పోడు భూముల విషయంలో సర్కారు కీలక నిర్ణయం

పోడు భూముల విషయంలో సర్కారు కీలక నిర్ణయం

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: పోడు భూముల విషయంలో సర్కారు నిర్ణయం గిరిజనేతరుల్లో ఆందోళన కలిగిస్తోంది. సెక్రటేరియట్ ఓపెనింగ్ రోజు పోడు పట్టాల ఫైల్ మీద సీఎం కేసీఆర్​సంతకం పెట్టిన విషయం తెలిసిందే.  అయితే  గిరిజనులకు మాత్రమే పట్టాలు ఇస్తామని చెప్పిన ఆయన.. ఎస్సీలు, బీసీలు గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.  ఉమ్మడి మెదక్​ జిల్లాలో 14,177 ఎకరాలకు సంబంధించి, 8,097 మంది రైతులు పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 3,430 ఎకరాలకు సంబంధించి 2,808 మంది ఎస్టీలు రైతులు కాగా.. మిగతా వాళ్లు ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వారు.  దశాబ్దాలుగా పోడు భూములను సాగు చేస్తున్న తాము పట్టాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, న్యాయం చేయాలని కోరుతున్నారు. 

మెదక్ జిల్లాలో..

జిల్లాలోని 16 మండలాల్లోని 84 గ్రామాల పరిధిలో 6,872 ఎకరాల భూమికి సంబంధించి పోడు పట్టాల కోసం 4,015 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,061 మంది గిరిజనులు ఉండగా, 2,954 మంది గిరిజనేతరులు. ఈ మేరకు రెవెన్యూ, ఫారెస్ట్​ ఆఫీసర్లు సర్వే చేసి, గ్రామసభలు పెట్టి అర్హులను గుర్తించారు.  ప్రస్తుతం కేవలం గిరిజనులకు పట్టాలివ్వాలని నిర్ణయించగా జిల్లా యంత్రాంగం 84 గ్రామాల పరిధిలో 610 మందిని గుర్తించింది. వీరికి 402.16 ఎకరాలకు సంబంధించి పోడు పట్టాలు అందజేయనున్నారు.  

సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో...

జిల్లాలో మొత్తం 7,109 ఎకరాలకు 3,936 మంది దరఖాస్తు చేసుకున్నారు.  ఇందులో  4,129 ఎకరాలకు సంబంధించి 2,168 మంది ఎస్టీలు,  2,980 ఎకరాలకు సంబంధించి 1,768 మంది  ఇతరులు ఉన్నారు.    సిద్దిపేట జిల్లాలో 146 మంది రైతులు196.08 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.  ఇందులో 48.08 ఎకరాలకు సంబంధించి 30 మంది  ఎస్టీలు, ఇతరులు 116 మంది ఉన్నారు. 

కొన్నిచోట్ల భూ వివాదాలు

జహీరాబాద్, వట్ పల్లి, కల్హేర్, మొగుడంపల్లి, ఝరాసంఘం, నారాయణఖేడ్, చౌటకూర్, హత్నూర, కోహిర్, సిర్గాపూర్ మండలాలతో పాటు సిద్దిపేటలోని కొన్ని ప్రాంతాల్లో అటవీ, రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. అటవీ, రెవెన్యూ శాఖల ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో ఇప్పటికే భూములను సర్వే చేసినప్పటికీ చాలా చోట్ల వివాదాలు సద్దుమణగలేదు. దీంతో ఈ ప్రాంతాల్లో ఎస్టీలకు కూడా ఎంతమందికి పట్టాలు అందుతాయో తెలియని పరిస్థితి ఉంది.  2005కు ముందు అటవీ భూముల్లో సాగు చేస్తున్నట్టు ఆధారాలు తప్పని సరి కావడం కూడా సమస్యగా మారింది.  కొన్నిచోట్ల ఎస్టీలు దశాబ్దాలుగా సాగు చేస్తున్నా 2005కు ముందు రెవెన్యూ అధికారులు పత్రాలు ఇవ్వలేదు. ఇలాంటి చోట ఇబ్బందులు ఎదురవుతున్నాయి.