చబ్బీస్ జనవరి వస్తున్నా.. పంద్రాగస్టు పైసలు ఇయ్యట్లే

చబ్బీస్ జనవరి వస్తున్నా.. పంద్రాగస్టు పైసలు ఇయ్యట్లే
  • రూ.4.92 కోట్ల విడుదలకు  ఉత్తర్వులు ఇచ్చినా పైసా ఇవ్వని సర్కార్ 
  • వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: స్వతంత్ర భారత వజ్రోత్సవాల కోసం స్కూళ్లకు ప్రభుత్వం నిధులు శాంక్షన్  చేసినా.. ఇప్పటి వరకు ఏ స్కూల్​కూ పైసా ఇవ్వలేదు. పంద్రాగస్టుకు ఇచ్చిన ఆదేశాలు.. చబ్బీస్ జనవరి వస్తున్నా అమలు కాలేదు. దీంతో అప్పుడు తమ సొంత డబ్బులు ఖర్చు చేసిన హెడ్మాస్టర్లు, టీచర్లు ఆ ఫండ్స్​ వస్తాయో, లేదో అనే ఆందోళనలో ఉన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ పేరుతో దేశవ్యాప్తంగా సంబురాలు నిర్వహించగా.. తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాల పేరుతో ఉత్సవాలు నిర్వహించింది. దీంట్లో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో గతేడాది ఆగస్టు 8 నుంచి 22 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. ఆటలు, దేశభక్తి గీతాలు, వ్యాసరచన, పెయింటింగ్, ముగ్గులు తదితర పోటీలు నిర్వహించాలని సర్కారు ఆదేశించింది. స్కూల్ లెవెల్ తో పాటు మండల, జిల్లా స్థాయిల్లో కాంపిటీషన్లు పెట్టాలని కోరింది. ఈ కార్యక్రమాలకు రూ.4.92 కోట్లు శాంక్షన్ చేస్తున్నట్టు ఆగస్టు11న రాష్ట్ర సర్కారు ప్రకటించింది. ఇందులో 19,654 ప్రైమరీ స్కూళ్లకు వెయ్యి చొప్పున, 10,101 అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లకు (కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, ఇతర వెల్ఫేర్ స్కూల్స్​కూడా) రూ.1,500 చొప్పున అందిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. మండలస్థాయి పోటీలకు ఒక్కో మండలానికి రూ.15 వేలు, ఒక్కో జిల్లాకు రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నట్టు చెప్పింది. అయితే, ఆ ఉత్తర్వులు వచ్చి ఐదునెలల అవుతున్నా ఇప్పటికీ ఏ ఒక్క స్కూల్​ఖాతాలో కూడా ఆ నిధులు జమ కాలేదు. 

ఆ నిధులు ఇస్తరా.. ఇయ్యరా? 

సర్కారు చెప్పిన కార్యక్రమాలన్నీ ఘనంగా నిర్వహిస్తే పెద్ద స్కూళ్లలో కనీసం రూ.20 వేలు దాటుతుంది. కానీ ప్రభుత్వం కేవలం రూ.వెయ్యి, 1,500 మాత్రమే ఇస్తామని ప్రకటించింది. అయినా ఆయా బడుల్లో, మండలాల్లో స్థాయికి తగ్గట్టు కార్యక్రమాలను నిర్వహించి, జయప్రదం చేశారు.  సర్కారు నిధులు ఇస్తుందనే ఆశతో చాలా మంది హెడ్మాస్టర్లు, ఎంఈవోలు  తమ సొంత ఖర్చులతో వేడుకలు నిర్వహించారు. అయితే, శాంక్షన్ చేసిన డబ్బులను 2022–23 బడ్జెట్ నుంచి ఇస్తామని ప్రకటించినా, ఇప్పటికీ నిధులు రాలేదు. అయితే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సర్కారుకు ప్రపోజల్ పంపించినా, ఫైనాన్స్ ఆఫీసర్లు ఒకే చేయలేదని తెలుస్తోంది. అయితే ఆ నిధుల కోసం స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులు అడగడమూ మరిచిపోయారని హెడ్మాస్టర్లు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, వెంటనే వజ్రోత్సవాల నిధులు రిలీజ్ చేయాలని కోరుతున్నారు.