పోలీస్​స్టేషన్లకు గంజాయి టెస్ట్ కిట్లు.. గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్టింగ్

పోలీస్​స్టేషన్లకు గంజాయి టెస్ట్ కిట్లు.. గవర్నమెంట్ హాస్పిటల్లో  టెస్టింగ్
  • మునుగోడు సెగ్మెంట్​లోప్రయోగాత్మకంగా అమలు
  • యూరిన్ ద్వారా రెండు నిమిషాల్లోనే రిజల్ట్
  • గవర్నమెంట్ హాస్పిటల్స్​లో డాక్టర్ల పర్యవేక్షణలోనే టెస్టింగ్
  • రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా గాంజా పరీక్షలు

నల్గొండ, వెలుగు: మత్తుకు బానిసవుతున్న యువతను ప్రాథమిక దశలోనే గుర్తించి కాపాడేందుకు గంజాయి టెస్ట్ కిట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కల్తీ కల్లును నిర్ధారించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు తాడి అడల్ట్రేషన్ కిట్లు వాడుతుంటారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించేందుకు పోలీసులు బ్రీత్ అనలైజర్లను ఉపయోగిస్తుంటారు.

కానీ.. గంజాయి తీసుకున్న వాళ్లను గుర్తించడం సాధ్యం కావడం లేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు గంజాయి టెస్ట్ కిట్లను అందజేస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి వాడకం భారీగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నది. మునుగోడులో శనివారం పట్టుబడ్డ 35 మంది గంజాయి తాగేవాళ్లను పోలీసులు గుర్తించి టెస్ట్​ కిట్లతో పరీక్షించారు. అందరూ గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో గంజాయి సప్లై చేస్తున్న వారితో పాటు మరికొంత మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


కొన్నేండ్లుగా రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగింది. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకే పరిమితమైన మత్తు పదార్థాలు.. ఇప్పుడు పల్లెలకూ విస్తరించాయి. గంజాయి అయితే అన్ని గ్రామాల్లో ఈజీగా దొరుకుతున్నది. స్కూల్, కాలేజీలకు వెళ్లే స్టూడెంట్లు కూడా గంజాయికి బానిసలవుతున్నారు. మత్తులో నేరాలకు పాల్పడి భవిష్యత్తును జైలు పాలు చేసుకుంటున్నారు. దీంతో హైదరాబాద్​తో పాటు అన్ని జిల్లాల్లో క్రైమ్ రేటు పెరుగుతున్నది. ఆంధ్రా, ఒడిశా బార్డర్, విశాఖ ఏజెన్సీలో గుట్టుగా గంజాయి సాగవుతున్నది. అక్కడి నుంచి వివిధ మార్గాల్లో తెలంగాణలోని అన్ని మారుమూల ప్రాంతాలకు చేరుతున్నది. పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టీమ్​లు వాహన తనిఖీల ద్వారా గంజాయి, డ్రగ్స్ పట్టుకుంటున్నా.. యువత మత్తుకు బానిసలవుతున్నారు.

రూ.74.73 కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి సీజ్

మే నెలాఖరు వరకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో రూ.74.73 కోట్లు విలువ చేసే డ్రగ్స్, గంజాయిని సీజ్ చేశారు. 1,580 మందిని అరెస్ట్ చేసి.. 788 కేసులు నమోదు చేశారు. అయినా.. గంజాయి రవాణా, వాడకం ఆగడం లేదు. గంజాయి తీసుకునేవారిని పట్టుకుంటే తప్పా.. సప్లై చైన్​ను బ్రేక్ చేసే అవకాశం లేదు. గంజాయి తీసుకున్నవారిని పట్టుకున్నప్పుడు వాళ్లు అసలు గంజాయి తీసుకున్నారో.. లేదో తెలిసేది కాదు. లోకల్​గా టెస్టులు చేసే అవకాశం కూడా ఉండకపోయేది. దీంతో డ్రగ్స్ తీసుకున్నవారు ఈజీగా తప్పించుకునేటోళ్లు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్లకు గంజాయి టెస్టింగ్ కిట్లు సరఫరా చేయాలని కొన్నాళ్లుగా పోలీసులు ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కార్ స్పందించి.. అన్ని పోలీస్ స్టేషన్లకు కిట్లను సప్లై చేస్తున్నది.

గవర్నమెంట్ హాస్పిటల్స్​లో టెస్టింగ్

పోలీస్ స్టేషన్లకు చేరిన కిట్ల ద్వారా గంజాయి తీసుకున్న వారి నుంచి యూరిన్ శాంపిల్స్ సేకరిస్తారు. వాటిని దగ్గర్లోని ప్రభుత్వ హాస్పిటల్స్​కు తీసుకెళ్తారు. ల్యాబ్​లో టెస్ట్ చేస్తారు. కేవలం రెండు నిమిషాల్లోనే రిజల్ట్ వస్తుంది. పాజిటివ్ వస్తే గంజాయి వినియోగించినట్టు నిర్ధారిస్తారు. నిందితుల్లో మైనర్లు, స్టూడెంట్లు ఉంటే ఫస్ట్ టైమ్ ఎలాంటి కేసు పెట్టకుండా పేరెంట్స్ రప్పించి కౌన్సెలింగ్ ఇప్పించి పంపించేస్తారు. 18 ఏండ్లు దాటిన వాళ్ల యూరిన్ శాంపిళ్లను మరోసారి హైదరాబాద్​లోని ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపుతారు. అక్కడ కూడా పాజిటివ్ వస్తే చార్జ్​షీట్ ఫైల్ చేసి జైలుకు పంపిస్తారు.

మునుగోడులో ప్రయోగాత్మకంగా

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు, గుర్రంపోడు, చండూరు మండలాలకు చెందిన పలు గ్రామాల్లో పెద్ద సంఖ్యలో యువకులు గంజాయికి బానిసయ్యారు. హైదరాబాద్​లోని ధూల్​పేట నుంచి కొందరు.. మునుగోడుకు బైక్​ల మీద గంజాయి తెచ్చి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి తీసుకున్నట్లు అనుమానించి ఇటీవల కొందరిని అదుపులో తీసుకున్నారు. కానీ.. నిర్ధారించే అవకాశం లేకపోవడంతో నిందితులు తప్పించుకున్నారు. గంజాయిని కూడా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఎస్పీ శరత్ చంద్రపవార్.. మునుగోడు నియోజకవర్గం నుంచే గంజాయి టెస్ట్ కిట్ల స్పెషల్ డ్రైవ్​ను చేపడ్తున్నట్లు ప్రకటించారు.