
హైదరాబాద్: నా గుండెల్లో నా అభిమానులు తప్ప వేరు ఎవరూ లేరని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూలై 24న ప్రపంచవ్యా్ప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం (జూలై 21) హైదరాబాద్ శిల్పకళా వేదికలో హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అభిమానులు లేకపోతే నేను లేనని అన్నారు. జీవితంలో అవరోధాలు ఎదురైన ప్రతిసారి వాళ్లు అండగా నిలబడ్డారని భావోద్వేగానికి గురయ్యారు. జీవితంలో కింద పడిపోయిన ప్రతీసారి నన్ను పైకి లేపారని.. నా గుండెల్లో వాళ్లు తప్ప వేరు ఎవరూ లేరని అభిమానులను ఆకానికెత్తాడు పవన్ కల్యాణ్.
తాను ఎప్పుడూ రికార్డుల కోసం పని చేయనని.. అభిమానులకు సంతోషం పంచడమే తనకు ఇష్టమని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. యాక్టర్ కావాలని ఎప్పుడూ కోరకోలేదని.. సగటు మనిషిగా బతుకుదామనే ఆలోచన నాదన్నారు. హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ షో, సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
కాగా, పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ షో, మూవీ టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. జూలై 23 రాత్రి ప్రీమియర్ షోకు పర్మిషన్ ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600గా నిర్ణయించారు మూవీ యూనిట్. అలాగే.. టికెట్ రేట్ల పెంపునకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో టికెట్ ధర గరిష్టంగా రూ.150.. మల్టీప్లెక్స్‌ల్లో హాయొస్ట్ రూ. 200 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వీలు కల్పించింది. జూలై 24 నుంచి 27 వరకు సింగిల్ స్ర్కీన్లలో రూ.150, మల్టీప్లెక్స్‌ల్లో రూ.200 ధర పెంచి టికెట్లు విక్రయించుకునేందుకు అనుమతి ఇచ్చింది. జూలై 28 నుంచి ఆగస్ట్ 2 వరకు సింగిల్ స్ర్కీన్లలో రూ.106, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 టికెట్ ధర పెంపునకు వీలు కల్పించింది. టికెట్ రేట్లకు జీఎస్టీ అదనమని జీవోలో స్పష్టం చేసింది ప్రభుత్వం.