
- వివిధ శాఖలు, కార్పొరేషన్లలో 1,200 మంది ఉన్నట్టు గుర్తింపు
- ఇప్పటికే మున్సిపల్ శాఖ నుంచి 177 మందిని తీసేస్తూ ఉత్తర్వులు
- తాజాగా పంచాయతీరాజ్‌లో 47 మంది తొలగింపు
- ఏడాది కిందే సమాచార సేకరణ.. ఎట్టకేలకు నిర్ణయం
- ఖజానాకు ఆదాతో పాటు డేటా లీక్ ఆగుతుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగ విరమణ చేసిన తరువాత కూడా ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో రీ అపాయింట్‌మెంట్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్పద్ధతుల్లో కొనసాగుతున్న వారికి రాష్ట్ర సర్కార్ఉద్వాసన పలుకుతోంది. ఇప్పటికే మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్విభాగంలో 177 మందిని ఇంటికి పంపగా.. తాజాగా పంచాయతీరాజ్ శాఖలో 47 మందిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలఖారులోగా అన్ని శాఖల్లో రిటైర్డ్అయిన ఉద్యోగులను ఇంటికి పంపించాలని సీఎస్ శాంతి కుమారి ఈ నెల 25వ తేదీనే ఆదేశాలు ఇచ్చారు.
దానికి అనుగుణంగా ఒక్కో శాఖ నుంచి లిస్ట్ రెడీ చేసి అలాంటి ఉద్యోగులను పోస్టుల్లో నుంచి తీసేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు ఇస్తున్నారు. సెక్రటేరియెట్‌తో పాటు అన్ని శాఖలు, ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్లు, ఏజెన్సీల్లో ఈ చర్యలు అమలు కానున్నాయి. రిటైర్డ్ఐఏఎస్లు, ఐపీఎస్‌లు, గ్రూప్1, చీఫ్ ఇంజనీర్హోదాలో ఉన్నా సరే వారికి ఇవే ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాస్తవానికి గతేడాది జనవరిలోనే ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఇతర పద్ధతుల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల జాబితాను అన్ని శాఖల నుంచి తెప్పించుకుంది. దాదాపు 1,100 మంది అలా పనిచేస్తున్నట్లు సీఎస్‌కు నివేదిక చేరింది. ఇప్పుడు ఈ సంఖ్య ఇంకో వందకు పెరిగి ఉంటుందని సెక్రటేరియెట్ వర్గాలు వెల్లడించాయి.
కీలకమైన సమాచారం లీకవుతుండడంతోనే..
గత జనవరిలో సీఎం దావోస్పర్యటనలో ఉన్న టైంలోనే ఈ జాబితా రెడీ అయింది. సీఎం ఆ పర్యటన నుంచి రాగానే విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని చర్చ జరిగింది. అయితే, ఉన్నతాధికారులు సీఎంకు ఈ విషయం తెలియనీయకపోవడంతో ఆగిపోయినట్లు తెలిసింది. ప్రభుత్వంలోని కీలకమైన సమాచారం విపక్షాలకు ముందే లీకవుతుండడం, ముఖ్యమైన ఫైళ్లు సైతం ప్రతిపక్ష లీడర్లకు చేరుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ వ్యవహారంలో రిటైర్డ్ అయి.. వివిధ హోదాల్లో ప్రభుత్వంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతుల్లో కొనసాగుతున్న వారే ఉన్నట్లు తేల్చింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్‌కు వివిధ రకాల బెనిఫిట్స్‌ను అందించేందుకు ఆర్థిక శాఖ నానా తిప్పలు పడుతోంది.ఈ క్రమంలో రిటైర్డ్ అయి ప్రభుత్వంలో కొనసాగుతున్న ఉద్యోగులకు ప్రతినెలా వందల కోట్లు చెల్లించే బదులు.. వారిని తొలగించి అదే సొమ్మును పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించేందుకు వినియోగించాలని నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ అంచనా ప్రకారం, ఈ రిటైర్డ్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, రీ-అపాయింట్‌మెంట్ ఎంప్లాయీస్‌తో ఖజానాపై ఏడాదికి కనీసం రూ.1500 కోట్ల భారం పడుతోంది. ప్రతి నెలా రూ.150 కోట్లు జీత భత్యాలతో పాటు వారి నిర్వహణ ఖర్చులు, కార్లు, డ్రైవర్లు, ఆఫీస్ సౌకర్యాల కోసం వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ అధికారులకు మినహాయింపు !
రిటైర్అయి పనిచేస్తున్న ఉద్యోగులలో కొందరిని తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొందరిని నియమించింది. వారి కోసమే.. మళ్లీ ఎవరినైనా కొనసాగించాలని అనుకుంటే కచ్చితంగా కొత్త ఆర్డర్ తీసుకోవాలని ఉత్తర్వుల్లో సీఎస్ స్పష్టం చేశారు. దీంతో ముఖ్యమైన వారిని కొనసాగించేలా మళ్లీ జీఓలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో గనుల శాఖ ఎండీ సుశీల్ కుమార్, మెట్రో రైల్‌ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, మూసీ రివర్ ఫ్రంట్, వాటర్ బోర్డ్ లో సత్యనారాయణ, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు, టీడబ్య్లూఈఐడీసీ ఎండీ గణపతి రెడ్డి లాంటి వాళ్లతో పాటు మంత్రుల దగ్గర పీఎస్‌లు, పీఏలు కూడా ఉన్నారు. వీరికి మళ్లీ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు చర్చ జరుగుతోంది. గతేడాదిలో ఇరిగేషన్ శాఖలో మురళీధర్ రావు, వెంకటేశ్వర్లు రిటైర్డ్ అయినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వారిని విధుల్లో కొనసాగించింది. అయితే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం మురళీధర్ రావును రాజీనామా చేయాలని కోరింది. దీంతో ఆయన రాజీనామా చేశారు. మరో ఉన్నతాధికారి వెంకటేశ్వర్లును ప్రభుత్వం తొలగించింది.