- మెదక్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో జెండా ఆవిష్కరణ
మెదక్, వెలుగు: సమాజంలో అన్నీ వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నామని రాష్ట్ర ఉపాధి, కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. గత పాలనలో తెలంగాణలో ధ్వంసమైన అన్ని రంగాలను చక్కదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం అంకితమైందన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలోని అమర వీరుల స్తూపం వద్ద మంత్రి నివాళులు అర్పించారు.
ఆ తరువాత మెదక్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మెదక్ జిల్లాలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 4.19 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని, దీని ద్వారా మహిళలకు రూ.149.27 కోట్ల లబ్ది చేకూరిందన్నారు. జిల్లాలో లక్ష 29 వేల 471 మంది వినియోగదారులకు గృహలక్ష్మి కింద జీరో కరెంట్ బిల్లు జారీ అయ్యిందన్నారు. సబ్సిడీ గ్యాస్ పథకం కింద 1, 26, 961 మందికి రూ.13.18 కోట్ల సబ్సిడీ ఇచ్చామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా జిల్లాలో మొదటి విడతలో రూ.454.90 కోట్ల వ్యయంతో మొత్తం 9,098 ఇండ్లు మంజూరయ్యాయని, ఇప్పటివరకు రూ.146.32 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు.
టీజీ ఐపాస్ ద్వారా ఇప్పటివరకు రూ.12,916.18 కోట్ల పెట్టుబడితో 1,398 పరిశ్రమలను స్థాపించి 27,325 మందికి ఉపాధి కల్పించనున్నట్టు తెలిపారు. 67, 980 మంది రైతులకు రూ.166.47 కోట్లు రైతు భరోసా కోట్లు అందించామన్నారు. జిల్లాలో 2, 40, 833 కుటుంబాలకు ఉచితంగా సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేశామని, యాసంగిలో 64,493 మంది రైతుల నుంచి 3,05,018 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.512.15 కోట్లు పేమెంట్ చేశామని తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌కు ఎంపికయిన లబ్ధిదారులకు మంత్రి మంజూరు పత్రాలు అందజేశారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ చెక్కు పంపిణీ చేశారు. మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, ఎస్సై విఠల్, రుక్సానా బేగంకు పోలీస్ సేవా పథకాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావ్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
