
ఉపరాష్ట్ర పతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం (జులై 21) తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలిపారు. జగదీప్ ధన్కడ్ 2022 జులై 16 న ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
రైతు కుటుంబంలో పుట్టి..
1951 మే 18న రాజస్థాన్‌లోని కితానా అనే మారుమూల గ్రామానికి చెందిన సాధారణ రైతు కుటుంబంలో జగదీప్ జన్మించారు. చిత్తోడ్ ఘఢ్ సైనిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించిన ఆయన.. జైపూర్ రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జనతాదళ్ తరపు నుంచి 9వ లోక్‌సభ ఎన్నికల్లో ఝుంఝును స్థానం నుంచి జగదీప్ ధన్కర్ ఎంపీగా విజయం సాధించారు. 1993లో కిషన్ ఘడ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2003లో ఆయన బీజేపీలో చేరారు. 2019లో కేంద్రం జగదీప్ ను బెంగాల్ గవర్నర్ గా నియమించింది.
సుప్రీంకోర్టు లాయర్
జగదీప్ ధన్కర్ రాజస్థాన్ హైకోర్టు బార్ అసోషియేషన్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహించారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో మెంబర్‌గా వ్యవహరించారు. కొన్నాళ్ల పాటు సుప్రీం కోర్టులోనూ పని చేశారు.