- తొలి విడతలో ఆర్టీసీకి 151 బస్సులు అద్దెకిచ్చిన మహిళా సంఘాలు
- ఒక్కో బస్సుకు నెలకు దాదాపు రూ.70 వేల ఆదాయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా స్వయం సహాయక సంఘాలకు బస్సులు అందించింది. తొలి దశలో 17 జిల్లాల్లోని 151 మండల మహిళా సమాఖ్యలకు 151 బస్సులు అందించింది. దీంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్).. టీజీ ఆర్టీసీతో ఒప్పందం చేసుకున్నది. మహిళా సంఘాలు కొనుగోలు చేసిన బస్సులను ఆర్టీసీ అద్దెకు తీసుకుంటుంది. ఒక్కో బస్సు ధర రూ.36 లక్షలు కాగా.. ఇందులో రూ.6 లక్షలను మహిళా సమాఖ్య తన వాటాగా చెల్లించింది.
మిగిలిన రూ.30 లక్షలను ప్రభుత్వం కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌గా ప్రభుత్వ గ్యారంటీతో రుణంగా అందించింది. ఈ బస్సులను అద్దెకు తీసుకున్నందుకు ఆర్టీసీ ప్రతినెలా ఒక్కో బస్సుకు రూ. 69,648 అద్దెను సంబంధిత మహిళా సమాఖ్యకు చెల్లిస్తోంది. ఇందులో రూ.19,648 బస్సు నిర్వహణ ఖర్చులకు పోగా.. మిగిలిన రూ. 50 వేలను రుణ వాయిదాగా చెల్లిస్తున్నారు. ఇప్పటికే ఐదు వాయిదాలను ఆర్టీసీ విడుదల చేయగా.. 151 మహిళా సమాఖ్యల ఖాతాల్లో రూ.5 కోట్లకు పైగా జమయ్యాయి. త్వరలోనే రెండో దశలో మరో 449 బస్సులను కొనుగోలు చేసేందుకు కసరత్తు చేస్తున్నది.
