వీ6 వెలుగుపై మరో బ్యాన్.. ప్రభుత్వ కార్యక్రమాలకూ నో ఎంట్రీ

వీ6 వెలుగుపై మరో బ్యాన్.. ప్రభుత్వ కార్యక్రమాలకూ నో ఎంట్రీ

వీ6 వెలుగుపై మరో బ్యాన్
ప్రభుత్వ కార్యక్రమాలకూ నో ఎంట్రీ
మొన్న సచివాలయం ఓపెనింగ్ కు..
నిన్న జూన్ 2న దశాబ్ది ఉత్సవాలకు..
ఇవాళ నిమ్స్ లో వీ6, వెలుగుకు ప్రవేశం లేదు
నిస్సహాయత వ్యక్తం చేస్తున్న అధికారులు

హైదరాబాద్ : వీ6, వెలుగుపై మరో బ్యాన్ విధించారు. మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాలకే నిషేధించిన బీఆర్ఎస్.. తాజాగా ప్రభుత్వ కార్యక్రమాలకూ అనుమతించడం లేదు. ఇవాళ నిమ్స్ కొత్త బ్లాక్స్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి వీ6, వెలుగు రిపోర్టర్లను రానివ్వలేదు. ఇది ప్రభుత్వం కార్యక్రమం కదా అని ఎంత మొత్తుకున్నా అధికారులు నిస్సహాయతను వ్యక్తం చేశారు. తామేమీ చేయలేమని పై నుంచి అలా ఆర్డర్స్ ఉన్నాయంటూ పెదవి విరిచారు.

ఏప్రిల్ 30 వ తేదీన సచివాయలయం ఓపెనింగ్ కు పాసులు జారీ చేస్తున్నామని, సంబంధిత రిపోర్టర్, ఫొటోగ్రాఫర్, కెమెరామెన్ పేర్లు ఇవ్వాలంటూ ఐ అండ్ పీఆర్ నుంచి ఆయా మీడియా కార్యాలయాలకు మెస్సేజ్ వచ్చింది. వీ6, వెలుగు నుంచి జాబితాను పంపారు. పాసులు కూడా రెడీ అయ్యాయి. కానీ ఇవ్వొద్దంటూ రౌండప్ చేశారు. ‘మీకు ఇవ్వొద్దని రౌండప్ చేయించారు.. మేమేమీ చేయలేం.. పై నుంచి ఆదేశాలు వచ్చాయి’అని పాసులు జారీ చేసే సిబ్బంది చెప్పారు.. ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో ప్రస్తావించగా వారు కూడా నిస్సహాయతను వ్యక్తం చేశారు.

జూన్ 2వ తేదీన ప్రభుత్వం అంగరంగ వైభవంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎంట్రీ పాసుల కోసం దరఖాస్తులు చేసుకోవాలంటూ ఎప్పటి లాగే ఐఅండ్ పీఆర్ నుంచి మీడియా హౌజ్ లకు మెస్సేజ్ లు వెళ్లాయి. మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. వెలుగు రిపోర్టర్ కు ఎంట్రీ పాస్ ఇవ్వలేదు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కదా అని ప్రశ్నించినా ఫాయిదా లేకుండా పోయింది. అధికారుల నుంచి అదే సమాధానం వచ్చింది. 

ఇవాళ నిమ్స్ అదనపు భవనాల నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి నిమ్స్ అధికారులు పాసులు జారీ చేశారు. జాబితా పంపాలని మీడియా హౌజ్ లకు మెస్సేజ్ లు వెళ్లాయి. ఎప్పటిలాగే వీ6, వెలుగు దరఖాస్తు చేసుకున్నది. అయితే ఇక్కడా సేమ్ సీన్.. రెడీ అయిన ఎంట్రీ పాసులు ఇవ్వకుండా ఐఅండ్ పీఆర్ అధికారులు నిలుపుదల చేయించడం గమనార్హం. 

ప్రజల మీడియా గొంతు నొక్కే ప్రయత్నం

తెలంగాణ గొంతుకగా, జనం గుండె చప్పుడుగా.. అశేషమైన ఆదరణ పొందిన వీ6, వెలుగు మీడియాపై బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. వీ6 చానల్, వెలుగు దినపత్రి, డిజిటల్ మీడియా ప్రజల హృదయాంతరాల్లో చెరగని ముద్ర వేశాయి. పల్లెల్లో ఎవరిని కదిలించినా తీన్మార్ వార్తల ప్రస్తావనే వస్తుంది. ప్రజా వ్యతిరేక విధానాలపై దుమ్మ దులిపే దమ్ము కేవలం వీ6, వెలుగుకే ఉన్నాయని తెలంగాణలో ఎవరినడిగినా చెబుతారు. జనం భాషలో సమస్యను విడమర్చి చెప్పే సత్తా కేవలం వీ6, వెలుగుకే ఉన్నాయంటారు. నిజాన్ని నిర్భయంగా చెప్పే చానల్, వెలుగు పేపర్ ను ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.