సెర్చ్ కమిటీల కోసం కసరత్తు .. యూనివర్సిటీ నామినీ కోసం ఈసీ సమావేశాలు 

సెర్చ్ కమిటీల కోసం కసరత్తు .. యూనివర్సిటీ నామినీ కోసం ఈసీ సమావేశాలు 
  • ఫైన్​ఆర్ట్స్ మినహా అన్ని వర్సిటీల నుంచి ప్రతిపాదనలు
  • యూజీసీ ప్రతినిధుల పేర్లు ఇవ్వాలని విద్యాశాఖ లేఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు వర్సిటీలకు కొత్త వీసీల రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించగా, తాజాగా సెర్చ్ కమిటీల నియామకంపై కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం ఆ కమిటీల్లో మెంబర్ల ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టింది. విద్యాశాఖ పరిధిలో 12 వర్సిటీలు ఉండగా, వాటిలో పది యూనివర్సిటీల్లో కొత్త వీసీల నియామకానికి ప్రభుత్వం గతనెలాఖరులో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

గత నెల 28 నుంచి ఈ నెల12 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఉస్మానియా, కాకతీయ, తెలుగు యూనివర్సిటీ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, జేఎన్ఏఎఫ్​ఏయూ, మహాత్మాగాంధీ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, జేఎన్టీయూహెచ్​ తదితర వర్సిటీల వీసీల కోసం ఇప్పటికే సుమారు వంద వరకు దరఖాస్తులు వచ్చాయి. ఆయా వర్సిటీల వీసీల పదవీకాలం మే నెలలో ముగుస్తుండగా, సర్కారు ముందుగానే నియామక ప్రక్రియ ప్రారంభించింది. 

సెర్చ్ కమిటీల నియామకం

వీసీల నియామకానికి సెర్చ్ కమిటీలు కీలకమైనవి. ప్రతి వర్సిటీకి ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీలను నియమిస్తారు. ఇందులో సర్కారు నామినీ, యూజీసీ నామినీ, వర్సిటీ నామినీలను మెంబర్లుగా పెడతారు. ఇప్పటికే నామినీ ప్రతినిధులను ఇవ్వాలని ప్రభుత్వం యూజీసీ చైర్మ న్​కు లేఖ రాసింది. యూనివర్సిటీ నామినీని వర్సి టీ ఈసీ ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో హ య్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్​లో సోమ, మంగళ రెం డు రోజుల పాటు ఓయూ, కేయూ, జేఎన్టీయూ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తదితర వర్సిటీ ఈసీ సమావేశాలు జరిగాయి.

బుధవారం సచి వాలయంలో తెలుగు, తెలంగాణ వర్సిటీల ఈసీ సమావేశాలు నిర్వహించారు. యూనివర్సిటీల నుంచి నామినీలను ఎంపిక చేసి, పేర్లను సర్కారుకు పం పించారు. మిగిలిన జేఎన్​ఏఎఫ్ఏయూ ఈసీ సమా వేశం ఈనెల 9న నిర్వహించనున్నారు. కాగా, సర్కారు నుంచి నామినీగా విద్యాశాఖ సెక్రటరీ సహా మరో ఇద్దరిని నియమించే అవకాశాలున్నాయి.