
- ఇసుక, మట్టిని వేరు చేసే సంస్థలపై రాష్ట్ర సర్కారు దృష్టి
- ఇసుకను అమ్ముకుని.. ప్రభుత్వానికి చార్జీలు చెల్లించేలా ప్లాన్
- మార్కెట్ రేటుకు అనుగుణంగా సంస్థకు చార్జీలు విధించే అవకాశం
- మట్టిని రైతులకు ఫ్రీగా ఇచ్చి పొలాలను సారవంతం చేసే యోచనలో సర్కారు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో పూడికతీత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా లబ్ధి పొందడంతో పాటు ప్రాజెక్టులను పునరుద్ధరించే మార్గాలపై అన్వేషిస్తున్నది. అందుకున్న అవకాశాలపై సమాలోచనలు జరుపుతున్నది. ప్రాజెక్టుల్లోని పూడిక, ఇసుకను వేరు చేసేలా ప్రైవేటు ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించి.. ఆదాయాన్ని పొందాలని భావిస్తున్నది.
తద్వారా ప్రాజెక్టుల పూడికతీతకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వానికే ఆదాయం తెచ్చిపెట్టొచ్చన్న యోచనలో ఉన్నది. ఇందులో భాగంగా పాలసీ ఫ్రేమ్‌వర్క్‌పై అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. గోదావరి, కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో ఇప్పటికే చాలా వరకు పూడిక పేరుకుపోయింది. దీంతో వాటి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. గతంలోనే పూడికతీతపై చర్చలు జరిగినా.. ఆర్థికంగా భారమని తేలింది. దీంతో అది పట్టాలెక్కలేదు. పైగా ప్రభుత్వం వద్ద పూడికతీసే టెక్నాలజీ కూడా లేదు. ఈ క్రమంలోనే ప్రైవేటు ఏజెన్సీలపై సర్కారు దృష్టి సారించింది.
పలు రాష్ట్రాల్లో అధ్యయనం
పూడికతీతకు సంబంధించి ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం చేసినట్టు తెలిసింది. ఆయా రాష్ట్రాల్లో ప్రైవేటు సంస్థలకు పూడికతీత బాధ్యతను అప్పగించడం ద్వారా కలిగిన లబ్ధిపై నివేదిక తయారు చేసినట్టు సమాచారం. ఓ ప్రాజెక్టులో ఒక క్యూబిక్ మీటర్ పూడిక తీయాలంటే లక్షల్లో ఖర్చవుతుందని అధికార వర్గాలంటున్నాయి. ప్రభుత్వం దగ్గర డ్రెడ్జింగ్చేసే టెక్నాలజీ కూడా లేదు. దీంతో పూడికను ఆదాయవనరుగా మార్చే ప్రైవేటు ఏజెన్సీలపై దృష్టి సారించిందని తెలుస్తున్నది.
పూడిక ఇసుకను వేరు చేసి.. ఇసుకను ఆదాయవనరుగా మార్చుకోవడంపై అధికారులు ప్రభుత్వానికి వివరించినట్టు తెలిసింది. వేరు చేసిన ఇసుకను ప్రైవేటు ఏజెన్సీలు అమ్ముకుని.. ప్రభుత్వానికి మార్కెట్ రేటు ప్రకారం రాయల్టీని చెల్లించే అంశాన్ని వివరించినట్టు సమాచారం. తద్వారా ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ప్రాజెక్టుల్లో పూడికను తీసినట్టువుతుందని భావిస్తున్నట్టు తెలిసింది. పూడిక తీస్తే ఆ పూడికను స్టోర్ చేసేందుకు దాదాపు వంద ఎకరాల వరకు స్థలం అవసరమవుతుందని, అంత స్థలం ఇరిగేషన్ శాఖ వద్ద లేదని తెలిసింది. దీంతో ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగిస్తే ఇదంతా కలసి వస్తుందని భావిస్తున్నారు.
పూడిక మట్టి పొలాలకు
ఇసుకను వేరు చేయగా మిగిలిన పూడిక మన్నును కేకుల్లాగా తయారు చేసి రైతులకు ఇచ్చే యోచనపైనా సమాలోచనలు సాగుతున్నాయి. పొలాల్లో ఇప్పటికే సారం తగ్గిపోతున్న నేపథ్యంలో.. సారవంతమైన ఈ పూడికను రైతులకిస్తే దిగుబడులు కూడా పెరుగుతాయన్న ఆలోచనను ప్రభుత్వం చేస్తున్నది. రైతులకు ఫ్రీగా ఇస్తే వారికీ మేలు చేసినట్టవుతుందని భావిస్తున్నారు. దాంతో పాటు ఇటుక బట్టీల వ్యాపారులకూ పూడిక మన్ను కేకులను అమ్మి ఆదాయం సమకూర్చుకోవాలని యోచిస్తున్నది. ఈ పూడికతీత బాధ్యతను టెండర్ల ద్వారా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని సర్కార్ భావిస్తున్నది.
భిన్నాభిప్రాయాలు
పూడికతీతపై ఇరిగేషన్ సర్కిల్స్‌లోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గోదావరి బేసిన్లో ఎస్సారెస్పీ మినహా చిన్న ప్రాజెక్టుల్లో పూడికతీత సులువుగానే అయిపోతుందని అధికారులు అంటున్నారు. వాటర్ ఫ్లోయింగ్ కండీషన్లోనే పూడికను తీయొచ్చని పేర్కొంటున్నారు. సాగర్, శ్రీశైలంలోనే పెద్ద సమస్య అవుతుందని అధికారులు చెబుతున్నారు. అంత పెద్ద ప్రాజెక్టుల్లో పూడిక తీయాలంటే ఏడాదిపాటు పంటలకు నీళ్లివ్వకుండా ఆపాల్సి వస్తుందన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాజెక్టుల పూడికతీత సాధ్యమవుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందులోనూ ఆ రెండూ ఉమ్మడి ప్రాజెక్టులు కాబట్టి ఇటు ఏపీతోనూ చర్చలు జరపాల్సి ఉంటుందని చెప్తున్నారు. అవి కేఆర్ఎంబీ అధీనంలో ఉన్నాయి కాబట్టి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్, బోర్డు పర్మిషన్లు తప్పనిసరని అంటున్నారు.
గోదావరిలోనే ఎక్కువ
కృష్ణా బేసిన్‌తో పోలిస్తే గోదావరి బేసిన్లోనే పూడిక సమస్య తీవ్రంగా ఉందని అధికారులు చెప్తున్నారు. గోదావరికి సీజన్ ప్రారంభం నుంచే వరద వస్తుంటుందని, దాంట్లో మట్టి కూడా ఎక్కువుండడం, ఎగువన ప్రాజెక్టులు కూడా ఎక్కువ లేకపోవ డంతో మన రాష్ట్రంలోని ప్రాజెక్టులకు పూడిక సమస్య ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవు తున్నది. కృష్ణా నదితో పోలిస్తే గోదావరి నది నీళ్ల టర్బిడిటీ (మట్టి ఇతర మినరల్స్ కలిసి నీళ్లు మందంగా అనిపించడం) ఎక్కువగా ఉంటుందని అధికార వర్గాలంటున్నాయి.