- దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, దీర్ఘకాలిక రోగుల కుటుంబాలకూ వర్తింపు
- 57 ఏళ్లలోపు ఉంటే వితంతు.. దాటితే వృద్ధాప్య పింఛన్
- 15 రోజుల్లోగా వివరాలు నమోదు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చేయూత సామాజిక భద్రతా పింఛన్ పొందుతున్న పురుషుడు మరణిస్తే, అతని భార్యకు తక్షణమే పింఛన్ మంజూరు చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఇప్పటివరకు వృద్ధాప్య పెన్షన్ల విషయంలో ఉన్న ఈ నిబంధనను.. ఇకపై దివ్యాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులు, డయాలసిస్, ఏఆర్టీ, ఫైలేరియా కేటగిరీల పింఛన్‌దారుల కుటుంబాలకూ వర్తింపజేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పింఛనుదారుడైన భర్త చనిపోయినప్పుడు ఆయన భార్య వయసును బట్టి పెన్షన్వర్తింపజేస్తారు. భార్య వయసు 57 ఏళ్లలోపు ఉంటే ఆమెకు వితంతు పింఛన్ మంజూరు చేస్తారు. 57 ఏళ్లు, అంతకంటే ఎక్కువ ఉంటే వృద్ధాప్య పెన్షన్కింద నమోదయ్యేలా చూస్తారు.
కలెక్టర్ఆమోదం పొందిన వెంటనే..
భర్త మరణించిన మహిళ గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శికి, పట్టణాల్లో బిల్ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్, భర్త ఆధార్ కార్డు, డెత్ సర్టిఫికెట్ లను అప్లికేషన్‌కు జత చేయాలి. భర్త మరణించిన 15 రోజుల్లోగా పంచాయతీ కార్యదర్శి, వార్డు ఆఫీసర్, బిల్ కలెక్టర్ పత్రాలను పరిశీలించి, వివరాలను చేయూత పోర్టల్‌లో నమోదు చేయాలి. ఈ దరఖాస్తులను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి డీఆర్డీవో, కలెక్టర్ల ఆమోదానికి పంపిస్తారు. కలెక్టర్ ఆమోదం పొందిన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా ఆ మరుసటి నెల నుంచే పెన్షన్అందిస్తారు. దీన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. భర్తలను కోల్పోయిన మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం, వారి కుటుంబాలకు అందుతున్న సామాజిక భద్రతా సహాయం కొనసాగాలని ఉద్దేశంతోనే సర్కారు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
