇలా ఉంది. ఓసీ -3,78,879, బీసీ–-ఏ 1,96,276, బీసీ–-బీ 5,37,807, బీసీ–-సీ 16,237, బీసీ–-డీ 4,82,801, బీసీ-–ఈ 1,17,560, ఎస్సీ 4,96,122, ఎస్టీ- 2,36,350 నిరుద్యోగులుగా నమోదు చేసుకున్నారు. ఈ లెక్కలు ప్రభుత్వానికి తెలియనివి కాదు. అయినా సరే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా గ్రూప్–1 నోటిఫికేషన్ ఇవ్వలేదంటే కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు ఉద్యోగాల భర్తీ మీద, నిరుద్యోగ సమస్య మీద ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థమవుతోంది. 

జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగాల భ‌‌ర్తీ జ‌‌రిగిందా?
సంవ‌‌త్సరాల పాటు రాష్ట్రంలో ఉద్యోగాల భ‌‌ర్తీ జ‌‌ర‌‌గ‌‌డం లేదు. దీని ప్రభావం అన్ని రంగాలపై తీవ్రంగా ప‌‌డుతోంది. ఖాళీలు భర్తీ చేయకపోవడంతో అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఉద్యోగులపై పని భారం పెరుగుతోంది. ఇటీవ‌‌ల‌‌ రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదించిన పాత కేడర్ ఉద్యోగుల సంఖ్య ప్రకారమే ఎడ్యుకేషన్, హెల్త్, పోలీస్, రెవెన్యూ, వెల్ఫేర్ తదితర 32 డిపార్ట్​మెంట్లలో కలిపి 4.57 లక్షల పోస్టులు ఉంటే.. ప్రస్తుతం 3.09 లక్షల మంది మాత్రమే పని చేస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. మరో 1.48 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నప్పటికీ.. ఇప్పుడు 50 వేల పోస్టులు భర్తీ చేస్తామని చెబుతోంది. ఇన్నేండ్లుగా టీఆర్ఎస్​ అధికారంలో ఉండి ఏం చేస్తున్నట్టు? ఇంకా ఆ ఉద్యోగాల భర్తీకి ఎన్నేండ్లు పడుతుంది. ఇవికాక 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలు చేశాక కొత్త జిల్లాల్లో ఏర్పడిన ఉద్యోగాలెన్ని? వాటిలో కొత్తగా ఎంత మందిని నియమించారు? ప్రస్తుతం ఉన్న ఖాళీలెన్ని? కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశామని గొప్పగా చెప్పుకునే సర్కారు వాటిలో పాలన సక్రమంగా నడవాలంటే ఉద్యోగాలు భర్తీ చేయాలన్న విషయం మర్చిపోయింది. 

నోటిఫికేషన్లు వివాదాలమయం
తెలంగాణలో నిరుద్యోగం రేటు 33.9 శాతంగా ఉంది. దేశంలో అత్యధిక నిరుద్యోగిత ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ నివేదిక స్పష్టంచేస్తున్నది. ప్రభుత్వం రిలీజ్ చేసిన అర కొర నోటిఫికేషన్లు కూడా వివాదాలమయమే. పైగా కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉపాధి హామీ, మిషన్ భగీరథ, హార్టికల్చర్ శాఖల్లో 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. వీరితో పాటు ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ శాఖ, విద్యా శాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్​లో పనిచేస్తున్న మరో పది వేల మందిని ‘నో వర్క్ నో పే’ పేరుతో రోడ్డున పడేసింది. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాలే ఉండవని, అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ హామీలు ఇచ్చారు. కానీ అలాంటి ఉద్యోగాల్లో ఉన్న వాళ్లను పీకేయడం తప్ప ఎక్కడా పర్మినెంట్ చేసిన దాఖలాలు లేవు. అధికార వికేంద్రీక‌‌ర‌‌ణ అంటే కేవ‌‌లం జిల్లాలు ఏర్పాటు చేస్తే స‌‌రిపోదు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ కార్యాల‌‌యాల్లో ఉద్యోగాల‌‌ను భ‌‌ర్తీ చేస్తే రాజ్యాంగ రూప‌‌క‌‌ర్త బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాట‌‌ల‌‌కు సార్థకత లభిస్తుంది.

ఉపాధి కల్పనలో టీఆర్ఎస్ సర్కార్ విఫలమవ్వడంతో డిగ్రీలు, పీజీలు చేసిన యువత కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. తెలంగాణ కోసం1,200 మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకున్న చరిత్ర కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు గుర్తు లేకపోవడం దారుణం. కేసీఆర్ కుటుంబానికి రాజకీయ ఉద్యోగాలు కల్పించడం కోసం వాళ్లంతా ప్రాణ త్యాగాలు చేయలేదని తెలుసుకోవాలి. వారి బలిదానాలకు అర్థం లేకుండా చేయొద్దని అమరుల కుటుంబాలతో పాటు ఉద్యమంలో కొట్లాడిన ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర యువతలో అభద్రతా భావాన్ని తొలగిస్తూ మరో నిరుద్యోగి బలి కాకముందే ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేపట్టాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా చర్యలు తీసుకోవాలి. అలాగే నిరుద్యోగ భృతిని కూడా అమలు చేయాలి. లేదంటే నిరుద్యోగులు మరో ఉద్యమానికి సిద్ధమవుతారు.

నియామకాలపై కాకి లెక్కలు
తెలంగాణలో ఇప్పటివరకు లక్షా 32 వేల 899 ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రులు కాకి లెక్కలు చెప్తున్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి ఉన్న ఖాళీలు ఎన్ని? ఇప్పటి వరకు ఎంత మంది రిటైర్ అయ్యారు? ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి? అన్న లెక్కలు కూడా చెబితే బాగుంటుంది. ప్రైవేటు కంపెనీల్లో వచ్చిన ఉద్యోగాలను కూడా కలిపి సర్కారు దొంగ లెక్కలు చెప్పి యువతను మోసగించాలని చూస్తోంది. నిజానికి సర్కార్ భర్తీ చేసిన వాటి కంటే ఖాళీ అయిన ఉద్యోగాలే పదింతలు ఉంటాయి. రాష్ట్రంలో యువతకు తప్ప టీఆర్ఎస్ నేతలు, కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే రాజకీయ నిరుద్యోగం లేకుండా ఎప్పటికప్పుడు పదవులు దక్కుతున్నాయి. ఉద్యోగాలు లేనివారికి నిరుద్యోగ భృతి కల్పిస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినా రెండున్నరేండ్లు అయినా అమలు చేయలేదు. నిరుద్యోగ యువతకు రూ.3,016 చొప్పున ఇస్తామంటూ 2019–-20 బడ్జెట్‌‌‌‌లో రూ.1,810 కోట్లు కేటాయించారు. కానీ యువతకు పైసా అందలేదు. ఆ తర్వాత 2020-–21, 2021–-22 బడ్జెట్లలో భృతి ప్రస్తావనే లేదు. ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతి నిరుద్యోగికి రూ.70 వేలకు పైగా బాకీ పడింది. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అంటూ ప్రకటనలతో యువతను ఓటు బ్యాంకుగా కేసీఆర్ వాడుకుంటూ వారిని బలిచేస్తున్న విష‌‌యం యావ‌‌త్ తెలంగాణ స‌‌మాజం గ‌‌మ‌‌నిస్తోంది.
- మ‌‌న్నారం నాగ‌‌రాజు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ లోక్‌‌స‌‌త్తా పార్టీ