
హైదరాబాద్, వెలుగు: కొత్త జిల్లాల్లో కొత్త పోస్టుల ఊసెత్తకుండా రాష్ట్ర సర్కార్ తెలివిగా తప్పించుకుంటోంది. జిల్లాల వారీ జనాభా ప్రాతిపదికనే ఉద్యోగుల విభజన చేపట్టేందుకు రెడీ అయింది. దీంతో ఉన్న ఉద్యోగులనే అటు, ఇటు సర్దుబాటు చేయనుంది. ఫలితంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగ ఖాళీలు పెరుగుతాయనుకున్న నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని చెప్పుకోవడం తప్పితే.. అక్కడ ఉద్యోగులు లేకుండా ప్రజలకు సౌకర్యాలు ఏ మేరకు అందుతాయని విమర్శలు వస్తున్నాయి.
విభజన ఇట్లుంటది!
ఏదైనా ఉమ్మడి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏ నుంచి జీ వరకు ఏడు సెక్షన్లకు ఏడుగురు ఆఫీసర్ పోస్టులు ఉంటే.. ఆ జిల్లా రెండుగా ఏర్పడితే జనాభా ఎక్కువ ఉన్న జిల్లాకు నాలుగు, తక్కువ ఉన్న ఇంకో జిల్లాకు మూడు పోస్టులు కేటాయిస్తారు. అంతే తప్ప రెండు జిల్లాలకు ఏడుగురు ఆఫీసర్లు ఉండరు. జిల్లాకు ఈ క్యాడర్ పోస్టుల సంఖ్య ఇంత అని ఒక లెక్క ఉండదు. ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్, రెవెన్యూ డివిజన్‌కు ఆర్డీఓ, మండలానికి ఎమ్మార్వో ఉన్నట్లు.. కింది స్థాయి ఉద్యోగులు ప్రతి జిల్లాలో ఒకే సంఖ్యలో ఉండరు. ఉన్న ఉద్యోగులను అడ్జస్ట్ చేసేందుకే జనాభా ప్రాతిపదికన విభజన చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నయి.
అప్పటి నుంచి సర్దుబాటే
రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాలు, 592 మండలాలు ఉన్నాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసినప్పుడు ఉమ్మడి జిల్లాలు, పాత మండల కేంద్రాల్లోని ఉద్యోగులనే కొత్త వాటిలోకి అడ్జస్ట్ చేశారు. అప్పుడు ఇబ్బందులు రావడంతో దాదాపు మూడు వేల పైన పోస్టులను ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసుకునేందుకు సర్కార్ అనుమతించింది. కొత్త జిల్లాల ప్రకారం జోనల్ వ్యవస్థలో మార్పులకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చాక కొత్తగా శాంక్షన్డ్ పోస్టులు మంజూరు చేస్తామని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు కొత్త పోస్టుల మంజూరును ప్రస్తావించకుండా, పాత వారితోనే సర్దుబాటు చేస్తోంది. కలెక్టరేట్ కార్యాలయాలతో పాటు జిల్లా స్థాయిలో పనిచేసే ఏ డిపార్ట్‌మెంట్‌లోనూ, మండల కేంద్రంలో ఉండే ఎంపీడీవో, ఎమ్మార్వో, మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఎక్కడా పూర్తి స్థాయిలో ఉద్యోగులు లేరు. ఆఫీసర్ల పోస్టులతోపాటు జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, రికార్డ్ అసిస్టెంట్ల కొరత వేధిస్తోంది.