90 లక్షల ఓట్ల కోసం కేసీఆర్ అమలు చేయబోయే స్కీములివే..!

90 లక్షల ఓట్ల కోసం కేసీఆర్ అమలు చేయబోయే   స్కీములివే..!
  • పెండింగ్​ హామీలు, స్కీమ్​లపై రాష్ట్ర సర్కార్​ ఫోకస్​
  • ఎన్నికల షెడ్యూల్​ వచ్చేలోపు అందరికీ లబ్ధి చేకూరేలా ప్లాన్​
  • వివిధ వర్గాల డిమాండ్లకు వరుసపెట్టి గ్రీన్​సిగ్నల్​

హైదరాబాద్, వెలుగు : ఎన్నికల టైమ్ దగ్గరపడటంతో ఓటర్లను ఆకట్టుకునే ఎత్తుగడలకు అధికార పార్టీ తెరతీసింది. ఏండ్లకేండ్లు ప్రజలు నిలదీసినా పట్టించుకోని ప్రభుత్వం రెండు నెలలుగా పాత హామీలు, కొత్త స్కీములపై ఫోకస్​ పెట్టింది. ఎన్నికల షెడ్యూల్​ వచ్చేలోపు దాదాపు 30 లక్షల కుటుంబాలు టార్గెట్​గా స్కీములు, హామీల అమలుకు పూనుకున్నది.  ఇందులో ఒక్కో కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఓటర్ల చొప్పున లెక్కేసుకున్నా 60 లక్షల నుంచి 90 లక్షల ఓట్లు లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. 

నేరుగా కుటుంబాలకు లబ్ధి చేకూరుతుండటంతో ఆయా కుటుంబాల ఓట్లన్నీ గంపగుత్తగా తమకే పడుతాయని బీఆర్​ఎస్​ నేతలు నమ్ముతున్నారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్లు మొదలు.. భూముల అమ్మకం, లిక్కర్ షాపుల టెండర్ల ద్వారా భారీగా నిధులను సమీకరించుకుంది. పెండింగ్​లో పెట్టిన హామీలతో పాటు ఉద్యోగులు, వివిధ వర్గాల డిమాండ్లన్నింటికీ ఒక్కొక్కటిగా వరుసపెట్టి గ్రీన్​సిగ్నల్ ఇస్తున్నది.  

పోడు పట్టాలతో షురూ

రాష్ట్రంలో పెండింగ్ హామీల అమలును పోడు పట్టాల పంపిణీతో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా జులై నెలలో 4 లక్షల 903 ఎకరాల భూమిపై 1,55,393 మంది ఆదివాసీ, గిరిజనులకు పోడు పట్టాలు అందజేశారు. పోడు సమస్య ఎక్కువగా ఉన్న ఏజెన్సీ ఏరియాలో మొత్తం గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చుక్కెదురైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులే గెలిచారు. ఆ తర్వాత కూడా పోడు భూములకు పట్టాలివ్వాలని ఏజెన్సీ ఏరియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. 

దీంతో పోడు సమస్యను కుర్చీ వేసుకుని  పరిష్కరిస్తానని ప్రతి అసెంబ్లీ సమావేశంలో చెప్పిన సీఎం కేసీఆర్.. ఎట్టకేలకు ఈ ఏడాది జూలైలో లక్షన్నర మందికి పోడు పట్టాలు పంపిణీ చేశారు. దీంతో ఏజెన్సీ ఏరియాల వారిని తమ వైపు తిప్పుకోగలిగామని బీఆర్​ఎస్​ నేతలు చెప్తున్నారు.

పంచాయతీ సెక్రటరీల రెగ్యులరైజేషన్

నిబంధనల ప్రకారం తమ సర్వీస్​ పూర్తయినా రెగ్యులరైజ్​ చేయడం లేదంటూ చాలా రోజులు జూనియర్​ పంచాయతీ సెక్రటరీలు ఆందోళనలు చేశారు. ధర్నాలకు దిగారు. ఎట్టకేలకు 6 వేల మంది సర్వీసును రెగ్యులరైజ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సీఎం కేసీఆర్ జులైలో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆ కుటుంబాలు తమకే జైకొడ్తాయని బీఆర్​ఎస్​ నేతలు భావిస్తున్నారు.  

ప్రభుత్వంలోకి ఆర్టీసీ

బీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చాక 2019లో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యమని, భూగోళం ఉన్నంత వరకు జరిగే పని కాదని ప్రెస్ మీట్ లో అప్పట్లో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఆ సమ్మె కాలంలో ప్రభుత్వ అణచివేత విధానాలతో ఆర్టీసీ కార్మికులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో వారిని కోపాన్ని చల్లార్చేందుకు వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనున్నట్టు సర్కార్ ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు, 43, 373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మొన్నామధ్య కేబినెట్​లో కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి పాస్ చేసింది. ఆ ఉద్యోగులంతా తమనే ఆదరిస్తారని బీఆర్​ఎస్​ కేడర్​ అంచనా వేస్తున్నది.  

రైతులకు రుణమాఫీ

రూ. లక్షలోపు క్రాప్ లోన్ మాఫీని 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 డిసెంబర్ 11 నాటికి రాష్ట్రంలో రూ. లక్ష లోపు క్రాప్ లోన్ ఉన్న వారికి పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు. కానీ ఆ తర్వాత ఆ హామీని మరిచారు. విడతల వారీగా కొందరికి.. పెద్ద మొత్తంలో రైతులకు పెండింగ్​లో పెట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ నెల 15 నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు. రైతు రుణమాఫీ పథకంలో భాగంగా రూ. లక్ష లోపు (రూ.99,999) వరకు రుణాలను మాఫీ చేసింది. ఒక్కరోజే ఏకంగా 9,02,843 మంది రైతులకు రూ.5,809 కోట్ల రుణాలను మాఫీ చేసింది.  

దివ్యాంగులకు పింఛన్ రూ.వెయ్యి పెంపు     

రాష్ట్రంలోని దివ్యాంగులకు ఇప్పటి వరకు ఇచ్చిన పింఛన్ ను రూ. 3,016 నుంచి రూ.4,016కు పెంచుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా 5,11,600 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది. జులై నెల పెరిగిన పింఛన్ ను గత రెండు, మూడు రోజులుగా పంపిణీ చేస్తున్నారు. 

ఉద్యోగులకు పీఆర్సీ కమిటీ.. 

గవర్నమెంట్ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతభత్యాల సవరణకు త్వరలో  రెండో పే రివిజన్ కమిషన్ వేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2015లో బిశ్వాల్​ ఆధ్వర్యంలో పీఆర్సీని ఏర్పాటు అయింది. దాని తర్వాత పీఆర్సీ ఫిట్ మెంట్ ను 2021లో అమలు చేసింది. ప్రతి ఐదేండ్లకు ఒకసారి పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి దానికితగ్గట్టుగా ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కనుక రెండో పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. దీంతో మూడున్నర లక్షల మంది  ప్రభుత్వ ఉద్యోగులు, మరో లక్షన్నర మంది పెన్షనర్లపై ప్రభావం ఉంటుందని, వారి ఓట్లు తమకే వస్తాయని బీఆర్​ఎస్​ వర్గాలు భావిస్తున్నాయి.

వీఆర్ఏలకు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తానని, పే స్కేల్ వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ 2017, ఫిబ్రవరి 24న ప్రగతి భవన్ లో మొదటిసారిగా హామీ ఇచ్చారు.  తర్వాత 2020 సెప్టెంబర్​లో వీఆర్వో వ్యవస్థ రద్దు సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు మినిమం పే స్కేల్ వర్తింపజేస్తామని మరోసారి ప్రకటించారు. వృద్ధాప్యంలో ఉన్న వీఆర్ఎలు కోరుకుంటే వాళ్ల ఇంట్లో పిల్లలకు ఎవరికైనా వీఆర్ఏ ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. కానీ, ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దశలవారీగా ఆందోళనలు నిర్వహించిన వీఆర్ఏలు చివరికి నిరుడు జులై 25 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు.  80 రోజులపాటు సమ్మె కొనసాగింది. 

సెప్టెంబర్ 13న అసెంబ్లీ ముట్టడికి భారీగా వీఆర్ఏలు తరలిరావడం, మిలియన్ మార్చ్ తరహాలో ఆందోళనకు దిగడంతో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి చర్చించారు. మునుగోడు ఎన్నికల సమయంలో మరోసారి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు హామీ మేరకు  వీఆర్ఏలు సమ్మె విరమించి విధుల్లో చేరారు. ఇది జరిగి తొమ్మిది నెలల తర్వాత వీఆర్ఏలను ఎట్టకేలకు రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం తెలిపారు. మంత్రుల సబ్ కమిటీ సిఫారసుల మేరకు.. నిబంధనలను అనుసరించి వీఆర్ఏల అర్హతలను బట్టి మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ తదితర శాఖల్లో సర్దుబాటు చేశారు. దీంతో ఏడేండ్ల నిరీక్షణకు తెరపడింది. 20,400 వీఆర్ఏలకు లబ్ధి చేకూరింది.  

గృహలక్ష్మితో 3.57 లక్షల కుటుంబాలకు సాయం..  

డబుల్ బెడ్రూం ఇండ్ల స్కీమ్ ను పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయిన ప్రభుత్వం చివరికి సొంత జాగాలో ఇల్లు కట్టుకునేవారికి రూ.3 లక్షల సాయం అందిస్తామని ప్రకటించింది. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించినప్పటికీ.. స్కీమ్ ను అమల్లోకి తీసుకొచ్చేటప్పటికి రూ.3 లక్షలకు కుదించింది. నియోజకవర్గానికి 3 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 3,57,000 యూనిట్లను మంజూరు చేసింది. ఇటీవల దరఖాస్తులను స్వీకరించి లబ్ధిదారుల ఎంపికను చేపట్టింది. 

రూ. లక్ష సాయంతో బీసీలకు 

కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న 14 బీసీ కులాలకు రూ. లక్ష సాయం స్కీమ్​ను ప్రభుత్వం ప్రకటించింది.  రాష్ట్రవ్యాప్తంగా 5.20 లక్షల మంది అప్లై చేసుకోగా.. వారిలో 4.21లక్షల మంది అర్హులుగా ప్రభుత్వం తేల్చింది. ఒక్కో నియోజకవర్గంలో నెలకు 300 మంది చొప్పున లక్ష సాయం అందించాలని నిర్ణయించింది. ఇది నిరంతర ప్రక్రియ అని అందరికీ చెక్కులు అందిస్తామని తెలిపింది. 

డీఎస్సీ ప్రకటన.. 

రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల జాబ్స్​ కోసం ఎదురు చూస్తున్నవారు సుమారు 3.50 లక్షల మంది ఉన్నారు. టీచర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో  నేరుగా భర్తీ చేసేందుకు 6,612 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించింది. వాటిలో 5,089 పోస్టులు సాధారణ పాఠశాలల్లో, 1,523 పోస్టులు ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం భర్తీ చేయనున్నారు.

చేనేతలకు చేనేత మిత్ర

చేనేత మిత్ర పథకం కింద కార్మికులకు నూలు, రంగులు, రసాయనాలకు 50 శాతం ఇస్తున్న సబ్సిడీ సకాలంలో వారి అకౌంట్లలో జమకావటం లేదన్న విమర్శలు ఉన్నాయని.. దీంతో ఇకపై మగ్గం మీద పనిచేసే ప్రతి కార్మికునికి నెల నెలా రూ.3 వేలు వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని ఆగస్టు, సెప్టెంబర్‌‌ నుంచి అమలు చేస్తామని మంత్రి కేటీఆర్‌‌ తెలిపారు. దీంతో 32వేల మంది లబ్ధి పొందనున్నారు.