
- యూరియా సక్రమ పంపిణీకి సర్కార్ చర్యలు
- పాలేరు సెగ్మెంట్ పరిధిలో సెప్టెంబర్ 3నుంచి అమలు
- పీఏసీఎస్‌ల ద్వారానే నేరుగా రైతులకు అందజేత
- అదనంగా మరో34 సబ్ సెంటర్లు ఏర్పాటు
- ఈ సీజన్ లో ప్రైవేటు వ్యాపారులకు పూర్తిగా బంద్
- మంత్రి పొంగులేటి ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు
ఖమ్మం, వెలుగు : రైతులకు యూరియా పంపిణీలో కొరత రాకుండా, సక్రమంగా సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలతో సొంత సెగ్మెంట్ పాలేరులో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టు ద్వారా యూరియాను రైతులకు పంపిణీ చేస్తారు. ఇది సక్సెస్అయితే రాష్ట్రమంతటా ఇంప్లిమెంట్ చేయొచ్చని ఖమ్మం జిల్లా అధికారులు చెప్పారు. యూరియాను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్)కు, వాటి పరిధిలోని సబ్‌సెంటర్లకు పంపిణీ చేస్తారు. అనంతరం నేరుగా రైతులకు యూరియా అందించేందుకు ప్లాన్చేశారు.
ప్రైవేట్ వ్యాపారులు, డీలర్లు యూరియాను బ్లాక్‌మార్కెట్ కు తరలించే చాన్స్ లేకుండా కట్టుదిట్టంగా పంపిణీ చేపడతారు. పాలేరు నియోజకవర్గానికి తాజాగా 45 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించారు. ఇది మంగళవారం సబ్‌సెంటర్లకు చేరుకోనుంది. బుధవారం నుంచి రైతులకు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
వందశాతం రైతులకు పంపిణీ చేసేందుకుఇప్పటివరకు యూరియాను 60 శాతం పీఏసీఎస్‌లకు కేటాయిస్తుండగా, 40 శాతం ప్రైవేట్ డీలర్లకు ప్రభుత్వం ఇస్తుంది. ఇకముందు ప్రైవేట్ డీలర్లకు నిలిపివేసి, కేవలం పీఏసీఎస్‌లు, సబ్‌సెంటర్ల ద్వారానే పంపిణీ చేయనుంది. పాలేరు సెగ్మెంట్ పరిధిలో 16 పీఏసీఎస్‌లు ఉండగా.. యూరియాను త్వరగా, సులభంగా రైతులకు అందించేందుకు ఆయా పీఏసీఎస్‌ల పరిధిలో 34 సబ్సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు.
ప్రతి 2,500 ఎకరాలకు ఒకటి చొప్పున మొత్తం 50 కేంద్రాల ద్వారా నేరుగా రైతులకు అందజేస్తారు. సబ్‌సెంటర్లకు వ్యవసాయ విస్తరణ అధికారులు ఇన్ చార్జ్ లుగా ఉంటారు. ఇప్పటికే సెంటర్ల నిర్వహణకు పంచాయతీరాజ్, రెవెన్యూ, వ్యవసాయ, ఇతర శాఖల నుంచి అవసరమైన సిబ్బందిని డిప్యూటేషన్‌పై నియమించారు. స్టాక్అమ్మేందుకు కావాలసిన ఈ పోస్మెషీన్లను 70 వరకు అందుబాటులో ఉంచారు. స్టాక్ అందుబాటులోకి వచ్చిన రోజే రైతులకు పంపిణీ చేసేవిధంగా అధికారులు చూస్తారు.
సబ్ సెంటర్ల ఏర్పాటు ద్వారా..
ప్రస్తుత వానాకాలం సీజన్లో పాలేరు సెగ్మెంట్ పరిధిలో 11,838.09 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 5,070.34 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. మరో 29.94 మెట్రిక్ టన్నులు స్టాక్ఉంది. దీనికి అదనంగా కొత్తగా వచ్చిన యూరియాను కూడా రైతులకు పంపిణీ చేస్తారు.
పీఏసీఎస్‌లను విభజించి సబ్సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా చిన్న రైతులకు కూడా యూరియా సక్రమంగా అందే చాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా బ్లాక్‌మార్కెట్ కు కూడా అడ్డుకట్ట పడుతుందని పేర్కొంటున్నారు.
బ్లాక్ మార్కెటింగ్ ను అరికడతాం..
యూరియా స్టాక్ వచ్చిన రోజే వివిధ శాఖల ప్రభుత్వ సిబ్బందిని నియమించి రైతులకు సక్రమంగా పంపిణీ చేస్తాం. బ్లాక్ మార్కెట్ కు యూరియా తరలకుండా అరికడతాం. ప్రైవేట్ వ్యక్తుల జోక్యాన్ని నివారిస్తాం. జిల్లాలో 16 పీఏసీఎస్‌ల పరిధిలో 34 సబ్ సెంటర్లను ఏర్పాటు చేశామని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.
చిన్న రైతులకు ప్రాధాన్యత ఇస్తాం
యూరియా కోసం రైతులు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ముందుగా చిన్న రైతులను ఆదుకునేందుకు పీఏసీఎస్‌లను విభజించి సబ్సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. ముందేపెద్ద రైతులు యూరియా తీసుకుంటే మళ్లీ రాకుండా చర్యలు తీసుకుంటాం. చిన్న రైతులకు సహకరించాలని అవగాహన కల్పిస్తాం. నానో యూరియా వినియోగం పెంచేలా చూడాలని అధికారులను ఆదేశించాం. బ్లాక్ మార్కెట్ కు ఎవరైనా యూరియా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.