డిపార్ట్​మెంట్ల వారీగా డాటా సేకరణ పూర్తి

డిపార్ట్​మెంట్ల వారీగా డాటా సేకరణ పూర్తి

మందమర్రి, వెలుగు: రోజు రోజుకు పెరిగిపోతున్న అర్బనైజేషన్​కు అనుగుణంగా పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనపై మున్సిపల్​ శాఖ దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు మాస్టర్​ప్లాన్​ రూపొందించడంపై సర్కార్ నజర్​ పెట్టింది. పంచాయతీలు కొనసాగిన కాలంలో అడ్డదిడ్డంగా  నిర్మాణాలు చేపట్టడంతో ప్రస్తుతం టౌన్​లలో సమస్యలు మొదలయ్యాయి. మరోవైపు పాత మున్సిపాలిటీల్లో అప్పటి జనాభా, పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన మాస్టర్​ప్లాన్​లో జోన్లు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో భవిష్యత్​ తరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కాగా మాస్టర్​ ప్లాన్లను రూపొందించాలని సర్కారు నిర్ణయించింది.

పాత మున్సిపాలిటీల్లో లోపాలను సవరించడం, కొత్త మాస్టర్ ప్లాన్​పక్కాగా అమలు చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. మాస్టర్​ ప్లాన్​ కనీసం 25 నుంచి 30 సంవత్సరాల ముందస్తు అవసరాలను అనుగుణంగా రూపొందించనున్నారు.  ఇప్పటికే కొత్త మున్సిపాలిటీల్లో ఆయా డిపార్ట్​మెంట్ల నుంచి డాటా కలెక్ట్​చేసిన డైరెక్టర్​ఆఫ్​మున్సిపల్​అడ్మినిస్ట్రేషన్​(డీఎంఎ) విడతలవారీగా సమీక్షలు జరుపుతోంది. జీహెచ్ఎంసీ  మినహా రాష్ట్రవ్యాప్తంగా 142 మున్సిపాలిటీలున్నాయి. ఇందులో 70 మున్సిపాలిటీలకు మాస్టర్​ప్లాన్​అప్రూవ్​అయ్యింది. మరో 18 మున్సిపాలిటీల్లో డ్రాఫ్ట్ సర్వే, అప్రూవల్ తదితర ప్రిపరేషన్​ దశలో ఉన్నాయి. 54 కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలున్నాయి.  

ఏళ్లుగా జనాలకు అవస్థ

గ్రామీణ ప్రాంతాల నుంచి విద్య, వైద్యం, ఉపాధి కోసం వలసలు పెరుగుతుండడంతో పట్టణాలు విస్తరిస్తున్నాయి. గతంలో పంచాయతీలుగా కొనసాగిన ప్రాంతాలను సర్కార్​ కొత్తగా మున్సిపాలిటీలుగా మార్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2018 ఆగస్టులో  54 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి. పంచాయతీలు కొనసాగిన కాలంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికబద్ధంగా విస్తరించేందుకు అవసరమైన ఇండికేటివ్​ ల్యాండ్​యూజ్​ప్లాన్(ఐఎల్ యూపీ) అమలు చేయకపోవడంతో నిర్మాణాలు ఇష్టారీతిన  చేపట్టారు.

అడ్డదిడ్డమైన నిర్మాణాలు, ఇరుకైన రోడ్లతో ట్రాఫిక్​ అవస్థలు,  జనావాసాల మధ్య పరిశ్రమలు, వర్తక, వాణిజ్య సముదాయాలు, అస్తవ్యస్తంగా రోడ్లు, డ్రైనేజీలు, వాటర్​పైపులైన్లు, స్ట్రీట్​లైటింగ్​కారణంగా పట్టణాల సుందరీకరణ కష్టంగా మారింది. భవిష్యత్తులో జరిగే విస్తరణలకు అవసరమైన భూమి అందుబాటులో లేకుండా పోయింది. సింగరేణి ప్రాంతాల్లో ప్లానింగ్​లేకుండా ఇండ్ల నిర్మాణాలు జరిగాయి. ఇరుకైన రోడ్ల నుంచి కనీసం ఆటోలు, అంబులెన్స్​లు కూడా వెళ్లలేని విధంగా కాలనీలు తయారయ్యాయి.  పంచాయతీల్లో రియల్టర్లు ఎక్కడికక్కడ వెంచర్లు వేసి భూములు అమ్ముకున్నారు. భవిష్యత్​ అవసరాలకు భూములు లేకపోవడంతో  కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఇబ్బందులు తప్పడం లేదు. 

మాస్టర్​ప్లాన్.. సవరణలు

కొత్త మున్సిపాలిటీలకు మాస్టర్​ ప్లాన్ రూపొందించేందుకు  డైరెక్టర్​టౌన్​అండ్​కంట్రీ ప్లాన్​విభాగం చర్యలు చేపట్టింది. మూడు నెలల కిందట రాష్ట్రంలోని 54 కొత్త మున్సిపాలిటీల్లోని ప్రభుత్వ, సింగరేణి, ప్రైవేటు డిపార్ట్​మెంట్లకు సంబంధించిన భౌతిక రూపురేఖలు, విస్తీర్ణం తదితర కీలక  డాటాను  సేకరించారు. ఈ డాటాపై చర్చించేందుకు విడతలవారీగా డీఎంఏ మీటింగ్​లు నిర్వహిస్తోంది. ఈ నెల 26న రెండో విడతగా 18 మున్సిపాలిటీల రివ్యూ  మీటింగ్​ఏర్పాటు చేసింది. రివ్యూ తర్వాత సర్కార్​  మాస్టర్​ ప్లాన్​ డ్రాఫ్ట్​పనులను ఏజెన్సీ టీంకు అప్పగించే చాన్స్​ఉంది. పాత మున్సిపాలిటీల్లో  ఏళ్ల కిందటి మాస్టర్​ప్లాన్​ అమల్లో ఉంది. అయితే చాలా జోన్లలో రూల్స్​కు విరుద్ధంగా ఇండ్లు కట్టారు. ఇలాంటి ఇబ్బందులను దూరం చేసేందుకు సవరణపై మున్సిపల్​ శాఖ దృష్టి సారించింది.  

జీఐఎస్​ ఆధారంగా జోన్లుగా విభజన

పాత మున్సిపాలిటీల పరిధిలో ఉన్న మాస్టర్​ ప్లాన్లను భవిష్యత్​ తరాలకు ఉపయోగపడేలా కొన్ని మార్పులు చేయడం, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి పెరుగుతున్న జనాభాను అంచనా వేసి మాస్టర్​ప్లాన్​తో పాటు స్థానిక సంస్థకు జీఐఎస్(జియోగ్రాఫికల్​ ఇన్ఫర్మేషన్​ సిస్టమ్)​ ఆధారిత మ్యాప్​ను అందుబాటులోకి తీసుకవచ్చే సన్నాహాలు చేస్తున్నారు. ప్రజలకు మెరుగైన సౌలత్ లు కల్పించడంలో భాగంగా విశాలమైన రోడ్లు, పార్కింగ్, డ్రైనేజీ, ఇంటిగ్రేటెడ్​మార్కెట్, వైకుంఠధామాలు, డంపింగ్​యార్డులు, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల వంటి అవసరాలన్నీ తీర్చేలా ప్లాన్​ ఉండనుంది. జీఐఎస్ ఆధారిత మ్యాప్​రూపొందించడం వల్ల  పన్నుల వసూలు పారదర్శకంగా, అవినీతికి అస్కారం లేకుండా ఉంటుందని భావిస్తున్నారు. 

డాటా సేకరణ పూర్తయింది

కొత్తగా ఏర్పడిన రామకృష్ణాపూర్(క్యాతనపల్లి)​ మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్​ అమలు కోసం ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇప్పటికే ఆయా డిపార్ట్​మెంట్ల డాటాను సేకరించి డీఎంఏకు పంపించాం. ఈనెల 26న  రివ్యూ మీటింగ్​ కోసం రెడీగా ఉన్నాం. 

 - జి. వెంకటనారాయణ, రామకృష్ణాపూర్​ మున్సిపాలిటీ