మన ఊరు.. మన టూరిజం!.. త్వరలో తెలంగాణలో విన్నూత కార్యక్రమం..

మన ఊరు.. మన టూరిజం!.. త్వరలో తెలంగాణలో విన్నూత కార్యక్రమం..
  • త్వరలో వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం
  • కార్యక్రమ రూపకల్పనలో అధికారులు నిమగ్నం
  • స్టూడెంట్లు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం
  • జిల్లాల్లో టూరిజం ప్రాంతాల అభివృద్ధి, ప్రమోట్ చేసేలా కార్యాచరణ

హైదరాబాద్, వెలుగు: పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో పాటు వాటిని ప్రమోట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ‘మన ఊరు.. మన టూరిజం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నది. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లోనూ పర్యాటక ప్రదేశాల అభివృద్ధితో పాటు వాటిని ప్రపంచానికి పరిచయం చేయాలన్న లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నది. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువతను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని భావిస్తున్నది. ‘మన ఊరు.. మన టూరిజం’ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే తేదీలను ప్రకటించనున్నట్లు తెలిసింది. కార్యక్రమాన్ని ఏ జిల్లా నుంచి ప్రారంభించాలి? ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఏర్పాటు!

రాష్ట్రంలో చాలా జిల్లాల్లో చారిత్రక ప్రదేశాలు, ఖ్యాతిగాంచిన దేవాలయాలు, కోటలు (పోర్టులు), చెరువులు, ట్రెక్కింగ్, గుట్టలు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో ఎన్ని కిలో మీటర్ల పరిధిలో ఏ పర్యాటక ప్రాంతం ఉన్నదనేదానిపై అధికారులు రూట్​మ్యాప్ సిద్ధం చేశారు. చారిత్రక కట్టడాలు, ఆలయాలు, సహజ జలపాతాలు తదితర పర్యాటక ప్రదేశాలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేలా కసరత్తు చేస్తున్నారు. కళలు, చేతివృత్తుల వంటి వాటిని ప్రోత్సహించడంతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేలా టూరిజం శాఖ కార్యాచరణ రూపొందిస్తున్నది. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువతను భాగస్వామ్యం చేసి వారికి అవగాహన కల్పించడంతో పాటు పర్యాటక స్థలాల పర్యవేక్షణ, పరిరక్షణలో భాగస్వాములను చేయాలని భావిస్తున్నది. పర్యాటక స్థలాల సందర్శన, సౌకర్యాల కల్పనపై స్థానికులతో చర్చించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టనున్నారు. పర్యాటక స్థలాల సంరక్షణ, పరిశుభ్రత, ప్రచార కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలు చేపట్టేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేగాకుండా, ప్రతి జిల్లాలో పర్యాటక అభివృద్ధి కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ టాస్క్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ప్రజాప్రతినిధులు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయనున్నాయి. ఈ కార్యక్రమంతో యువతకు పర్యాటకంపై అవగాహనతో పాటు వారికి ఉపాధి అవకాశాలు లభించే ఛాన్స్ ఉంది.

‘తెలంగాణ దర్శిని’తో పర్యాటక ప్రదేశాల సందర్శన

కేంద్రం పీఎంశ్రీ పథకం కింద కొన్ని స్కూళ్లను ఎంపిక చేసి అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నది. స్టూడెంట్లను విహారయాత్రలకు తీసుకెళ్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ‘తెలంగాణ దర్శిని’ పేరుతో స్కూల్ నుంచి కాలేజీ స్థాయి స్టూడెంట్లకు పర్యాటక, చారిత్రక ప్రాంతాలపై అవగాహన కల్పిస్తున్నది. సెకండ్ క్లాస్ నుంచి డిగ్రీ చదివే స్టూడెంట్లను వివిధ పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్లేందుకు నిధులు కేటాయిస్తున్నది. విద్యార్థులు ఏకో టూరిజం, కళలు, చేతివృత్తులు, సాంస్కృతిక, చారిత్రక, శాస్త్రీయ ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నది. ఇప్పుడు టూరిజం శాఖ ‘మన ఊరు.. మన టూరిజం’ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నది. దీనిద్వారా ప్రతీ జిల్లాలోని పర్యాటక స్థలాలను గుర్తించడంతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పించాలన్నది  ప్రభుత్వం లక్ష్యం. రోడ్లు, వసతి సౌకర్యాలు, గైడెడ్ టూర్స్, డిజిటల్ ప్రమోషన్ వంటి అంశాలపై ఫోకస్ పెట్టింది. సామాజిక మాధ్యమాలు, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్ల ద్వారా పర్యాటక ప్లేస్​లను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. పర్యాటక రంగం అభివృద్ధితో పాటు హోటళ్లు, రవాణా, చేతివృత్తులు, గైడ్ సేవలు వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కానున్నాయి. తద్వారా ఆయా ప్రాంతాలకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.