
- ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ శాంతికుమారి, ఆర్థిక, జీఏడీ శాఖల ముఖ్య కార్యదర్శులు, పే రివిజన్ కమిషనర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
- 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సర్కార్ ఆదేశం
- ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, వర్సిటీలు, లోకల్‌బాడీస్ తదితర చోట్ల 8 లక్షల మంది ఉద్యోగులు
- కొన్ని చోట్ల అవసరానికి మించి సిబ్బంది.. మరికొన్ని చోట్లనేమో ఖాళీలు
- ప్రాధాన్యత, అవసరాలు, ఆర్థిక క్రమశిక్షణ, వ్యయ నియంత్రణ లక్ష్యంగా ప్రక్షాళన
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణకు సర్కార్ కసరత్తు ప్రారంభించింది. వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, యూనివర్సిటీలు, లోకల్ బాడీలు, పీఎస్‌యూలలోని సిబ్బంది పనితీరు, ఖాళీలు, అవసరాలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి మానవ వనరుల కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ శాంతి కుమారి (రిటైర్డ్ ఐఏఎస్), పే రివిజన్ కమిషనర్ ఎన్.శివశంకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జీఏడీ సెక్రటరీ ఎం.రఘునందన్ రావు ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ, వ్యయ నియంత్రణతో పాటు ప్రభుత్వ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించడమే లక్ష్యంగా సర్కార్ ఈ ప్రక్షాళనకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, పీఎస్‌యూలు, లోకల్ బాడీలు, యూనివర్సిటీలు, సంస్థలలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది, మంజూరైన పోస్టులు, ఖాళీలు, అవసరాలకు మించి ఉన్న పోస్టులు, అవసరం లేని పోస్టులు, మార్పులు చేర్పుల అవశ్యకతపై కమిటీ సమగ్ర అధ్యయనం చేస్తుంది. అలాగే, తాత్కాలిక సేవలు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వివరాలపై కూడా అధ్యయనం చేసి సర్కారుకు 60 రోజుల్లో నివేదిక అందజేస్తుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
8 లక్షలకు పైగా ఉద్యోగులు..
ప్రస్తుతం ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 8 లక్షలకు పైగా ఉంది. ఇందులో ప్రభుత్వ శాఖల్లో 3లక్షల 25వేల 982 మంది పనిచేస్తుండగా, గ్రాంట్స్- ఇన్ -ఎయిడ్ , యూనివర్సిటీల్లో మరో 36,094 మంది పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, డైలీ వేజ్, ఎన్ఎంఆర్ పద్ధతిలో పనిచేస్తున్నవాళ్లు లక్షా 83వేల 583 మంది వరకు ఉన్నారు. గౌరవ వేతనం (ఆనరోరియమ్) ప్రాతిపదికన మరో 2లక్షల 41వేల 68 మంది పని చేస్తున్నారు. ఇందులో అవసరం లేని పోస్టులు ఏకంగా 26వేల 711 దాకా ఉన్నట్లు ప్రాథమిక అంచనా.
దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మానవ వనరుల కమిటీ.. ఏయే శాఖల్లో అవసరానికి మించిఉద్యోగులు ఉన్నారు? ఏయే శాఖల్లో తక్కువ ఉన్నారు? అనే విషయంలో లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి రెండు నెలల్లో నివేదిక ఇస్తుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా అవసరం లేని చోట ఉన్న ఉద్యోగులను అవసరం ఉన్న చోటుకు తరలించడమా? లేదంటే ఆయా చోట్ల రెగ్యులర్ఉద్యోగులను సర్దుబాటు చేసి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ఉద్యోగులను ఇంటికి పంపడమా? అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు చెప్పారు.
అవసరం లేని పోస్టులను రద్దు చేయడం ద్వారా ఖజానాపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడం కూడా ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోందని ఆయన వెల్లడించారు. మొత్తమ్మీద ప్రభుత్వంలో, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాస్తవ అవసరాలకు అనుగుణంగా మాత్రమే పోస్టుల సంఖ్యను నిర్ణయించి సిబ్బందిని పునర్వ్యవస్థీకరణ చేయనున్నట్లు తెలిసింది. కొన్ని విభాగాల్లో అవసరానికి మించి ఉన్న సిబ్బందిని ఇతర అత్యవసరమైన చోట్లకు బదిలీ చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించే వీలుంటుందని భావిస్తున్నారు. మారుతున్న ప్రభుత్వ పాలన అవసరాలకు అనుగుణంగా ఉద్యోగాల స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు.
ఒక్క క్లిక్‌తో ఉద్యోగుల సమగ్ర సమాచారం..
ప్రభుత్వ శాఖల్లో హెచ్‌వోడీ ఆఫీసుల్లో వివిధ విభాగాలు మొదలుకొని జిల్లాలు, మండల కేంద్రాలు , గ్రామస్థాయిలోనూ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వివిధ ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్నవాళ్లు వీరికి అదనం. ప్రస్తుతం వీరి సమాచారం డిపార్ట్‌మెంట్ల వారీగా, జిల్లాల వారీగా, మండలాల వారీగా.. ఇలా గందరగోళంగా ఉంది. నోటిఫికేషన్ల కోసం ఖాళీల లెక్కలు తీయాలంటే రోజులు, నెలలు పడ్తోంది. ఇకపై ఈ పరిస్థితి ఉండదు. ప్రస్తుతం శాంతికుమారి కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా వీళ్లందరి డేటాను శాఖలు, విభాగాల వారీగా ఆన్లైన్చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
రిటైర్మెంట్ కాగానే ఆ ఉద్యోగుల వివరాలను తొలగించడం, కొత్త రిక్రూట్మెంట్ల ద్వారా వచ్చే ఉద్యోగులను ఎంట్రీ చేయడం వెను వెంటనే జరగనున్నాయి. దీంతో సీఎస్ స్థాయిలో ఒక్క క్లిక్తో ఆయా శాఖల్లో ఉద్యోగుల సమగ్ర సమాచారం తెలుసుకునే వీలు కలుగుతుంది. శాఖల వారీగా ఏ ఉద్యోగి పనితీరు ఎలా ఉంది ? ఏయే ప్రాంతాల్లో, ఎంత కాలం పనిచేశారు ? ఎలాంటి రివార్డులు, రిమార్కులు ఉన్నాయి ? చేసిన తప్పులు, వచ్చిన చార్జ్‌మెమోలు.. ఇలా సమగ్ర వివరాలు అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తులో ఆయా ఉద్యోగుల ప్రమోషన్లకూ ఇది ప్రోగ్రెస్ రిపోర్టులా ఉపయోగపడ్తుందని ఉన్నతాధికారులు చెప్తున్నారు.