చట్టం లేదు.. జీవో లేదు! ప్రైవేటు స్కూళ్లలో ఫీజులపై చేతులెత్తేసిన సర్కార్

చట్టం లేదు.. జీవో లేదు!  ప్రైవేటు స్కూళ్లలో ఫీజులపై చేతులెత్తేసిన సర్కార్

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై రాష్ట్ర సర్కారు చేతులెత్తేసింది. ఫీజులపై చట్టం చేస్తామని కేబినేట్ లో నిర్ణయం తీసుకున్నా.. ఇప్పుడా ఊసే లేదు. ఏడాదిన్నర క్రితం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ పేరుతో హడావుడి చేసిన ప్రభుత్వం, ఫీజుల నియంత్రణపై కనీసం జీవో కూడా రిలీజ్ చేయలేదు. కేవలం మెమో ఇచ్చి చేతులు దులుపుకున్నది. 

ఫీజుల నియంత్రణపై 2014 నుంచి  టీఆర్ఎస్ ఆశలు పెడుతూ వచ్చింది. అనేక ఆందోళనల నేపథ్యంలో 2017లో ఓయూ మాజీ వీసీ తిరుపతిరావు నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్టు కూడా ఇచ్చింది. కానీ, ఆ రిపోర్టును, సిఫారసులను సర్కారు  పక్కన పెట్టేసింది. ఈ క్రమంలోనే ఏడాదిన్నర క్రితం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హరీశ్​రావు,  కేటీఆర్​తో సహా 11 మంత్రులతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. స్కూల్, ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని అప్పట్లోనే కేబినేట్  నిర్ణయించింది. కానీ మినిస్టర్స్ కమిటీ  ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

పాత విషయాలతోనే  మెమో

గతంలోనే ఫీజుల నియంత్రణపై హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టులో కేసు వేసింది. ఈ కేసు నుంచి తప్పించుకు నేందుకు మూడ్రోజుల  క్రితం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఓ మెమో జారీచేశారు. దీనిపై హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని హెచ్ఎస్పీఏ ప్రెసిడెంట్ సాయినాథ్ తెలిపారు. 

సిబ్బంది జీతాలకే 50శాతం ఖర్చు చేయాలి

స్టూడెంట్ల నుంచి వచ్చిన మొత్తం ఫీజుల్లో 50 శాతం సిబ్బంది జీతాలకు చెల్లించాలి. స్టూడెంట్ల నుంచి వసూలు చేసిన ఫీజు, అయిన ఖర్చు వివరాలను స్కూల్ వెబ్ సైట్లో పెట్టాలని ఉత్తర్వుల్లో తెలిపారు..

కమిటీలో మెజార్టీ సభ్యులు స్కూల్ నుంచే..

ప్రతి స్కూల్​లో గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేయాలని, దాని ద్వారానే ఫీజులను నిర్ణయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కమిటీలో స్కూల్ చైర్మన్, సెక్రటరీ, ప్రిన్సిపల్, టీచింగ్ స్టాఫ్, పేరెంట్స్ టీచర్స్ కమిటీ ప్రెసిడెంట్, డీఈఓ నామినేట్ చేసే ఒక మదర్ సభ్యులుగా ఉంటారు. అయితే, ఈ కమిటీలో మెజార్టీ సభ్యులు స్కూల్ నుంచే ఉన్నారు.