
- 4 కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు గెజిట్ రిలీజ్
- గణతంత్ర వేడుకల తర్వాత మున్సిపల్ పాలన?
- సంగారెడ్డి జిల్లాలో 12కు చేరిన మున్సిపాలిటీల సంఖ్య
సంగారెడ్డి, వెలుగు: జిల్లాలో నాలుగు మేజర్ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారాయి. అవసరమైన గెజిట్ ను ప్రభుత్వం ఇటీవల రిలీజ్ చేసింది. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 8 మున్సిపాలిటీలు ఉండగా కొత్తగా మరో 4 మున్సిపాలిటీల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధమైంది. మేజర్ గ్రామ పంచాయతీలుగా ఉన్న ఇస్నాపూర్, కోహిర్, గడ్డపోతారం, గుమ్మడిదలలో సమీప గ్రామాలను విలీనం చేసే రికార్డుల క్లియరెన్స్ పనుల్లో ఆఫీసర్లు బిజీగా ఉన్నారు. కొత్తగా పటాన్ చెరు నియోజకవర్గంలో 3, జహీరాబాద్ పరిధిలో ఒక మున్సిపాలిటీ ఏర్పాటు కానున్నాయి. 25 వేల జనాభా ఉన్న గ్రామ పంచాయితీని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలన్న నిబంధనల మేరకు ప్రభుత్వం జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్యను పెంచింది.
సంగారెడ్డి మున్సిపాలిటీ కార్పొరేషన్ గా మారబోతుందన్న ప్రచారానికి కాస్త బ్రేక్ పడింది . ప్రస్తుతానికి ఈ విషయం పెండింగ్ లో ఉన్నప్పటికీ రానున్న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో కార్పొరేషన్ గా మారుతుందా లేదా అనేది తేలిపోతుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
జీహెచ్ఎంసీలో ఇప్పటికే ఇక్కడి నుంచి పటాన్ చెరు, రామచంద్రపురం, భారతీ నగర్ మూడు డివిజన్ లు ఉండగా, తెల్లాపూర్, ఆమీన్పూర్, బొల్లారం 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఇస్నాపూర్, గడ్డపోతారం, గుమ్మడిదల మేజర్ పంచాయతీలు కొత్త మున్సిపాలిటీలుగా అవతరించాయి.
గుమ్మడిదల మునిసిపాలిటిలో గుమ్మడిదల, అన్నారం, బొంతపల్లి, దోమడుగు, వీరన్నగుడెం గ్రామాలు కలిశాయి. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఇస్నాపూర్, పాశమైలారం, చిట్కుల్ గ్రామాలు, గడ్డపోతారం మున్సిపాలిటీలో గడ్డపోతారం, వావిలాల , ఖాజీపల్లి, నల్తుర్ గ్రామాలను కలిపారు.
ALSO READ : సాగు యోగ్యం కాని భూముల లెక్కలు తేలినయ్
జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో జహీరాబాద్ మునిసిపాలిటీ ఉండగా.. కొత్తగా కోహిర్ మున్సిపాలిటీ యాడ్ అయింది. దీంతో జహీరాబాద్ సెగ్మెంట్లో మున్సిపాలిటీల సంఖ్య రెండుకు చేరింది.
ఈ నెల 26తో జిల్లాలోని పాత మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం పూర్తికానున్న నేపథ్యంలో 27వ తేదీ నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగనుంది. అప్పటి నుంచే కొత్త మున్సిపాలిటీలలో కూడా పూర్తిస్థాయిలో సేవలు అందనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.