ఫండ్స్​రిలీజ్, లబ్ధిదారుల సంఖ్యలో భారీగా తగ్గింపు

ఫండ్స్​రిలీజ్, లబ్ధిదారుల సంఖ్యలో భారీగా తగ్గింపు
  • దళితబంధులో 47 వేల మందికి మొండిచేయి
  • పోడు భూమి 11 లక్షల ఎకరాల నుంచి 7.1 లక్షల ఎకరాలకు తగ్గింపుః
  • కాంట్రాక్ట్ ఎంప్లాయీస్​లో 6500 మందికే రెగ్యులరైజ్
  • ‘గృహలక్ష్మి’ స్కీంను ఏం చేస్తరోనని అర్హుల్లో బుగులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ బడ్జెట్ హామీలు, స్కీంలపై ప్రకటనల్లో గొప్పగా చెబుతూ.. అమలులోకి వచ్చేసరికి మాత్రం ఫండ్స్​రిలీజ్, లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నది. దీంతో ఆయా స్కీంల అర్హులు ఎంతో మందికి తీవ్ర నిరాశ ఎదురవుతున్నది. ఏవో ఒకటి, రెండు స్కీముల్లో కాకుండా దాదాపు ప్రతిదాంట్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పటికే ఒక ఏడాది మొత్తం దళితబంధు స్కీం అమలు చేయకుండా రాష్ట్ర సర్కార్ ఎత్తేసింది. గృహలక్ష్మి స్కీంను కూడా సంవత్సరం పాటు ఏ నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టేసింది. పోడు పట్టాల విషయంలోనూ అర్హుల సంఖ్యను భారీగా తగ్గించింది. ఇక ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ కావడంతో అన్ని స్కీంను ఎంతో కొంత అమలు చేయాలనే ధోరణి కనిపిస్తున్నది. అందులో భాగంగా దళితబంధు స్కీంకు బడ్జెట్​లో చెప్పినట్లు కాకుండా.. లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టింది. బీసీ, ఎంబీసీలకు కూడా వివిధ కార్పొరేషన్ల కింద ఇచ్చే సబ్సిడీ లోన్ల విషయంలోనూ బడ్జెట్​ను తగ్గించింది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ కూడా పూర్తి స్థాయిలో చేయలేదు.

దళిత బంధు వేలాది మందికి కట్​

దళితబంధు పథకం విషయంలో రాష్ట్ర సర్కార్ 47,200 మంది లబ్ధిదారులుకు మొండిచేయి చూపెట్టింది. 2023–-24 సంవత్సరంలో అమలుకు సంబంధించి రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారుల చొప్పున దళిత బంధు పథకాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది. కొత్త సెక్రటేరియెట్ ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ సంతకం చేసిన ఫైల్​లో అది కూడా ఒకటి. వాస్తవానికి నియోజకవర్గానికి 1500 మంది చొప్పున అమలు చేస్తామని.. ఇందుకోసం బడ్జెట్​లో రూ.17,700 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్​లో ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు ఆ సంఖ్యను కాస్త 1100కు కుదించింది. దీంతో ప్రతి నియోజకవర్గంలో 400 మంది చొప్పున దళితులు ఈ స్కీంకు సారి దూరం కానున్నారు. నిరుడు హుజూరాబాద్ మినహా ప్రతి నియోజకవర్గంలో 1500 కుటుంబాలకు దళిత బంధు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఒక్కరికి కూడా స్కీం వర్తింపజేయలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసిపోవడంతో ఫండ్స్ కూడా కొలాప్స్ అయ్యాయి. ఈ లెక్కన గత ఏడాది, ఈసారి కలిపి 3 వేల మందికి ఇవ్వాల్సి ఉంది. అయితే అలా కాకుండా కేవలం 1100 మందికే ఇస్తామని ప్రకటించింది.

రెగ్యులరైజ్​ కొందరికే..

కాంట్రాక్టు ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేస్తామన్న సర్కారు మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది. 11 వేల మందిని రెగ్యులరైజ్ చేయనున్నట్లు నిరుడు మార్చిలో ప్రకటించింది. అర్హుల వివరాలను చూస్తే ఈ సంఖ్య 15 వేలు దాటుతోంది. ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు 6500 మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేసింది. ఇంటర్​లో మొత్తం 3,600 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉండగా, వారిలో 2909 మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేశారు. డిగ్రీలో 820 మంది వరకూ ఉండగా, కేవలం 270 మందిని క్రమబద్దీకరించారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో 640 మందికి పైగా ఉండగా, వారిలో 390 మందిని రెగ్యులరైజ్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మిగిలిన వారిని ఏం చేస్తారనే దానిపై సర్కారు స్పష్టత ఇవ్వలేదు. 

పోడు పట్టాల్లోనూ 7.1 లక్షల ఎకరాలకు కోత

పోడు భూములకు సంబంధించి11.50 లక్షల ఎకరాలకు పట్టాలిస్తామన్న సీఎం కేసీఆర్​ అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల్లో ఆన్ రికార్డ్ ప్రకటించారు. మే నెల నుంచి జిల్లాలవారిగా పోడు పట్టాల పంపిణీ చేపడుతామని ప్రకటించిన కేసీఆర్.. కేవలం 1 లక్షా 35 వేల మంది లబ్ధిదారులనే ఫైనల్ చేశారు. వీరికి 3.9 లక్షల ఎకరాలకు సంబంధించి పోడు పట్టాలు అందజేస్తామన్నారు. దీంతో దాదాపు 7.1 లక్షల ఎకరాలకు కోత పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. రెండు నెలల వ్యవధిలోనే ఏ ప్రాతిపదికన సంఖ్యను తగ్గిస్తుందని అర్హులు ప్రశ్నిస్తున్నారు. పోడు పట్టాల కోసం 2021 నవంబర్​లోనే అప్లికేషన్లు తీసుకున్నారు. దానిని కూడా నాన్చుతూ నాన్చుతూ ఎన్నికల ఏడాది కావడంతో ఇప్పుడు పట్టాల పంపిణీకి వచ్చారు.

‘గృహలక్ష్మి’ ఏం చేస్తరో

సొంత జాగా ఉన్న పేదలకు ఇండ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందించే విషయంలోనూ ప్రభుత్వం ఏం చేస్తదోననే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోయిన ఏడాది రాష్ట్రంలో 4 లక్షల మందికి ఈ స్కీంను వర్తింపజేయాలని నిర్ణయించారు. ఈసారి కూడా అంతే స్థాయిలో అనుకున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 3 వేల మందికి రూ.3 లక్షలు చొప్పున మొత్తం 40 వేల మందికి ఆర్థిక సాయం అందజేయడం ఈ స్కీం లక్ష్యం. అప్పుడు ఈ పథకం బడ్జెట్ రూ.12 వేల కోట్లు ఉండగా.. ఈసారి కూడా అంతే మొత్తం కేటాయించారు. అయితే పోయిన సారి ఈ స్కీంను ఒక్కరికి కూడా వర్తింపజేయలేదు. ఈ ఆర్థిక సంవత్సరం కలుపుకొని మొత్తం 6 వేల మందికి అందాల్సిన ఈ పథకాన్ని.. మూడువేల మందికి మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించారు. ఇది కూడా లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తారనే ప్రచారం జరుగుతోంది.