హైకోర్టు చెప్పినా వినట్లే..కరోనా టెస్టులపై సర్కారు పంతం

హైకోర్టు చెప్పినా వినట్లే..కరోనా టెస్టులపై సర్కారు పంతం
  • హైకోర్టే మళ్లీ మళ్లీ నిలదీస్తున్న పరిస్థితి
  • అయినా సర్కారులో స్పందన కరువు
  • సుప్రీంకోర్టు దాకా వెళ్లేందుకూ రెడీ
  • ఇదేమిటని అడిగినోళ్లపై ఉల్టా విమర్శలు
  • వరుసగా పిల్స్​ వేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం

హైదరాబాద్, వెలుగుకరోనా టెస్టులపై రాష్ట్ర సర్కారు మొండికేస్తోంది. హైకోర్టు ఎన్నిసార్లు ఆదేశాలు ఇచ్చినా అడ్డంగా తలూపుతోంది. అవసరమైతే సుప్రీంకోర్టుకూ వెళతామంటోంది. సీఎం కేసీఆర్​తో జరిగిన రివ్యూలో హెల్త్​ డిపార్ట్​మెంట్​అధికారులు లేవనెత్తిన అంశాలంటూ విడుదలైన నోట్​ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కేసులు, మరణాల సంఖ్య, వైరస్​ అన్ని ప్రాంతాలను చుట్టుముట్టడంపై జనంలో ఆందోళన పెరిగిపోయింది. తమకు టెస్టులు చేయాలని, ఆదుకోవాలని కొన్నిచోట్ల బాధిత కుటుంబాల వాళ్లు భయంతో గోడు వెళ్లబోసుకుంటున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. ఎవరు కోరినా వినేది లేదు, ఎందరు కేసులు వేసినా తగ్గేది లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. పాజిటివ్​ కేసులున్న ఇండ్లలోని కుటుంబ సభ్యులకు కూడా వైరస్​ లక్షణాలుంటేనే తప్ప టెస్టులు చేయబోమంటూ పంతం పట్టినట్టు వ్యవహరిస్తోంది. అసలు కరోనాకు సంబంధించి వివిధ అంశాలపై వచ్చిన పిటిషన్ల విచారణలో హైకోర్టు కీలక కామెంట్లు చేసింది. పలు ఆదేశాలూ ఇచ్చింది. ఇలాంటి అంశాల్లో హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ పట్టించుకోకపోవడం కోర్టు ధిక్కరణ సంకేతాలు పంపుతోంది. ‘అసలు మేమిచ్చే ఆదేశాలు అమలు చేస్తరా.. లేదా..’ అని హైకోర్టు నిలదీసే పరిస్థితి వచ్చింది.

ఆచరణ యోగ్యం కాని ఆదేశాలంటూ..

హైకోర్టు ఆదేశాలను పక్కనపెట్టిన సర్కారు.. న్యాయస్థానాలపై జనానికి ఉన్న గౌరవం సన్నగిల్లేలా కామెంట్లు చేయటం చర్చనీయాంశమైంది. కొందరు పిల్స్ వేయడం వల్ల రోజూ కోర్టుకు తిరగాల్సి వస్తున్నదని, దాంతో వైద్య సేవలు అందించడంలో అధికారులు ఇబ్బంది పడుతున్నారని తాజాగా సీఎం రివ్యూ అనంతరం నోట్ రిలీజైంది.

ఏ కారణంతో చనిపోయినా సరే.. కరోనా టెస్టులు చేయాలన్న హైకోర్టు ఆదేశాన్ని అమలు చేయడం సాధ్యం కాదని, సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని హెల్త్​ డిపార్ట్​మెంట్​ అభిప్రాయంగా వెల్లడించింది. రాష్ట్రంలో ఏదో మూల, ఏదో కారణంతో రోజూ సగటున వెయ్యి మంది చనిపోతున్నారని, వారందరికీ టెస్టులు చేయడమెట్లా సాధ్యమని.. అదే పనిగా పెట్టుకుంటే ఇతర ట్రీట్​మెంట్లు, డెలివరీల కోసం వచ్చే వారి పరిస్థితి ఏమిటని పేర్కొంది. హైకోర్టు ఆదేశాలు ఆచరణ యోగ్యం కాదన్నది.

ఇదేమిటని అడిగితే అగ్గి మండుడే..

రాష్ట్రంలో కరోనా టెస్టులు, డాక్టర్లకు తగిన సేఫ్టీ కిట్లు, రెడ్ జోన్, కంటెయిన్​మెంట్​ జోన్లలో టెస్టులు, చనిపోయిన వారికి టెస్టుల విషయంలో ఇటీవల హైకోర్టులో వివిధ పిల్స్​పై విచారణ జరిగింది. చిక్కుడు ప్రభాకర్, పీఎల్​ విశ్వేశ్వరరావు, సీహెచ్​ నరేశ్ రెడ్డి, ఎస్.వరుణ్, తిరుమలరావు, డాక్టర్​ కేపీ రాజేందర్, ఆమిత్ర ఆర్యేంద్ర తదితరులు వేర్వేరుగా ఈ పిటిషన్లు దాఖలు చేశారు. తన భర్త ఆచూకీ చెప్పాలంటూ.. గాంధీ హాస్పిటల్లో కరోనాతో చనిపోయిన మధుసూదన్​రెడ్డి భార్య మాధవి పిటిషన్​ వేశారు. టెస్టులు చేయకుంటనే రెడ్​జోన్లను గ్రీన్​ జోన్లుగా మారుస్తరా అంటూ సంకినేని వరుణ్​రావు మరో పిటిషన్​ వేశారు. ప్రైవేటు హాస్పిటళ్లు, ల్యాబుల్లో కరోనా టెస్టులు, ట్రీట్​మెంట్​కు అనుమతించాలని హైదరాబాద్​కు చెందిన గంటా జయకుమార్​ ఇంకో పిల్  వేశారు. జనం ప్రయోజనం కోసం వేసిన ఈ పిల్స్​ అన్నింటి విషయంలో హైకోర్టు సర్కారును నిలదీసింది. పలు ఆదేశాలు జరీ చేసింది. వాటిని అమలు చేయాల్సిన రాష్ట్ర సర్కారు.. ఉల్టా రూట్​ మార్చింది. కొందరు వరుసగా కోర్టులను ఆశ్రయిస్తూ ప్రభుత్వాన్ని పనిచేసుకొనివ్వడం లేదంటూ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల కామెంట్​ చేశారు. కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేసి, ప్రజలను గందరగోళ పరుస్తున్నారని.. ఆ ప్రచారం వెనుక కుట్ర ఉందని ఏకంగా సీఎంవో నుంచి వచ్చిన నోట్​లో పేర్కొనడమంటే అసలు సమస్యను పక్కదారి పట్టించడమనే విమర్శలున్నాయి.

తక్కువ చేస్తున్నరెందుకు?

రాష్ట్రంలో ఎక్కువ టెస్టులు చేస్తే.. కేసులు మరింత ఎక్కువగా బయటపడే అవకాశం ఉంది. హెల్త్​ డిపార్ట్​మెంట్​ అధికారులే ఈ విషయం చెప్తున్నారు. సర్కారు సూచనల మేరకే టెస్టులు చేయడం లేదని అంటున్నారు. రోజూ టెస్టుల సంఖ్య, కేసుల సంఖ్య ఐసీఎంఆర్‌ (ఇండియన్​ కౌన్సిల్​ఆఫ్​ మెడికల్​ రీసెర్చ్) ‌కు తప్పకుండా చెప్పాలన్న రూల్​ ఉంది. టెస్టులు చేసి కేసులు పెరిగితే, వైరస్‌ను కట్టడి చేయలేదన్న అపవాదు వస్తుందన్న ఆలోచనతో సర్కారు ఉందని అధికారులు ఆఫ్‌ ది రికార్డుగా చెప్తున్నారు. వైరస్ సోకినా 85 శాతం మందికి ట్రీట్‌ మెంట్‌ లేకుండానే తగ్గిపోతోందని, ఇదే సర్కారుకు కలిసివస్తోందని అంటున్నారు. టెస్టులు ఎక్కువ చేస్తేనే వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అవకాశం ఉంటుందని, ఇలా వదిలేస్తే ఒకేసారి ఎక్కువ కేసులు, మరణాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

టెస్టుల్లో వెనుకబడ్డ రాష్ట్రం

ప్రజల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా, హైకోర్టు మొట్టికాయలు వేసినా, జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చినా కూడా కరోనా టెస్టుల విషయంలో రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో రోజూ వేల సంఖ్యలో టెస్టులు చేస్తుంటే.. ఇక్కడ మాత్రం వందలతోనే సరిపెడుతున్నారు. ఈ నెల 6 నుంచి 8 వరకూ మూడ్రోజుల్లో మహారాష్ట్రలో 41,385 మందికి, తమిళనాడులో 47,279 మందికి, యూపీలో 35,718 మందికి, రాజస్థాన్‌లో 38,723 మందికి టెస్టులు చేయించారు. మిగతా రాష్ట్రాల్లోనూ రోజూ 2,500 నుంచి 15 వేల టెస్టులు చేస్తున్నారు. అదే మన రాష్ట్రంలో కేవలం 1,857 మందికే చేయించారు. ఇందులో 452 (24.34 శాతం) మందికి పాజిటివ్‌ వచ్చింది. దేశంలోని మూడు రాష్ట్రాల్లో మొత్తం టెస్టుల సంఖ్య 5 లక్షలు, మరో మూడు రాష్ట్రాల్లో 4 లక్షలు, ఇంకో ఆరు రాష్ట్రాల్లో 2 లక్షలకుపైగా టెస్టులు చేశారు. మన రాష్ట్రంలో సోమవారం నాటికి చేసిన టెస్టులు 36,300 మాత్రమే. దేశంలోని 21 రాష్ట్రాల కంటే మనం వెనుకబడి ఉన్నాం. మనకన్నా తక్కువ టెస్టులు చేసినవి గోవా, సిక్కిం, మణిపూర్‌‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ వంటి చిన్న చిన్న రాష్ట్రాలే. ఇప్పుడా రాష్ట్రాల్లోనూ టెస్టుల సంఖ్య పెంచుతున్నారు. మన రాష్ట్రంలో మాత్రం ఇంకా తగ్గిస్తున్నారు. ప్రైమరీ కాంటాక్టుల్లోనూ అందరికీ టెస్ట్‌ చేయడం లేదు. కేవలం హైరిస్క్‌, సింప్టమాటిక్‌ ఉన్నవాళ్లకు చేసి వదిలేస్తున్నారు.

పిల్స్​ విచారణలో హైకోర్టు కామెంట్స్

  • పొరుగు రాష్ట్రాల్లో ఎక్కువ టెస్టులు చేస్తుంటే.. రాష్ట్రంలో ఎందుకు చేయడం లేదు. లక్షణాలుంటెనే టెస్టులు చేస్తామనే నిర్ణయానికి కారణమేంటో చెప్పాలి. (మే8న)
  • గాంధీ, ఉస్మానియాల కంటే మెరుగైన సౌకర్యాలున్న కార్పొరేట్​ హాస్పిటళ్లలో కరోనా ట్రీట్​మెంట్​ చేయించు కుంటే ప్రభుత్వానికేం ఇబ్బ        (మే 12)
  • మరణించిన వాళ్ల బాడీలకు టెస్టులు చేయకపోతే.. వాళ్లెట్లా చనిపోయారో ఎట్లా తెలుస్తుంది?  (మే14)
  • సూర్యాపేటలో టెస్టులు ఎందుకు ఆపేశారు. టెస్టులు చేయకుండానే ఆరెంజ్​ జోన్లను గ్రీన్​ జోన్లుగా ఎందుకు మార్చారు?(మే 18)
  • ప్రైవేటు హాస్పిటళ్లు, ల్యాబుల్లో కరోనా టెస్టులు చేయించాలి.. ప్రజలకు తాము కోరుకున్న చోట ట్రీట్​మెంట్​ చేయించుకునే హక్కు ఉంది.        (మే 20)
  • పొరుగు రాష్ట్రాల్లో లక్షల్లో టెస్టులు చేస్తుంటే.. తెలంగాణలో వేలల్లోనా.. తెలంగాణకు ప్రత్యేక రాజ్యాంగముందా..?(మే 26)
  • మధుసూదన్​ మృతి వివరాలు ఇవ్వండి. చనిపోతే ఆయన భార్యకు చెప్పరా?(జూన్ 4)
  • పీపీఈ కిట్లు ఇస్తే డాక్టర్లకు కరోనా ఎట్లొచ్చింది. డాక్టర్లకు పర్సనల్​ మెడికల్​ కిట్లు ఇవ్వాలి.(జూన్​ 4)
  • టెస్టులు ఎక్కువ చేయాలని చెప్పినా ఎందుకు పట్టించు కోవట్లే. కట్టె కొట్టె తెచ్చే అన్నట్లుగా రిపోర్టులా? ఆఫీసర్లపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటం. (జూన్​8న)

డెడ్ బాడీలకు టెస్టులు చేయలేం