ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సర్కార్​ డైలమా

ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సర్కార్​ డైలమా

ఇంతవరకూ నోటిఫై కాని కొత్త చట్టం

పాత చట్టంతో ముందుకెళ్తే పరువుపోతుందని భయం

3 నెలలుగా ఆగిన నాన్​ అగ్రికల్చర్​ ఆస్తుల రిజిస్ట్రేషన్​

5 లక్షల మందిపై ఎఫెక్ట్.. ప్రభుత్వ తీరుపై విమర్శల వెల్లువ​

కోర్టు సూచనలను పాటించడమే బెటర్​ అంటున్న ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు: నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ముందుకు వెళ్లాలో వెనక్కి వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నది. ఇందుకోసం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని కూడా ఇంతవరకూ నోటిఫై చేయలేదు. ఆ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్లు చేద్దామంటే కోర్టులో కేసు నడుస్తోంది. అట్లని పాత పద్ధతిన రిజిస్ట్రేషన్లు షురూ చేస్తే పరువు పోతుందని భయపడుతోంది. ఆస్తుల రిజిస్ట్రేషన్​కోసం రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్, పంచాయతీ రాజ్​ యాక్టుల్లో సవరణలు చేసింది. ఇది అసెంబ్లీలో  ఆమోదం పొందడంతో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ లీడర్లు సంబురాలు జరుపుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని చట్టాన్ని కేసీఆర్ తీసుకొచ్చారని గొప్పగా చెప్పుకున్నారు. అయితే.. ఇప్పుడు అలాంటి చట్టంతో కాకుండా పాత చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్లు చేస్తే  అభాసుపాలవుతామన్న ఆందోళనలో ఉన్నారు. మరోవైపు రిజిస్ట్రేషన్లు ఆలస్యమవుతున్న కొద్దీ ప్రజల నుంచి విమర్శలు పెరుగుతున్నాయి. ఇంకెంత కాలం ఆస్తులను అమ్మకుండా, కొనకుండా చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పటికే  మూడు నెలల నుంచి నాన్​ అగ్రికల్చర్​ ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి.

సమాచార సేకరణ, భద్రతపై కోర్టు ఆగ్రహం

ధరణి పోర్టల్​ ద్వారా నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టులో కేసు నడుస్తోంది. పోర్టల్​లో నమోదు కోసం ఆస్తుల వివరాలను  ప్రభుత్వం అడుగుతోందని, వివరాలను దాంట్లో నమోదు చేస్తే ఇతరులకు తెలిసే ప్రమాదం ఉందని కొందరు
హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ  సందర్భంగా హైకోర్టు.. ఏ చట్టం ప్రకారం ఆస్తుల వివరాలను సమర్పించాలని ప్రజలను అడుగుతున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆస్తుల వివరాలు ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్లు చేయలేరా? అని అడిగింది. ప్రజలు ఆధార్ డేటాతోపాటు వారి ఆస్తుల వివరాలను ఎలా భద్రపరుస్తరనే విషయాన్ని చట్టంలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది. కోర్టు వేసే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకుంటే..

‘ధరణి పోర్టల్ ఓ ట్రెండ్ సెట్టర్’ అని సీఎం కేసీఆర్ అక్టోబర్​ 29న పోర్టల్ ప్రారంభిస్తూ ప్రకటించారు. ఇక నుంచి అన్ని రకాల ఆస్తుల క్రయవిక్రయాలు పావుగంటలో జరిగిపోతాయన్నారు. అంత గొప్పగా చెప్పిన ధరణి ద్వారా కాకుండా పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరిపితే సర్కారు పరువు పోతుందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో నడుస్తోంది. నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు ధరణి ద్వారా మాత్రమే జరిపేందుకు ప్రభుత్వం పంచాయతీ, మున్సిపల్ యాక్టులను సవరించింది. ఇందుకోసం అక్టోబర్​ 12, 13 తేదీలో అసెంబ్లీ, మండలిని ప్రత్యేకంగా సమావేశపరిచి సవరణ చట్టాలను ఆమోదించుకుంది. దీంతో ధరణి పోర్టల్ ద్వారా కాకుండా పాత పద్ధతిలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయడానికి వీలు లేదు. అయితే ఒకవేళ పాత పద్ధతిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయాలని భావిస్తే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఫెయిలైనట్లుగా అంగీకరించాల్సి వస్తుందని ప్రభుత్వం భయపడుతున్నది.

అందుకే కొత్త చట్టాన్ని నోటిఫై చేయలేదా?

నాన్ అగ్రికల్చర్  ఆస్తుల రిజిస్ట్రేషన్లు కేవలం ధరణి పోర్టల్ ద్వారా చేసేందుకు అసెంబ్లీలో చట్ట సవరణ చేసి దాదాపు రెండు నెలలవుతోంది. ఇంతవరకు ఆ చట్టాన్ని ఎప్పట్నించి అమలు చేయాలన్నదాన్ని ప్రభుత్వం జీవో ఇవ్వలేదు. లీగల్​గా చిక్కులు వస్తాయనే అనుమానంతోనే ప్రభుత్వం కొత్త చట్టాన్నినోటిఫై చేయలేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాత చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్లు చేసే వెసులుబాటు ఉన్నా  అలా చేస్తే  అనాలోచితంగా చట్టాలు చేశారనే  విమర్శలు వస్తాయని ప్రభుత్వ వర్గాలు భయపడుతున్నాయి.

కోర్టు గైడెన్స్ తో ముందుకు వెళ్లడమే బెటర్

ధరణి​పై కోర్టు వ్యక్తం చేస్తున్న లోపాలను సవరించుకోవడం మంచిదని సీనియర్ ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రజల నుంచి ఆస్తుల వివరాల సేకరణను చట్టబద్దం చేయడం సాధ్యం కాదని, అందుకని ఆస్తులను అమ్ముకునే ముందు నిర్ణీత గడువులోపు వివరాలను పోర్టల్ లో నమోదు చేసుకునే  వెసులుబాటు కల్పించాలని అంటున్నారు. ప్రజల ఆస్తుల వివరాలను గోప్యంగా ఉంచడం కోసం కేంద్రం విధానాలను పాటించాలని సూచిస్తున్నారు.

నిలిచిపోయిన 5 లక్షల రిజిస్ట్రేషన్లు

మూడు నెలలుగా ఆస్తుల రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 5 లక్షల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు అంటున్నాయి. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన రియల్ ఎస్టేట్ బిజినెస్ కాస్త ఊపందుకుంటున్న టైంలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు బంద్ చేయడంతో మిడిల్​ క్లాస్​ ప్రజలపై ఎఫెక్ట్​ పడింది. అమ్మిన ప్లాట్​కు  రిజిస్ట్రేషన్ జరగక కొనుగోలుదారులు డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో టైంకు డబ్బు రాక  కొందరు తమ పిల్లల పెండ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. మరికొందరు తమ పిల్లల పైచదువుల ప్లానింగ్ షెడ్యూల్​  మార్చుకున్నారు. మరోవైపు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో   బ్యాంకింగ్ వ్యవస్థపైనా ప్రభావం పడింది. ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్లను బ్యాంకు లోన్ల ద్వారా కొనుగోలు చేస్తుంటారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో లోన్ల కోసం బ్యాంకులకు క్లయింట్స్​ రావడం లేదు.

రిజిస్ట్రేషన్​ కాలె.. పైసలు రాలె
ఈయన పేరు రుక్కు. ఊరు జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల. ఆర్థిక సమస్యల కారణంగా తనకున్న 8 గుంటల ఇంటి స్థలాన్ని 2నెలల కింద అమ్మిండు. వచ్చిన పైసలతో అప్పులు తీర్చేద్దమనుకున్నడు. అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు కొన్నోళ్లు కొంత అడ్వాన్స్  ఇచ్చిన్రు. రిజిస్ట్రేషన్  అయినంకనే మొత్తం ఇస్తమన్నరు. సర్కారు రిజిస్ట్రేషన్లు బంద్​ పెట్టడంతో సమస్య ఏర్పడింది. రిజిస్ట్రేషన్​ అయితెనే కొన్నోళ్లు డబ్బులు ఇస్తమనడంతో రుక్కుకు ఎదురుచూపులు తప్పడం లేదు.

కొన్న స్థలంలో ఇల్లు కట్టలేక..

ఈయన పేరు గంగన్న. ఉండేది జగిత్యాల జిల్లా రాయికల్. ఇల్లు కట్టుకుందామని గుంటన్నర స్థలం కొనుక్కున్నడు. బ్యాంక్​లో హౌస్​లోన్​ కోసం అప్లై చేసిండు. కానీ ఈలోపే రిజిస్ట్రేషన్లు బండైనయ్.  ఇంకా గంగన్న పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదు. బ్యాంకుకు పోతే ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్​ అయితే తప్ప లోన్​ ఇవ్వమంటున్నరు. దీంతో తాను ఇంటి పనులు మొదలుపెట్టలేకపోతున్నానని గంగన్న బాధపడుతున్నడు.

రూ. 10 లక్షలు మునిగిన

నేను చి న్న చి న్న ప్లాట్ల బేరం చేస్త. అట్లని రియల్ ఎస్టేట్ వ్యాపారిని కాదు. నాలుగు రూపాయలు పెడితే.. ఇంత కమీషన్ వస్తదని ఆశ. ఆడా ఇడా తెచ్చి ప్లాట్లకు అడ్వాన్సు ఇచ్చిన. అంతల్నే రిజిస్ట్రేషన్లు ఆపేసిన్రు. ప్లాట్ల ఓనర్లు మాత్రం రిజిస్ట్రేషన్లతో తమకు సంబంధం లేదని, మొత్తం డబ్బులు కట్టు మంటున్నరు . లేకపోతే ఇచ్చిన అడ్వాన్సు తిరిగి ఇచ్చేది లేదంటున్నరు . పెట్టిన డబ్బులు పోవద్దని 5 రూపాయల మిత్తికి తెచ్చి పైసలు కట్టిన. రూపాయి వచ్చుడు మాట దేవునికెరుక. మిత్తీలతో ఇప్పటికే రూ.10 లక్షలకు మునిగిన. -కూచన రాజు, నర్సంపేట, వరంగల్ రూరల్ జిల్లా.