బైక్‌‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి.. ఆసిఫాబాద్‌‌ జిల్లా కేంద్రం సమీపంలో ప్రమాదం

బైక్‌‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి.. ఆసిఫాబాద్‌‌ జిల్లా కేంద్రం సమీపంలో ప్రమాదం

ఆసిఫాబాద్, వెలుగు: బైక్‌‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఓ యువకుడితో పాటు అతడి అక్క, మేనల్లుడు చనిపోగా, మేనకోడలి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌ జిల్లా కేంద్రానికి సమీపంలోని మోతుగూడ హైవేపై ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... వాంకిడి మండలం బెండార గ్రామానికి చెందిన చెంద్రీ జగన్‌‌ (27) కాగజ్‌‌నగర్‌‌ మండలం వంజిరిలో ఉండే తన అక్క డోంగ్రే అనసూయ (32), కోడలు హారిక, అల్లుడు ప్రజ్ఞశీల్‌‌ (06)ను తీసుకొని బైక్‌‌పై బెండార గ్రామానికి వెళ్తున్నాడు. ఆసిఫాబాద్‌‌ మండలం మోతుగూడ సమీపంలోని ఫ్లైఓవర్‌‌ మీదకు రాగానే మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్‌‌ వైపు వస్తున్న కారు వేగంగా వచ్చి బైక్‌‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బైక్‌‌తో సహా నలుగురూ ఫ్లైఓవర్‌‌ పైనుంచి కింద రోడ్డుపై పడ్డారు. దీంతో జగన్‌‌, అనసూయ, ప్రజ్ఞశీల్‌‌ అక్కడికక్కడే చనిపోగా హారికకు తీవ్ర గాయాలు అయ్యాయి. 

గమనించిన స్థానికులు పోలీసులు సమచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని హారికను ఆసిఫాబాద్‌‌కు అక్కడి నుంచి మంచిర్యాలకు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న మృతుల కుటుంబసభ్యులు, బంధువులు భారీ సంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేసే వరకు డెడ్‌‌బాడీలను తీసేది లేదని హైవేపై ఆందోళనకు దిగారు. ఆసిఫాబాద్‌‌ సీఐ బాలాజీ వరప్రసాద్‌‌ చేరుకొని మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్‌‌బాబు పరిశీలించారు.