పాలిటెక్నిక్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఫీజు రీయింబర్స్‌‌మెంట్ .. ఉత్తర్వులు జారీ చేసిన సాంఘిక సంక్షేమ శాఖ

పాలిటెక్నిక్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఫీజు రీయింబర్స్‌‌మెంట్ .. ఉత్తర్వులు జారీ చేసిన సాంఘిక సంక్షేమ శాఖ
  • పాలిసెట్‌‌లో వెయ్యివరకు ర్యాంకు పొందిన విద్యార్థులకు కూడా..
  • సర్కారు బడుల్లో చదివిన వారికీ ఫీజులు మినహాయింపు 
  • మొత్తం ఫీజులను చెల్లించనున్న ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: పాలిటెక్నిక్ కోర్సుల్లో పెరిగిన ఫీజుల నుంచి ఎస్సీ, ఎస్టీ,  మైనార్టీ స్టూడెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది.  పాలిసెట్‌‌లో ర్యాంకుతో సంబంధం లేకుండానే  ఈ వర్గాల​ స్టూడెంట్లకు  మొత్తం ఫీజు రీయింబర్స్‌‌మెంట్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ నడుస్తున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు కీలకంగా మారాయి. రాష్ట్రంలో 115 పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా, వాటిలో 28,996 సీట్లున్నాయి. 

వీటిలో 7,529 సీట్లు ప్రైవేట్​ కాలేజీల్లో ఉన్నాయి. అయితే, 2024 అక్టోబర్ లో టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేసింది. ప్రైవేటు కాలేజీల్లో 15 ఏండ్ల కింద నిర్ణయించిన రూ.14,900 ఫీజును రూ.39 వేల వరకు పెంచింది. అయితే, అప్పటికే అడ్మిషన్లు అయిపోవడంతో, ఈ విద్యాసంవత్సరం నుంచి  అమలు చేయనున్నారు.  దీంట్లో అందరికీ ఒకే ఫీజు ఉండొద్దనే భావనతో, దీనిలో మార్పులు చేస్తూ సర్కారు తాజాగా ఉత్తర్వులిచ్చింది.

 దీనికి అనుగుణంగా పాలిసెట్ ర్యాంకుతో సంబంధం లేకుండా  ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ను సర్కారు అందించనున్నది. సర్కారు స్కూళ్లు, గురుకులాలు, నవోదయ తదితర గవర్నమెంట్ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులకూ మొత్తం ఫీజులు ఇవ్వనున్నది. పాలిసెట్‌‌లో వెయ్యి వరకూ ర్యాంకు సాధించిన విద్యార్థులందరికీ మొత్తం రీయింబర్స్ మెంట్ అందిస్తారు.  మిగిలిన వారికి రూ.14,900 ఫీజు లేదా కాలేజీలో నిర్ణయించిన ఫీజు ఏది తక్కువగా ఉంటే అది చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో వేలాది మంది విద్యార్థులకు సర్కారు ఆర్థికంగా చేయూతనందించినట్టు అయింది.