రాష్ట్రంలో రిటైర్డ్ పాలన

రాష్ట్రంలో రిటైర్డ్ పాలన
  • సలహాదారులు, కన్సల్టెంట్లుగా మాజీలు
  • సెక్రటేరియెట్​లో, పలు శాఖల్లో వారిదే హవా
  • 4 జిల్లాల్లో ఎక్స్​టెన్షన్​పై ఉన్న రిటైర్డ్ జేసీలు
  • సమర్థులైన ఐఏఎస్​లకు మామూలు పోస్టులు
  • ప్రమోషన్లు కోల్పోయి రిటైరవుతున్న సీనియర్లు
  • వేతనాలు, అలవెన్సులు, గన్ మెన్​కు కోట్లల్లో ఖర్చు

హైదరాబాద్ , వెలుగు: ప్రభుత్వాల పాలనలో అధికారులు కీలకంగా ఉంటారు. సర్కారు నిర్ణయాలకు ఒక రూపం ఇచ్చేది, వాటిని అమలు చేయాల్సింది వాళ్లే. అయితే రాష్ట్ర సర్కారులో మాత్రం అందరూ రిటైర్డ్  అధికారులే కీలకంగా మారిపోయారు. పలు ప్రభుత్వ శాఖల్లో వందలాది మంది రిటైరైన అధికారులను సర్కారు తీసుకుంది. కొందరికి సలహాదారులుగా, మరికొందరికి కన్సల్టెంట్ల పేర్లతో పెద్ద హోదాలతో పదవులిచ్చింది. దీంతో శాఖలను ముందుండి నడిపించాల్సిన సీనియర్ అధికారులపైన కొత్త బాసుల్ని పెట్టినట్టైంది. వాళ్లకు భారీ వేతనాలతో పాటు అలవెన్సులు, వెహికల్స్, గనమన్ పేరుతో ప్రతినెలా కోట్లల్లో ఖర్చుచేస్తోంది. పలు శాఖల ముఖ్య కార్యదర్శులను డామినేట్ చేస్తూ ఇప్పుడు సలహాదారులే నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీరికి సీఎంవో అండదండలు, ప్రగతిభవన్ నుంచి సహాయ సహకారాలు ఉండడంతో ఏం మాట్లాడలేని పరిస్థితిలో పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.

మాజీ సలహాలు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా మాజీ సీఎస్ రాజీవ్ శర్మ కొనసాగుతున్నారు. డీజీపీగా రిటైరైన అనురాగ్ శర్మ హోంశాఖ సలహాదారుగా, ఐఏఎస్ అధికారులు శివశంకర్ కన్సల్టెంట్ గా, రమణాచారి సాంస్కృతిక శాఖ సలహాదారుగా, తేజావత్ రామచంద్రునాయక్ ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఇంకా ఏకే గోయల్, ఏకే ఖాన్, రాంలక్ష్మణ్, పాపారావు సహా దాదాపు 21 మంది రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 అధికారులు వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు. సలహాదారులు, కన్సల్టెంట్లను తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి పెద్దగా ఉపయోగం లేకపోయినా శాఖల్లో ఉన్నతాధికారులపై బాసిజం పెరిగిందనే విమర్శలున్నాయి. మరోవైపు వారి సలహాలకే సర్కారు ప్రాధాన్యం ఇస్తుండడంతో బాధ్యతగా పనిచేసే ఐఏఎస్​, ఐపీఎస్​లు ఇబ్బంది పడుతున్నారు. నిజానికి ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత చాలామంది సమర్థులైన అధికారులు తెలంగాణలో పనిచేయడానికే ఆసక్తి చూపించారు. అయితే సిన్సియర్ గా పనిచేసే కొందరు ఐఏఎస్ లు, ఐపీఎస్ లకు ప్రాధాన్యం లేని పోస్టులు ఇవ్వడం, కొందరిని లూప్ లైన్లో ఉంచడం, వివక్ష చూపిస్తున్నారన్న విమర్శలు రావడానికి కారణం సీ బ్లాక్ లో చక్రం తిప్పే సలహాదారే అన్న చర్చ అధికారుల్లో జరుగుతోంది. కొద్దిరోజుల కిందే ఆర్కైవ్స్ విభాగం డైరెక్టర్ ఆకునూరి మురళి వీఆర్ఎస్ కు అప్లై చేయడం ఉన్నతాధికారుల పరిస్థితికి ఉదాహరణగా నిలిచింది. ఏం పనిలేని శాఖలో, ఐఏఎస్ అవసరం లేని చోట తనను వేశారని మురళి చెప్పారు. ఆయన వీఆర్ఎస్ కు అప్లై చేశాక పేస్కేల్ మారుస్తూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. మురళి కంటే ముందు ఐపీఎస్ అధికారి వీకే సింగ్ కూడా గళం విప్పారు. తనను నియమించిన ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగంలో ఏం పని లేకుండా కోట్లు వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఐఏఎస్ మురళి కలెక్టర్ గా మంచి పేరు తెచ్చుకుంటే, వీకే సింగ్ జైళ్ల డీజీగా ఆ విభాగంలో సంస్కరణలతో కొత్త రూపు తెచ్చారు.

మూడు శాఖల్లో మరీ ఎక్కువ

సర్కారులో కీలకంగా ఉన్న విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు భవనాల శాఖలో పూర్తిగా రిటైర్డ్ అధికారుల హవానే కొనసాగుతోంది. విద్యుత్ శాఖలో అకౌంట్స్ ఆఫీసర్ గా రిటైరయిన ప్రభాకర్ రావును ప్రభుత్వం ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా నియమించింది. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలుగా ఉన్న రఘుమారెడ్డి, గోపాల్ రావు ఇద్దరూ రిటైరయినా పదవీకాలాన్ని పెంచుతూ వస్తున్నారు. ఈ రెండు డిస్కంలలో 9 మంది రిటైరయిన అధికారులను సర్కారు డైరెక్టర్లుగా నియమించింది. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇవ్వాలన్న ఆలోచనను అమలు చేయడానికి అనుభవం కలిగిన అధికారుల సేవలు అవసరమనీ, అందుకే రిటైర్డ్ అధికారుల సేవలను ఉపయోగించుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టుల కోసం పలువురు ఈఎన్సీల పదవీకాలాన్ని పొడిగించింది. లిఫ్ట్ ఇరిగేషన్ లో అనుభవం ఉన్న పెంటారెడ్డిని దీనికి సలహాదారుగా నియమించింది. ఇంకా రిటైరయిన పలువురు సీఈలను కన్సల్టెంట్లుగా తీసుకుంది. మిషన్ భగీరథలో నలుగురు ఉన్నతాధికారులను కన్సల్టెంట్లుగా నియమించింది. ఆర్ అండ్ బీలో కూడా ఈఎన్సీల పదవీకాలాన్ని సర్కారు పెంచింది. జాతీయ రహదారుల విభాగం ఈఎన్సీగా ఉన్న గణపతిరెడ్డికి, రాష్ట్ర రహదారుల ఈఎన్సీ రవీందర్ రావుకు ఎక్స్ టెన్షన్ ఇచ్చింది. ఎమ్మెల్యే క్వార్టర్స్, క్యాంపు ఆఫీసులు, కలెక్టరేట్ల నిర్మాణాలు, జాతీయ రహదారులు, రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుల్లో గణపతిరెడ్డి కీలకంగా ఉంటున్నారు. సెక్రటేరియట్, అసెంబ్లీ తరలింపుపై ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ కన్వీనర్ కూడా ఆయనే. కొత్త అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాలు అయ్యే వరకు ఈ ఇద్దరు ఈఎన్సీల సేవలను సర్కారు ఉపయోగించుకునే అవకాశం ఉంది.

నాలుగు జిల్లాల్లో రిటైర్డ్​ జేసీలు

కీలకమైన రెవెన్యూ విభాగంలో అవినీతి పెరిగిపోయిందని, భూ వివాదాలు ఎక్కువయ్యాయని సర్కారు చెబుతోంది. దీంతో రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా సంస్కరిస్తామని స్వయంగా సీఎం కేసీఆర్​ పలుమార్లు ప్రకటించారు. అయితే ఇదే విభాగంలో కొత్త అధికారులను కూడా నియమించలేని పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచో పాతుకుపోయిన అధికారులనే కొనసాగించడం, రిటైరయిన అధికారుల పదవీకాలం పొడిగిస్తూ ఆదేశాలివ్వడం వివాదం రేపింది. ఇప్పటికీ మంచిర్యాల, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, పెద్దపల్లి జిల్లాల్లో రిటైరయిన జేసీలే ఎక్స్​టెన్షన్​పై కొనసాగుతున్నారు.

ఆగుతున్న ప్రమోషన్లు

వివిధ శాఖల్లో మాజీల పెత్తనంపై ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పనిచేసినా గుర్తింపు ఉండటం లేదని, కొత్త చట్టాల తయారీ, సవరణలు, కీలక జీవోల తయారీ మొత్తం సలహాదారులు, ఓఎస్‌డీలే చేస్తున్నారనీ, తమ సంతకాల కోసం వచ్చేవరకు వాటిలో ఏముందో తెలియట్లేదని ఆవేదన చెందుతున్నారు. అన్నీ వారికి చెప్పి చేయాల్సి వస్తోందని, లేకపోతే తమపై సీఎంవోకు ఫిర్యాదులు వెళుతున్నాయని ఓ అధికారి చెప్పారు. కొన్ని శాఖల్లో మాజీల పోస్టులు ఎక్కువైపోవడంతో ఇప్పుడున్నవారికి ప్రమోషన్లు ఆగిపోతున్నాయన్న విమర్శలూ ఉన్నాయి. దీంతో అర్హత ఉండి కూడా ప్రమోషన్ లేకుండానే కొందరు రిటైర్ అయిపోతున్నారు.

500 మందిపైనే… కోట్లల్లో ఖర్చు

రాష్ట్ర వ్యాప్తంగా రిటైరై ఎక్స్ టెన్షన్ లో ఉన్నవాళ్లు, కన్సల్టెంట్లుగా నియమించినవాళ్లు 500 మంది వరకు ఉన్నట్లు అంచనా. వీళ్లే కాకుండా అన్ని శాఖలు, కమిషనరేట్లు, హెచ్.ఓ.డి. కార్యాలయాలు, జిల్లాల్లో చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారులు, కన్సల్టెంట్లుకు లక్షల రూపాయల వేతనాలు, గన్ మెన్లు, రూ.40 లక్షలు విలువైన టొయోటా ఫార్చునర్ కార్లు, రూ.30 లక్షల విలువైన టొయోటా క్రిస్టా కార్లు, ఇతర అలవెన్సులు, సౌకర్యాలు, సెక్రటేరియట్ లో చాంబర్లు, మోడర్న్ ఫర్నిచర్, ఫోన్ బిల్లులు, మెడికల్ ఖర్చులు అందిస్తున్నారు. పలువురు సలహాదారులకు కేబినేట్ హోదా కూడా ఉంది. కొంత మంది సలహాదారులకు ముఖ్య కార్యదర్శుల కంటే విలువైన వాహనాలను సర్కారు అందించింది.

మిషన్ భగీరథ కన్సల్టెంట్లు: నందారావు, మనోహార్ బాబు, సురేశ్ కుమార్, జగన్

ఎన్పీడీసీఎల్ , ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు: బి.వెంకటేశ్వరరావు, పి.గణపతి, డి.నర్సింగరావు, జి.నర్సింగరావు, శ్రీనివాస్ రెడ్డి, టి.శ్రీనివాస్, జగత్ రెడ్డి, సూర్యప్రకాశ్, వెంకటరాజం

వైద్య ఆరోగ్య శాఖ: గోపాల్ రెడ్డి, పారామెడికల్ బోర్డు కార్యదర్శి, పుట్ట శ్రీనివాస్, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ డైరెక్టర్, కె.మనోహర్, నిమ్స్ డైరెక్టర్, తమిళ్ అరసి, సిద్దిపేట మెడికల్ కాలేజ్ డైరెక్టర్, జీకే రావు, ఎన్ హెచ్ ఎం ఆర్థిక సలహాదారు

అటవీ శాఖ: శంకరన్, వన్యపాణి నిపుణులు, ఓఎస్డీ, తిరుపతయ్య, ఫారెస్ట్ అకాడమి కన్సల్టెంట్

రవాణా శాఖ: గంగాధర్, రీజినల్ మేనేజర్ గా రిటైర్డ్, విజయవాడ బస్టాండ్లో కన్సల్టెంట్

రిటైరయి సలహాదారులుగా ఉన్నవాళ్లు: రాజీవ్ శర్మ– ప్రభుత్వ ముఖ్య సలహాదారు, అనురాగ్ శర్మ- – హోంశాఖ సలహాదారు, కేవీ రమణాచారి– సాంస్కృతి శాఖ సలహాదారు, జీఆర్ రెడ్డి– ఆర్థిక శాఖ సలహాదారు, తేజావత్ రాంచంద్రునాయక్– ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రాంమోహన్ రావు– ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీ, శివశంకర్– ఆర్థిక శాఖ సలహాదారు, పాపారావు– రవాణా శాఖ సలహాదారు, ఏకే ఖాన్– మైనారిటీ శాఖ సలహాదారు, ఏకే గోయల్– ప్రణాళిక, ఆర్థిక శాఖ సలహాదారు, రామ్ లక్ష్మణ్– సంక్షేమ శాఖ సలహాదారు, ఆర్పీ సింగ్– విద్యుత్ శాఖ సలహాదారు, ప్రభాకర్ రావు– ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ, మురళీధర్ రావు– ఈఎన్సీ, నీటిపారుదల శాఖ, గణపతిరెడ్డి– ఈఎన్సీ, నేషనల్ హైవేస్, ఆర్ అండ్ బీ, రవీందర్ రావు– ఈఎన్సీ, రాష్ట్ర రహదారులు, ఆర్ అండ్ బీ, పెంటారెడ్డి– లిఫ్ట్ ఇరిగేషన్ సలహాదారు, రఘుమారెడ్డి– ఎస్పీడీసీఎల్ సీఎండీ, గోపాల్ రావు– ఎన్పీడీసీఎల్ సీఎండీ, ముత్యంరెడ్డి– సిద్దిపేట ఆర్డీవో, రామారావు– డిప్యూటీ కమిషనర్, పంచాయతీ రాజ్ శాఖ