సౌదీ బస్సు ప్రమాద మృతులకు.. రేపు (నవంబర్ 20) సామూహిక అంత్యక్రియలు

 సౌదీ బస్సు ప్రమాద మృతులకు.. రేపు (నవంబర్ 20) సామూహిక అంత్యక్రియలు
  • సౌదీ బస్సు ప్రమాద మృతులకు.. రేపు సామూహిక అంత్యక్రియలు
  •   సౌదీ బయలుదేరిన అధికారులు, మృతుల కుటుంబసభ్యులు

హైదరాబాద్, వెలుగు: సౌదీ అరేబియా బస్సు ప్రమాదం ఘటనలో మృతి చెందిన 45 మంది హైదరాబాద్ యాత్రికులకు అక్కడే సామూహిక అంత్యక్రియలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విదేశాంగ శాఖ సమన్వయంతో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం మంగళవారం రాత్రి సౌదీ అరేబియాకు బయలుదేరింది. 

నాంపల్లి హజ్ హౌస్ నుంచి మృతుల కుటుంబ సభ్యులు 35 మందితో పాటు హజ్ కమిటీకి చెందిన ముగ్గురు సభ్యులు కలిపి మొత్తం 38 మందితో కూడిన బృందం  విమానంలో బయలుదేరింది. ఈ బృందం.. డీఎన్‌‌‌‌ఏ నమూనాల సేకరణ, మృతదేహాల గుర్తింపు, డెత్ సర్టిఫికెట్లు జారీ, సామూహిక అంత్యక్రియల ప్రక్రియను పర్యవేక్షిస్తుంది.

గురువారం సామూహిక అంత్యక్రియలు

బస్సు ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో డీఎన్‌‌‌‌ఏ పరీక్షల ద్వారానే డెడ్ బాడీల గుర్తింపు సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. డీఎన్ఏ పరీక్షలకు కూడా ఆయా కుటుంబ సభ్యులకు సంబంధించిన  పత్రాలు తప్పనిసరన్నారు. డీఎన్‌‌‌‌ఏ సరిపోలిక అనంతరం డెత్ సర్టిఫికెట్లు జారీ చేసి గురువారం సామూహిక అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. మృతుల కుటుంబ సభ్యుల సమక్షంలోనే అన్ని మృతదేహాలకు ఒకేసారి అంత్యక్రియలు జరుపనున్నారు. 

కాగా..ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన హైదరాబాద్‌‌‌‌కు చెందిన షోయబ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. సౌదీ అధికారులు, భారత రాయబార కార్యాలయం అతని ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఈ ప్రమాదంలో అబుదాబిలో డ్రైవర్‌‌‌‌గా పనిచేస్తున్న కర్నాటక హుబ్లీకి చెందిన అబ్దుల్ ఘని షరహట్టి కూడా మృతి చెందాడు. గత 25 ఏండ్లుగా అబుదాబిలోని ఓ హోటల్ లో  డ్రైవర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు.