- ముగిసిన తాళసప్త, అఖండ హరినామ సప్త వేడుకలు
- వేలాదిగా తరలివచ్చిన భక్తులు
కుభీర్, వెలుగు: మరో పండరీపురంగా పేరుగాంచిన నిర్మల్జిల్లా కుభీర్లోని శ్రీ విఠలేశ్వర జాతర అత్యంత వైభవంగా జరిగింది. ఏడు రోజులుగా జరుగుతున్న అఖండ హరినామ సప్త, తాళ సప్తమి వేడుకలు మంగళవారం ఘనంగా ముగిశాయి. జాతరకు చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
సోమవారం రాత్రి మహారాష్ట్రలోని పలు గ్రామాలకు చెందిన భజన మండళ్లు, ముథోల్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన భజన మండళ్లు భజనలు చేస్తూ జాగారం చేశారు. మంగళవారం సూర్యోదయం కంటే ముందు ఆలయంలో కనులపండువగా నిర్వహించిన కాగడ హారతికి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పట్టువస్త్రాలతో అలంకరించిన విఠలరుక్ముయిల దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు చేసి ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు.
గ్రామంలోని ప్రతి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే జి.విఠల్ రెడ్డి దేవతా మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గోనె కల్యాణ్, ఆలయ కమిటీ చైర్మన్ పెంటాజీ, మున్నూరు కాపు, యాదవ సంఘం అధ్యక్షుడు చిమ్మన్ అరవింద్, కందూర్ దత్తాత్రి, పలువురు నాయకులు దర్శించుకున్నారు. ఎస్సై కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
